
తిరువనంతపురం : సవాళ్లను స్వీకరించి ముందుకు సాగగల విశ్వాసాన్ని పొందగలిగాం. కాబట్టి ఆశావాదంతో నూతన సంవత్సరానికి వెళ్దాం... అన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సృష్టించిన సంక్షోభాలతో ఒక సంవత్సరం గడిచిపోయింది. మనకు ప్రియమైనవారిని వేరుచేయడం, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక జీవితంపై నిషేధం వంటి అనేక కష్టాలను కూడా భరించాల్సి వచ్చింది. అసాధారణ ధైర్యం, ఐక్యత, బాధ్యతలతో వీటన్నింటినీ అధిగమించగలిగాం. అదేవిధంగా పండుగల సమయంలో కూడా, కోవిడ్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ తమను తాము నియంత్రించుకోవాలని విజయన్ అన్నారు. ఇప్పటివరకు అందరూ పాటించిన జాగ్రతలు, బాధ్యత ఈ మహమ్మారిని నివారించడానికి దోహదం చేశాయి. ఇకముందు కూడా దీన్ని కొనసాగించాలి అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.