ముగిసిన జెవివి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి :శాస్త్రీయ దృక్పథం వైపునకు ప్రజలను మరల్చేందుకు కృషి చేయాలని మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడలోని జెఎన్‌టియుకెలో రెండు రోజులపాటు జరిగిన జనవిజ్ఞాన వేదిక 17వ రాష్ట్ర ప్లీనరీ ఆదివారంతో ముగిసింది. జెవివి రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో శర్మ పాల్గని మాట్లాడారు. కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో సైన్స్ మాత్రమే పరిష్కారం చూపగలిగిందని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో సైన్స్ కీలక పాత్ర వహించిందని తెలిపారు. భావజాలరంగంలో ప్రశ్నించే తత్వాన్ని ప్రజాస్వామ్య కాంక్షను విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చేయాలని సూచించారు. కొందరు కుహనా మేధావులు మూఢనమ్మకాలను పనిగట్టుకుని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనే నినాదాలతో జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రజాసైన్స్ ఉద్యమానికి పునరంకితం కావాలని కోరారు. కోవిడ్ కాలంలో అశాస్త్రీయ భావాలు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన సంఘటనలను ఉదహరించారు. మోడీ హయాంలో శాస్త్రీయతపై దాడి మరింత పెరిగిందన్నారు. సామాన్య ప్రజానీకానికి శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలని దీనికి ఎదురవుతున్న అశాస్త్రీయ భావజాల ఆధిపత్య ధోరణిలను ప్రజాసైన్స్ కార్యకర్తలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం స్వావలంబనను పూర్తిగా దెబ్బతిస్తోందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న నేటి తరుణంలో సైన్స్ కార్యకర్తల పాత్ర ఇంకా పెరగాలన్నారు. శాస్త్ర విజ్ఞానం పట్ల, కొత్త కొత్త ఆవిష్కరణల పట్ల మరింత అవగాహన పెంచాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ స్టాలిన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి రాధా రాణి పాల్గొన్నారు.










