
దేశంలోకెల్లా పరిశుభ్రమైన నగరం అవార్డును ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఐదేళ్లుగా వరుసగా అందుకుంటోంది. ఇండోర్ సిటీకి ఇదెలా సాధ్యమైంది? విశాఖ నగరానికి ఎందుకు సాధ్యం కాలేదు. కారణాలు ఏమిటి? ఎప్పుడూ మూడు, పది, ఏడు ర్కాంకుల మధ్యే దోబూచులాట ఎందుకు? అక్కడా, ఇక్కడా, ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో, రోడ్ల పక్కన, కాలువల్లో, మురికి కుంటల్లో చెత్త కనబడుతుంటుంది. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. మరి ఇండోర్‌లో ఎలా సాధ్యమైంది? మనకెందుకు సాధ్యపడలేదు? ఒకసారి ఆలోచించాలి.
2015లో 'స్వచ్ఛ భారత్ అభియాన్'లో భాగంగా అవార్డులు, రివార్డులు, ర్యాంకుల కోసం 'స్వచ్ఛ సర్వేక్షణ్'ను ఏర్పాటు చేశారు. భారతదేశంలోకెల్లా పరిశుభ్రమైన నగరంగా తయారయ్యే అవకాశం, ఆవశ్యకత ఉన్నాయని ఇండోర్ ప్రజలు భావించారు. మొదటి స్థానానికి రావాలన్న లక్ష్యాన్ని ఇండోర్ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అది సాధ్యమైంది. ఇండోర్ కార్పొరేషన్‌కి మన మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) కు మధ్య కొన్ని పోలికలు, వ్యత్యాసాలు పరిశీలిద్దాం. విస్తీర్ణంలో గాని, జనాభాలో గాని, చెత్త సేకరణ గానీ చాలా సారూప్యత ఉన్నది. ఇండోర్ విస్తీర్ణం 525 చదరపు కిలోమీటర్లు. జివిఎంసి విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. ఇండోర్ జనాభా 20 లక్షల 16 వేల 713 మంది. జివిఎంసి జనాభా 24 లక్షలు. ఇండోర్‌లో చెత్త సేకరణ రోజుకి 1115 మెట్రిక్ టన్నులు. జివిఎంసిలో రోజుకు 1200 మెట్రిక్ టన్నులు. కానీ సిబ్బంది ఇండోర్‌లో 15,000 మంది. జివిఎంసిలో మాత్రం కేవలం 3,740 మంది వున్నారు. ఒకటవ ర్యాంకు తెచ్చుకోవడం కోసం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ 5 సంవత్సరాలకు ప్రణాళిక వేసింది. 5 సంవత్సరాలు కష్టపడింది. భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా చేసుకునే అవకాశం, ఆవశ్యకత తమకు ఉన్నాయని ఇండోర్ ప్రజలు భావించారు. మొదటి స్థానంలోకి రావాలన్న పట్టుదలతో ఐదు దశలుగా పనిచేశారు.
1. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), 2. ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, అధికారులను చైతన్యపరచడం. 3. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ (వినియోగం తగ్గించడం, పునరుత్పత్తి, మరలా ఉపయోగించడం), 4. వేస్ట్‌ను తడి, పొడి చెత్తగా విభజించడం. 5. సీవర్ కనెక్షన్ (మురికి నీటి శుద్ధి). ఇందులో రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. జివిఎంసిలో పి.పి.పి అమలు చేస్తారు. అంటే పబ్లిక్కు, ప్రైవేటు, పార్టనర్ షిప్ (భాగస్వామ్యం). కానీ ఇండోర్‌లో ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం వుంది. అక్కడ ప్రభుత్వానికి కృతనిశ్చయం, లక్ష్యం ఉంది. ప్రజలు, అధికారులు, నాయకులను చైతన్య పరచడం, భాగస్వాములను చేయడం. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదట యూజర్ చార్జీలు వేయలేదు.
మొదటి దశలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించింది. 11,000 మంది కార్మికులను కొత్తగా చేర్చుకున్నారు. దీనిలో కొంతమందిని ప్రభుత్వం ద్వారా, మరి కొంతమందిని కాంట్రాక్టు ద్వారా నియమించింది. కార్మికులకు సరిపడా పనిముట్లు, సేఫ్టీ ఇచ్చింది. పని వేళలు నిర్ణయించింది. పిన్ పాయింట్ పెట్టింది.
రెండవ దశలో ప్రజల్ని, అధికారుల్ని, రాజకీయ నాయకులను మొదట చైతన్యపరిచింది. 'తడి - పొడి చెత్తగా వేరు చేయకపోతే చెత్తను తీసుకెళ్లబోము' అని చెప్పారు. 'ఇదంతా మనకోసమే కదా' అని ప్రజలు కూడా రెండు డబ్బాలు తీసుకొని చెత్తను పొడి - తడి చెత్త గా చేశారు.
మూడవ దశలో ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, తిరిగి ఉపయోగించు, వివిధ రకాలుగా వేరు చేయాలన్నారు. ఉదాహరణకు - ఓకే ప్లాస్టిక్ కవర్‌ని తిరిగి ఉపయోగించండి. మరొకటి కొనుక్కునే కన్నా ఆ కవర్నే బ్యాగులో పెట్టుకుని లేదా సైకిల్ లేదా బైకులో పెట్టుకొని మరలా ఉపయోగించండి. వాడిన ఐస్‌క్రీమ్ బాక్సులనే సరుకులు నిల్వ చేసుకునే బాక్సులుగా వాడుకోండి-అన్నారు. మిగతా చెత్తను పేపర్, అట్టలు, ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్, ఇనుము, మెడికల్, ప్రమాదకర చెత్త, డబ్బాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలుగా విభజించారు.
నాల్గవ దశలో చెత్తను ముఖ్యంగా కిచెన్ చెత్త, టీ పొడి మొదలగు వాటిని మొక్కలకు, చెట్లకు ఎరువుగా వాడమన్నారు. ఇళ్లలోనే చేయమన్నారు. ప్రజల్లో కూడా సానుకూల స్పందన వచ్చింది.
ఐదవ దశలో మురికి కాలువలు నదుల్లోనూ, కాలువల్లో కలిసే పాయింట్లను గుర్తించింది. ప్రాసెస్ చేసి కలిసేలా చేసింది. అలాగే పరిశ్రమలు కూడా ట్రీట్‌మెంట్ చేసి పంపే లాగా, కాలువలను శుభ్రంగా ఉండేటట్టు చేశారు. మురికి కాలువల నీరు నదుల్లో గాని, వాటర్ బాడీస్‌లో గాని కలవకుండా, ఒకవేళ కలిసినా ప్రాసెస్ చేసి కలిసేలాగా జాగ్రత్త తీసుకున్నారు. ఉదాహరణకు నాళాలు, డ్రైనేజీ సిస్టమ్‌లో వాటి ఎండ్ పాయింట్స్ ఎక్కడున్నాయి? ఫ్యాక్టరీల నుండి వచ్చే మలినాలు, వ్యర్ధాలు ఎక్కడ కలుస్తున్నాయి? వాటిని ఏ విధంగా శుద్ధి చేస్తున్నారు? ఏ విధంగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు? సర్వే చేసి నదులు, కాలువలను శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇన్ని దశలను కచ్చితంగా అమలు చేసిన తర్వాత ఇండోర్ సిటీ నంబర్ వన్ పరిశుభ్రమైన నగరం స్థానానికి చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ చెత్తనంతా ప్రాసెస్ చేసి ప్రొడక్ట్ కింద మార్చి అమ్మారు. ఏకంగా రూ. ఒక కోటి 50 లక్షలు వచ్చింది. తడి- పొడి చెత్తను ఆరు రకాలుగా విభజిస్తున్నారు. మార్కెట్లో అమ్ముతున్నారు. దీనిలోనే ప్రభుత్వం, ప్రజల ప్రత్యేకత తెలుస్తోంది. ఇంత పెద్ద కర్తవ్యం పూర్తి చేయడానికి ఇండోర్ మున్సిపాలిటీకి కొంత ఖర్చు అవుతుంది. ఏరియాను బట్టి కలెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు. ఆదాయాన్ని బట్టి, కాలనీల వారీగా రూ. 60, రూ. 90, రూ. 150గా నిర్ణయించారు. దీనివల్ల సంవత్సరానికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌కి రూ. 240 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థ (నెఫ్రా) రూ. 43 కోట్ల ఖర్చుతో నాలుగున్నర ఎకరాల్లో రీసైక్లింగ్ యూనిట్ పెట్టింది. వీటన్నిటినీ అన్ని దశలలో కచ్చితంగా అమలు చేసిన తర్వాతే పరిశుభ్రతలో నంబర్ వన్‌గా దేశంలో వరుసగా 5 సంవత్సరాల పాటు ర్యాంకు వచ్చింది.
జి.వి.ఎం.సి. కి మాత్రం డబ్బు ఖర్చు అవకూడదు. గాదెలో గింజలు గాదె లోనే ఉండాలి. కానీ బిడ్డ గారయకాయ లాగా ఉండాలంటే ఎలా? సిబ్బందిని పెంచరు. పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వరు. మైక్రో పాకెట్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పిన్ పాయింట్ సిస్టమ్‌లు అన్నీ ఉన్నాయి. కానీ అధికారులు, పాలకవర్గం వాటి జోలికి వెళ్ళరు. వాతావరణం, నీరు, భూమి, సముద్రం, శబ్ద కాలుష్యాలు, ప్రజల ఆరోగ్యం ఎవ్వరికీ పట్టదు. ర్యాంకులు రమ్మంటే ఎలా వస్తాయి?
(వ్యాసకర్త జి.వి.ఎం.సి కాంట్రాక్ట్ వర్కర్స్
యూనియన్ గౌరవ అధ్యక్షులు (సిఐటియు))