Jan 05,2021 09:27

   విజయనగరం జిల్లా రామతీర్థం పురాతన ఆలయంలో విగ్రహం ధ్వంసం సహా ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరుసగా సంభవిస్తున్న అవాంఛనీయ ఉదంతాలు అందరినీ కలవర పెడుతున్నాయి. ఇదే అదనుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆ పార్టీతో ఇక్కడ పెనవేసుకున్న జనసేన, రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, సాగిస్తున్న రాజకీయాలు మిక్కిలి ఆందోళనకరంగా మారాయి. సంఘటనలకు బాధ్యులు మీరంటే మీరంటూ ఆ పార్టీల నేతలు చేసుకుంటున్న పరస్పర దూషణలు, పోటీ పర్యటనలు రాష్ట్రంలో అసాంఘిక శక్తులను అరికట్టే బదులు ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. ఇటువంటి సంఘటన జరగ్గానే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. సర్కారు సకాలంలో ఆ విధంగా స్పందిస్తే ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ తరహా నేరాలకు పాల్పడాలనుకునే దుండగులు వెనకాడే స్థితి వస్తుంది. కాగా నేరస్తులను పట్టుకునే పని కంటే, ఎలాంటి విచారణ మొదలు కాకుండానే ప్రత్యర్థి పార్టీల వారే బాధ్యులంటూ తాడు బొంగరం లేని విమర్శలు చేయడం తగని పని. ఆ రకంగా ప్రభుత్వంలోని మంత్రులు, ప్రతిపక్ష నేతలే మాట్లాడితే నిందితులు సులభంగా తప్పించుకోడానికి సహకరించినవారవుతారు. దుండగులు మరిన్ని నేరాలకు పాల్పడటానికి నైతిక మద్దతు ఇచ్చినవారవుతారు. నేరాలపై నిగ్గు తేల్చాల్సిన పోలీసుల కంటే ముందే మంత్రులు, అధికార పార్టీ నాయకులు రాజకీయంగా తామెక్కడ వెనుకబడతామోనన్న దుగ్ధతో దండయాత్రల మాదిరిగా దేవాలయాల పోటీ టూర్లకు మందిమార్బలాన్ని వెంటేసుకెళ్లి బలప్రదర్శనలకు దిగడం వలన ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి తప్ప దుశ్చర్యలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్న భరోసా ఇవ్వదు.
      ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం రామతీర్థానికి ఉత్తరాంధ్ర నేతలను, కార్యకర్తలను వెంటేసుకొని భారీ మార్చ్‌ చేయడమూ ఆయాచిత రాజకీయ లబ్ధి కోసమే. ఆధ్యాత్మిక కేంద్రాల్లో విగ్రహాల ధ్వంసం వంటి సున్నిత అంశాలపై బల ప్రదర్శనలు 'రాజకీయంగా 40 ఏళ్ల ఇండిస్టి' అని చెప్పుకునే చంద్రబాబు వంటి సీనియర్‌ పొలిటీషియన్‌ చేయదగిన పని కాదు. సంఘటనలపై చర్యల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పద్ధతి ఇది కాదు. పైపెచ్చు టిడిపి గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి, హిందూ మత సంఘాల కంటే కూడా ఎక్కువ మత ఉద్రిక్తతలు పెంచేలా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పునాదిని శంకించేలా ఉన్నాయి. ఇక ప్రజల మధ్య మత ఉద్రిక్తతలు రాజేయడం కోసమే పుట్టిన బిజెపి కి విగ్రహాల ధ్వంసం ఘటనలు వాటంగా దొరికాయి. అందుకోసమే కాచుక్కూర్చున్న ఆ పార్టీ శ్రేణులు వీరంగం వేస్తూ ప్రజల్లో చిచ్చు పెడుతున్నాయి. 'అమరావతి' సాధన లక్ష్యంతో బిజెపి తో పొత్తు పెట్టుకున్నామన్న జనసేన ఆ విషయాన్ని పక్కనపెట్టి బిజెపి ఎజెండాలో పావుగా మారిపోయింది.
దక్షిణాదిలో ఉనికి సాధించే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌పై బిజెపి కన్నేయగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం వంటి విషయాల్లో ఆ పార్టీ చేసిన మోసం ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిగించింది. దాంతో రామ్‌మాధవ్‌ వంటి వారు తమ 'సహజ సిద్ధ' ఎజెండాకు పదును పెట్టనారంభించారు. ఇదే సమయంలో అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కేంద్రంలో బిజెపి ముందు సాగిలపడిన దృష్టాంతాన్ని బిజెపి చాకచక్యంగా వాడుకునే కుట్రలు రచిస్తోంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇటీవల దుబ్బాక అసెంబ్లీ, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి గెలుపులు ఆ పార్టీ పట్ల అక్కడి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ మెతక వైఖరే కారణం. తెలంగాణ తరహాలో ఎ.పి పైనా ఎక్కుపెట్టామని బిజెపి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా బిజెపి తత్వం వైసిపి, టిడిపి గ్రహిస్తే రాష్ట్రానికి మంచిది. ప్రభుత్వం అప్రమత్తమై విగ్రహాల ధ్వంసం, ఆధ్యాత్మిక కేంద్రాలపై వరుస దాడుల వెనుక అసాంఘిక శక్తుల కుట్రలు లేక రాజకీయ ప్రయోజనాలు ఏవి ఉన్నాయో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి.