Jul 27,2023 06:29

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఘర్షణల్లో ఘోరమైన హింసాకాండ జరిగిన విషయం ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చనిపోయిన వారి సంఖ్య తప్ప ఆ మృతులు ఊరూపేరూ లేనివారు మాత్రమే. ఎంతమంది చచ్చిపోయారంటే అధికారులు, అధినేతలు తోచిన సంఖ్య చెబుతున్నారు. ముఖ్యమంత్రి 19 అంటే రాష్ట్ర ఎన్నికల అధికారీ షరామామూలుగా అదే అంటున్నారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌లో నెంబర్‌ టూ గా వుంటూ రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ఆమె మేనల్లుడు 15 మంది చనిపోయారని వేరే పాట పాడతాడు. పోలీసులేమో 48 మృతదేహాలు లభ్యమైనాయని కోర్టుకు నివేదిస్తారు. చివరగా 56 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మీడియాలో సమాచారం వస్తుంది. బెంగాల్‌లో ఎంత అమానుషమైన ఘటన జరిగినా నిజంగా జరిగిన ప్రాణనష్టం కంటే అధికారిక లెక్కలు తక్కువే వుండటం పరిపాటి.
అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపర్చి నిరంకుశంగా ప్రతిపక్షం గొంతు నొక్కడం బెంగాల్‌లో కొత్తేమీ కాదు. కాని ఈసారి రకరకాల పద్ధతులలో ఎన్నికల రిగ్గింగ్‌ పరాకాష్టకు చేరింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని, గతంలో ఎన్నడూ ఎరగని స్థాయిలో గూండాయిజాన్ని, ధనబలాన్ని ఉపయోగించి పంచాయతీ ఎన్నికలను బూటకంగా మార్చేసింది. ప్రజలపై ఆయుధాలతో విరుచుకుపడి యాభై మందికి పైగా బలయ్యే పరిస్థితి కల్పించింది. అయితే ముఖ్యమంత్రికి మాత్రం ఇవన్నీ చాలా చిన్నచిన్న మామూలు విషయాలుగా కనిపిస్తాయి. చచ్చిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటారు. రాష్ట్రం ఇప్పుడు క్రోనీ పెట్టుబడిదారీ రాజకీయ బ్రోకర్ల చేతుల్లో చిక్కింది. ప్రతిచోటా ప్రజలను కొల్లగొట్టడమే వారి పని. అది జరగాలంటే రాజకీయ అధికారం కావాలి. పంచాయతీ, మునిసిపాలిటీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు మిలటరీ అధికారులు, మీడియా వంటివన్నీ వుంటేనే అధికారం సాగుతుంది. కాబట్టి వీటిని ఎలాగైనా గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇందుకు ఎవరు ఏ కాస్త ప్రతిఘటన చూపినా అణచిపారేయాలి. వాళ్ల మీద దాడులు చేయాలి. తప్పుడు కేసులు పెట్టాలి. శిక్షించాలి. దుష్ప్రచారాలు చేయాలి. డబ్బుతో ఓట్లు కొనడం, అదీ కుదరకపోతే బలవంతంగా లాక్కోవడం. మీడియాను కొనేసి ఏకపక్షంగా అబద్ద ప్రచారాలు చేయడం, దాంతో ప్రజల బుర్రలు ఖరాబు చేయడం ఇదీ తంతు. ఇందుకోసం 56 కాదు వంద శవాలైనా పెద్ద లెక్క కాదు.

  • ఎవరీ మృతులు?

ఇంతకూ ఈ 56 మంది ఎవరు? పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలోనే తొమ్మిది మంది బలైనారు. మరికొన్ని మృతదేహాలు గుట్టుచప్పుడు కాకుండా మాయం చేయబడ్డాయి. ఎందుకంటే టిఎంసి తరపున బాంబులేయడానికి, దాడులు చేయడానికి కిరాయి గూండాలను తెచ్చుకుంటే వారు కాస్త ఆ ఘర్షణల్లో చనిపోయారు. వారందరి లెక్కలు తీయడం కుదరని పని. కేంద్ర బలగాలను సకాలంలో క్రమపద్ధతిలో మోహరించి వుంటే కొన్ని ప్రాణాలైనా నిలిచేవి. నామినేషన్ల దశలోనే ప్రతిపక్షాలను అడ్డుకోవాలనేది తృణమూల్‌ తరహా ప్రజాస్వామ్యం. తుపాకులతో విరుచుకుపడి తూటాల వర్షం కురిపించాలి. ఇన్ని చేస్తున్నా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చి నామినేషన్లు వేస్తామంటే ఎలా ఊరుకుంటాం? ఎంత ధైర్యం? యువకుడైన మన్సూర్‌ ఆలం తృణమూల్‌ గూండాల చేతుల్లో హతమయ్యాడంటే తప్పు సిపిఎంది కాదా? మొదట్లో పోలీసులు చెప్పిన ఈ కథనే మీడియాలో కొందరు ప్రచారం చేశారు కూడా. భంగర్‌లో నామినేషన్లు వేసే సమయంలో గూండాలు బిడివో కార్యాలయంపై బాంబులు వేసి బీభత్సం సృష్టించారు. బిడివో కూడా పరిస్థితి దారుణంగా వుందని మొదట ఒప్పుకున్నారు. సిపిఐఎం, ఐఎస్‌ఎఫ్‌లకు చెందిన 101 మంది నామినేషన్లు వేయడానికి అవకాశమిచ్చారు. కానీ సాయంత్రానికి అంతా మారిపోయింది. నామినేషన్లు తిరస్కరించారు. క్రోనీ పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్న యంత్రాంగంలో వీరంతా భాగాలే.

  • మీడియా కుమ్మక్కు, మార్కెట్‌ ఏజన్సీలు

నిజానికి రాష్ట్ర గవర్నర్‌ మొదట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్నికల కమిషనర్‌ నియామకానికి నిరాకరించారు. కాని ఆయన తర్వాత ఎవరి హుకుంతో మనసు మార్చుకుని ఆఘమేఘాల మీద తననే నియమించారో ఎవరికీ తెలియదు. నిజంగా ఆయన హింసాకాండను అడ్డుకోవాలనుకుంటే కేంద్ర నియమిత వ్యక్తిగా ఢిల్లీకి ఎందుకు పరిగెత్తలేదు? కావాలని బలగాలను పంపకుండా ఆలస్యం చేస్తున్న కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు? ఆర్భాటంగా అధికార దర్పంతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ వృథాగా కాలం గడిపారెందుకు?
క్రోనీ పెట్టుబడిదారులు ప్రభుత్వంలోకి రాజకీయాలలోకి మాత్రమే గాక మీడియాలోకి కూడా పాకుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మార్కెట్‌ శక్తుల చేతుల్లో చిక్కిన బెంగాలీ మీడియా ఆ పని చక్కగా చేసింది. వామపక్షాలు, వాటి మిత్రుల ఎన్నికల ప్రచార వార్తలు పూర్తిగా తొక్కిపట్టింది. తృణమూల్‌, బిజెపిలతోనే నింపేసింది. బిజెప,ి వారి గవర్నర్‌ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారన్న వాతావరణం సృష్టించింది. తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను నేరుగా బిజెపికి బదలాయించడమే ఇక్కడ ఏకైక లక్ష్యం. మోసపూరితమైన బిజెపికి మళ్లీ ఊపిరి పోసే పని గవర్నర్‌, మీడియా భుజాలపై వేసుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యనే నడిచే ద్విముఖ రాజకీయ చిత్రం రూపొందించేందుకు స్క్రిప్టు తయారుచేశాయి. పంచాయతీ నిధుల భారీ గల్లంతు, గ్రామీణ ఉపాధి పథకం నిధుల స్వాహా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో అంతులేని అవినీతి, రోడ్లు కాల్వల మరమ్మతుల సొమ్ము బొక్కేయడం వంటివన్నీ కప్పిపుచ్చడానికే ఈ ఎత్తులన్నీ.
అయితే ఈ రోజున క్రోనీ పెట్టుబడిదారులు కేవలం బిజెపి టిఎంసి రాజకీయ అధికారాలపైనే ఆధారపడి ఊరుకోవడం లేదు. అత్యంత ఖచ్చితమైన పద్ధతులలో ఎన్నికలను రిగ్గింగ్‌ చేయడం నేర్చుకున్నారు. ఐ పాక్‌ (ఇండియన్‌ పాక్‌), ఆప్కో (ఎపిసివో), పిఎఐ (పొలిటికల్‌ ఎనలిస్ట్స్‌ ఇండియా), రాజకీయ వ్యూహకర్త నిరంజన్‌, చాణక్య ప్రమోటర్స్‌ వంటి సంస్థలు ఎన్నికల ప్రక్రియ మొత్తం చేతుల్లోకి తీసుకుంటున్నాయి. క్రోనీల కొమ్ముకాసే పార్టీల తరపున వారే వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆరితేరిన డేటా ఎనలిస్టులు, స్టాటిస్టికల్‌ నిపుణులు, రచయితలు, గాయకులు, అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీలు, ఇంకా కిరాయి సైన్యాలను నడిపే వ్యవస్థలను రంగంలోకి దింపుతున్నారు. మీడియాను కూడా వీరే మేనేజ్‌ చేస్తారు. ఉన్నతాధికారులు, పోలీసు ఆఫీసర్లు, పోలీసు స్టేషన్లు, బిడివోలు వీరి మంచిచెడ్డలు చూసుకుంటారు. ఈ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను చాలా వరకూ వీరే తయారుచేస్తారు. ఏ బూత్‌లలో మామూలుగా ఓటింగు జరగనివ్వచ్చునో ఆక్రమించి రిగ్గింగ్‌ చేయాల్సినవేవో వీరు సర్వే చేసి మరీ నిర్ణయిస్తారు. ఒకవేళ బూత్‌ను హస్తగతం చేసుకోవడం కుదరకపోతే ఓట్ల లెక్కింపు సమయంలో కేంద్రాలలో మాయ చేసేందుకు పథకాలు సిద్ధపరుస్తారు. ఈ వివిధ అధికార మీడియా, పోలీసు వ్యవస్థలు తమ విధి నిర్వహణ చేస్తూనే ఈ పనులు చేసిపెట్టినందుకు కావలసిన 'కవరు'్ల అందుతాయి. డబ్బుతో అంతరాత్మలను కొనవచ్చునని ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అందువల్లనే ఈ ఎన్నికల్లో పోలింగు సిబ్బందికి ఇవ్వాల్సిన అలవెన్సు ఈ సారి నగదు రూపంలో ముట్టింది. మామూలుగా ప్రతి ఎన్నికల నిర్వహణలోనూ కమిషన్‌ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ సొమ్ము జమచేయడం పరిపాటి. మరి ఇటీవలి కాలంలో తొలిసారిగా ఇప్పుడే ఎందుకు నగదు పద్ధతి? ఎందుకంటే ఐప్యాక్‌ ద్వారా వారికి నమ్మకస్తులైన వ్యక్తులకు చేర్చడానికే ఇది అవసరమైంది. అయినా చాలామంది అధికారులు అమ్ముడవడానికి ఒప్పుకోలేదు.

  • పోలింగ్‌ రోజు కట్టుకథలు

ఇక మీడియా సంగతి. పోలింగ్‌ రోజున ఒక వైపున ఇంత బీభత్సం జరుగుతుంటే ఉన్నట్టుండి ఛానళ్లు గవర్నర్‌ హఠాత్‌ సందర్శనను లైవ్‌లో ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆయన పోలింగ్‌ ప్రదేశాలకు వెళ్లి పరిశీలన జరపడమే చూపించాయి. ఎన్నికల రోజున వీధుల్లో పర్యటించడానికి గవర్నర్‌కు రాజ్యాంగ హక్కు లేదనేది అందరికీ తెలుసు. కాని ప్రభుత్వం గవర్నర్‌కు సకల లాంఛనాలు సమకూర్చి పర్యటనకు సహకరించింది. బిజెపి ప్రతినిధిగా వున్న గవర్నర్‌ ఒకవైపు, టిఎంసి అధికార ప్రతినిధి మరోవైపు టీవీ స్క్రీన్లను ఆక్రమించారు. ఆ ప్రతినిధి కూడా శారదా కుంభకోణంలో అరెస్టయి జైలులో వుండి వచ్చిన వ్యక్తి. రెండు పార్టీల మధ్యనే ప్రజల దృష్టిని కట్టడి చేసే ప్రయత్నం ఇది. దీనిద్వారా పోలింగ్‌ అక్రమాలను కప్పిపుచ్చడం మరో వ్యూహం. ఇందులో ఇన్ని శక్తులూ వ్యవస్థలూ కుమ్మక్కయ్యాయన్నమాట. ఇన్ని చేసినా ప్రజలు వామపక్షాలకు ఓటేస్తారేమోనన్న భయం ఇంకా వెంటాడుతుంది గనక లెక్కింపును కూడా తారుమారు చేయాలి. అందుకు ఐప్యాక్‌ వంటి ఏజన్సీలను రంగంలోకి దింపారు. అవేవీ దృష్టికి రాకుండా చేయాలంటే గవర్నర్‌, మీడియా కలసి నాటకం రక్తి కట్టించాలి. మరోవైపున గూండాలు పోలీసుల అండతో బ్యాలట్‌ పేపర్లు ఎత్తుకుపోవడం, ప్రతిపక్ష ఏజంట్లను తరిమేయడం చేస్తుంటే మీడియా ఫోకస్‌ మరోలా వుండటం మహా విపరీతం. సిపిఎం తరపున పోటీ చేసిన ఓ నిరుపేద బలహీన మహిళ చిన్న బాబును పాలక పార్టీ గూండాలు కిడ్నాప్‌ చేసి ఆమెను బెదిరించి తమ పార్టీలో చేరినట్టు ప్రకటింపజేసుకుంటే అది పెద్దవార్తగా మారింది. పోలీసులు ఆ బాబును విడిపించే ప్రయత్నం చేయడం లేదని ఒక్క మీడియా కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇది కూడా ప్రజల చూపు మరల్చే కుట్రేనని చెప్పనక్కరలేదు. ఇన్ని దుర్మార్గాలు, దుస్తంత్రాలతో మొత్తం తారుమారు చేస్తూ మీడియా గ్రామసీమల్లో హరిత వెల్లువ వచ్చేసిందని ప్రచారం మొదలెట్టింది. తృణమూల్‌కు ఇంత బలముంటే ఇంకా రిగ్గింగ్‌లు, గూండాయిజం అవసరం ఏముంటుందని అనుకూల వ్యాఖ్యాతలు భజన మొదలెట్టారు. క్రోనీ పెట్టుబడి పాలన సాగే చోట ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి ఇది. ఈ దారుణ నేపథ్యంలో జులై 11న పంచాయతీ ఫలితాలు వెలువడ్డాయి. కాని ఎన్నికల కమిషనర్‌ కూడా ఎన్నికలు ముగిశాయని, ఇవి అంతిమ ఫలితాలని చెప్పగల స్థితి లేదు.ఏ అభ్యర్థికి తాము గెలిచామో లేదో తుది ఫలితంపై భరోసాలేదు. ఎందుకంటే ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కోర్టుల ఉత్తర్వులపై కొత్త ఓట్లు తీస్తూనే వున్నారు. మీకు చెప్పిందే తుది ఫలితం కాదని విజేతలుగా ప్రకటించబడినవారికి చెబుతున్న స్థితి.

  • బలం పెరిగిన వామపక్షం, ప్రజల ప్రతిఘటన

ఇన్ని ఘోరాలు జరిగినా... హత్యలు, దుర్మార్గాలు, ఎన్నికల అక్రమాలు చెలరేగినా...వామపక్షాలు వాటి మిత్రుల ఓట్లు 12 శాతం పెరిగాయి. అన్ని రకాల అండదండలు గల జాతీయ పార్టీ ఓట్లు 16 శాతం తగ్గాయి. ఇది తృణమూల్‌కు ఏ మాత్రం మింగుడు పడలేదు. తనకు వ్యతిరేకంగా ఓటు చేసిన ప్రజలపై మరో మారు హింసాకాండకు పాల్పడింది. అయితే కొన్ని విషయాలు స్పష్టంగా రుజువైపోయాయి. గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనట్టుగా తృణమూల్‌ పునాదులు కదిలిపోయాయి. దాని గూండాలు చాలా చోట్ల ప్రజల ప్రతిఘటన ధాటికి తోక ముడవాల్సి వచ్చింది. రాత్రివేళ పోలీసులను దింపి తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడిన పరిస్థితి. ఇన్ని దౌర్జన్యాలు జరిగినా వామపక్షం మిత్రుల ఓట్లు పెరిగి తృణమూల్‌ ఓట్లు తగ్గి బిజెపి గణనీయంగా పడిపోవడం అమ్ముడుపోయిన మీడియా అసలు రంగును బయిటపెట్టింది. కేవలం డబ్బుతోనే ప్రజలందరినీ కొనడం సాధ్యమయ్యేది కాదని తేలిపోయింది. నిరంకుశ దోపిడీ పాలన పునాదులను కదిలించడంలో ప్రజలు చిట్టచివరకు జయప్రదమయ్యారు. 2024 ఎన్నికల్లో బిజెపిని అది కాపాడుతున్న మేనత్త, మేనల్లుడి రాజ్యాన్ని, వారి అవినీతి సామ్రాజ్యాన్ని తొలగించే పోరాటం జరుగుతుంది. ఇక దాన్ని కూకటి వేళ్లతో పెకిలించే పోరాటం 2026లో వుంటుంది. ఒక అంధకార యుగం తర్వాత సూర్యోదయం రావడానికి ప్రజలు మరో మూడేళ్లు నిరీక్షించాల్సి వుంటుంది.

article-on-westbengal-panchayat-elections-result-left-parties
వ్యాసకర్త : శామిక్‌ లాహిరి, మాజీ ఎం.పి