శ్రమజీవుల చెమట చుక్కల సుగంధముతో
పాదుకొల్పిన
ఫల సంపదను దళారులకు
పంచే వంచనను పసిగట్టక
దాసోహమైన దగుల్బాజీతనం వల్లనే కదా
చేనుకు కంచెలాగుండాల్సిన రాజ్యాధికారం
చెదపురుగులా మారింది
అంతరాలు సృష్టించబడిన అవనిలో ఆకలికి
తట్టుకొని అన్నదమ్ముల్లా బతకడమెలాగో నేర్చుకున్నాం!
ఐక్యతను తగలబెట్టాలనే
దగాకోరులకు బుద్ధి చెప్పే వద్దికను అలవర్చుకోలేమా?!
కాలే కడుపులకు కూడును బెట్టని జాడ్యాలు
విషపురుగుల్లా మెదళ్ళను తొలుస్తున్నాయి
కల్గినవాడి కళ్ళు దూరలేని
దుర్భరదారిద్య్రం
గోడల చాటున వెక్కిరిస్తూ
దేశమాత దేహంపై రాసపుండై సల్పుతున్నను
అబద్ధాల అంకెలగారడిలో
అభివృద్ధి ఉరకలు పెడుతూనే ఉంటుంది
చట్టాలు సంపన్నుల కొమ్ముగాస్తుంటే
గాయపడ్డ మట్టి బతుకులు
గర్జించే సింహాలై
రాజధాని వీధుల్లో రణకేతనమయ్యాయి
నివురు గప్పిన నిప్పులాగున్న
శాంతి కాముకుల సత్తువ
నింగినంటుకొంటున్నది
అలుముకున్న చీకట్లను
చీల్చి వెలిగే కిరణాల్లా
ఆకలికేకల సమరం
కొడిగట్టిన ఆశలకు
పునర్జీవమవుతున్నది
- గన్‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731