Oct 11,2020 18:38

మాల్దా : దేశంలో నిరుద్యోగం ఎంతలా పెరిగిపోయిందో ఈ ఒక్క సంఘటనే నిదర్శనం. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల 2వేల ఫారెస్ట్‌ అసిస్టెంట్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హతగా 8వ తరగతిని నిర్ణయించింది. కానీ దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హత చూస్తే..షాక్‌ అవ్వడం అధికారుల వంతైంది. ఇంజనీర్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లే కాదు ఏకంగా రీసెర్చ్‌ స్కాలర్లు సైతం కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యావంతులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని, ఏ ఉద్యోగం దొరకక ఇలాంటి పోస్టులకైనా సరే చేరతామని అభ్యర్ధులు మాల్దా ఫారెస్ట్‌ డివిజన్‌ రేంజ్‌ అధికారి సుబీర్‌ కుమార్‌ తెలిపారు. దరఖాస్తు దారుల్లో పిహెచ్‌డితో పాటు మాస్టర్స్‌ డిగ్రీ చేసిన వారున్నారని వెల్లడించారు.
చరిత్ర విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసిన సుదీప్‌ మెయిత్రా అనే అభ్యర్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం పొందడమే తన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవని, అనేక మంది ఉద్యోగాలు పోయాయని, కంపెనీలు మూతపడ్డాయని, ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదని, ఒప్పంద ప్రాతిపదికననైనా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రక్తిమ్‌ చందా ..ఎకనామిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసిన మరో అభ్యర్థి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగం చేయకుండా ఉండటం కన్నా.. ఏదోక ఉద్యోగంతో కొంత సొమ్మును సంపాదించడమే మెరుగని అన్నారు.