భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్ భావనల ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈ భావనల అమలులో ఫ్యూడల్ సంబంధాలు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి.
అంటరానితనం - హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వేల గ్రామాల్లో ప్రబలిపోతోంది. దళితులు ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కుల గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తులు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెలను తగులబెట్టి, ఆస్తులను ధ్వంసం చేసి, మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. ఇప్పటికీ కులాంతర వివాహాలకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతులను అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఆధిపత్య కుల శక్తులు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యలకు గురవుతున్నారు.
రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితులకు ప్రజాస్వామిక హక్కులను, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన దళితులు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక, జీవన స్థితిగతులలో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తులు సృష్టించే వరుస సంఘటనల్లో దళితులు, వెనుక బడిన కులాలకు చెందిన ప్రజలు తగువులాడుకుంటున్నారు. దళితులతో పాటు వెనుకబడిన కులాలకు చెందిన వారూ ఆధిపత్య కుల శక్తుల చేత అవమానాలకు, వివక్షకు గురవుతున్నారు. వీరికి రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా, న్యాయంగా అమలు చేయడం లేదు. నిషేధం వున్నప్పటికీ, దళితులు, వెనుకబడిన కులాల వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చర్యలు, నేరాలు జరగడానికి కారణం ఏమిటి? కుల అణచివేతకు ఒక రూపకల్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజంలోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?
మనుధర్మ శాస్త్రం - హిందూత్వ ముఖ్యాంశాలు
మనుస్మృతి, హిందూత్వ భావజాల ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమ ధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధులు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేసే విధానం, శూద్రుల జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. 'శూద్రులు ఇతర మూడు వర్ణాల వారికి దాస్యం చేయాలని దేవుని ఆజ్ఞ. తక్కువ కులంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణాల వారినెవరినైనా అవమానకరమైన మాటలతో గాయపరిస్తే, అతని నాలుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులాల పేరును అవమానపరిస్తే, అతని నాలుకపై వాతలు పెట్టాలి. శూద్రులకు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టలను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.'' ఇలా సమాజం లోని ఆధిపత్య శక్తులు తీవ్రమైన అణచివేత, హింసను అమలు చేయడం ద్వారా కుల వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.
మనుధర్మశాస్త్రం - వర్గ దృష్టి కోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టి కోణం ఏమిటి? మనుస్మృతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాలు, ప్రచార యంత్రాంగం ఎలా ఉండాలి? అనే అంశాలను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతులు, ఫ్యూడల్ ఆధిపత్యం ఉన్న కాలంలో, 2500 సంవత్సరాల క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాలంలోనే వర్గ, కుల అణచివేతలు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజలు, కులం పేరుతో భయంకరమైన వర్గ, ఆర్థిక అణచివేతల కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీలపై లైంగిక వేధింపులు చెలరేగాయి. కుల, వర్గ భేదాలు దేవుని అభీష్టం మేరకు సృష్టించినవనీ, కాబట్టి ప్రజలందరూ దేవుని అభీష్టాన్ని పాటించాలనీ, వాటిని ఉల్లంఘించిన వారిని శిక్షించాలనీ, ఆ శిక్షించే అధికారం రాజులకు ఇవ్వడమైందనీ మనుస్మృతి చెపుతుంది.
సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాలకవర్గాలుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజులు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉన్నారు. దోపిడీ వర్గాల ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మను శాస్త్రాన్ని రాశాడు. ఆ మను శాస్త్రాన్నే రాజుల పాలనకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాలక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటుచేసుకుంటున్న కుల, లైంగిక అణచివేతలు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటాల ఫలితంగా అనేక మార్పులు జరిగాయి. మానవ జాతి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధనల విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటనలు ఆయా దేశాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కుల) వ్యవస్థ తన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ కుల వ్యవస్థను చాలా కాలం క్రితం సృష్టించారు. ఆ కుల, వర్గ అణచివేతలు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
లింగ వివక్షతకు ఆధారం
మహిళల జీవితాలు మగవారిపై ఆధారపడి, వారికి బానిసలుగా ఎలా ఉండాలనే విషయాన్ని మనుస్మృతి నొక్కి చెప్పింది. ''మహిళలు బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి.'' ''ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సులోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.'' ''ఆస్తి వారసత్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాలు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగాలు, మిగిలిన కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళలకు ఆస్తి హక్కు లేదు).'' ''అన్నదమ్ముల మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహాల కోసం ఇవ్వాలి.'' ఆ విధంగా మనుస్మృతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాలను గమనించవచ్చు. భారతదేశంలో మహిళల సమానత్వం కోసం జరిగిన పోరాటాలు, కుల, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలలో కొన్ని మార్పులు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కలగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.
భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశ సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాలంలో ఉద్భవించిన బడా బూర్జువాలు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో కీలకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్ వ్యవస్థతో రాజీ పడ్డారు. భూసంస్కరణ చట్టాలను సరిగా అమలు చేయలేదు. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూములను, భూమి లేని నిరుపేదలకు, చిన్నరైతులకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్ వ్యవస్థ సంబంధాలు, భావాలు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈ పరిస్థితిలో, ఫ్యూడల్ కాలంలోని మనుస్మృతి, దాని భావజాలం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న పాలక వర్గాలు, తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకొని, శ్రామిక ప్రజలను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కుల వ్యవస్థను, ప్రజల మనోభావాలను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీల పని విధానంలో కుల వ్యవస్థ, కుల మనోభావాల ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పన ఒక కలగానే మిగిలిపోవడం యాదృచ్ఛికం కాదు.
సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా...
ఈ దృష్టి కోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళలకు వ్యతిరేకంగా లైంగిక హింస, కుల అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బలపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్, హిందూత్వ శక్తులు, ప్రజల్లో ఈ సాంప్రదాయ భావాలను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బలంతో అధికారంలో ఉన్న బిజెపి ఈ సాంప్రదాయ భావాలను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాలను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాలంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాలనుకుంటున్నారు. బిజెపి ప్రభుత్వం, 12000 సంవత్సరాల భారత దేశ చరిత్రను తమకు అనుకూలంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరులను వాస్తవాలను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూత్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథలు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
మనుస్మృతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాలతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతిబా ఫూలే, పెరియార్ ఇ.వి.రామస్వామి, బి.ఆర్.అంబేద్కర్, నారాయణ గురు లాంటి కృతనిశ్చయం గల వారు అపారమైన సేవలందించారు. ఈ పోరాటాల ఫలితంగా దళితులు, వెనుకబడిన కులాల ప్రజలు, మహిళలు అనేక హక్కులతో పాటు ప్రత్యేక సౌకర్యాలను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీలకమైన హక్కులలో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాలు కుల, లింగ అణచివేతలను అంతం చేయలేదు. అందువలన ఈ రెండు అణచివేతల వ్యతిరేక పోరాటాలు కేవలం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాలను, ఫ్యూడల్ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వం లోని భారత పాలక వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కలపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాలు, వర్గ పోరాటాలు జమిలిగా కలిపి చేయాలి.
* పి. సంపత్










