Jan 10,2023 08:26
  • కిక్కిరిసిన సభా ప్రాంగణం
  • మతోన్మాదంపై సంఘటిత పోరు : పినరయి పిలుపు

మల్లు స్వరాజ్యం నగర్‌ (తిరువనంతపురం) : నారీలోకం కదిలింది. సమానత్వ సాధనే లక్ష్యమని నినదించింది. వర్షపు చినుకులు వంకలై, వాగులై, నదులై సముద్రంలో కలిసినట్టు ఎక్కడికక్కడ చిన్న, చిన్న బృందాలుగా బయలుదేరిన మహిళలు ఐద్వా జాతీయ మహాసభ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకుపోటెత్తారు. దీంతో బహిరంగ సభ జరిగిన మల్లు స్వరాజ్యం నగర్‌ (పుత్తరి కండం మైదానం) నారీ జన సముద్రంగా కనిపించింది. విద్యార్థులు, యువతులు, దినసరి కూలీలు, ఉద్యోగులు, గృహిణిలు ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు బహిరంగసభలో భాగస్వాములయ్యారు. ఐద్వా జెండాలు ప్రదర్శిస్తూ మనువాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. మతోన్మాదాన్ని ఓడించడం ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందని, ఈ లక్ష్య సాధనకు సంఘటిత పోరు చేయాలని ముఖ్య అతిథిగా హాజరైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. భారీ ప్రదర్శనలకుబదులుగా ఎక్కడికక్కడ చిన్న, చిన్న బృందాలుగా చేరి సభకు తరలిరావాలని ఐద్వా ముందుగానే పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో సోమవారం ఉదయం నుండే తిరువనంతపురం నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. అన్ని వార్డుల్లోనూ ఉదయాన్నే పతాకావిష్కరణలు చేశారు. ఆ ప్రాంతంలోని మహిళలందరు అక్కడికే చేరుకుని ప్రదర్శనగా మహాసభ ప్రాంగణానికి బయలుదేరారు. నగరంలోని అన్ని నివాస ప్రాంతాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు జరిగాయి. కేరళ సాంప్రదాయ రీతులను ప్రదర్శిస్తూ కళా రూపాలుగా ఈ ప్రదర్శనలు సాగాయి. ఆయుర్వేద కళాశాల నుండి ప్రారంభమైన ఒక ప్రదర్శనలో తెల్లటి డ్రస్సుపై ఎర్రటి కోటు ధరించిన 13 మంది మహిళలు సాంప్రదాయ డ్రమ్ములు వాయిస్తూ కనిపించారు. మరో 13 మంది యువతులు ఐద్వా జెండాలను ప్రదర్శిస్తూ మార్ఛ్‌ఫాస్ట్‌ చేశారు. 13వ మహాసభకు గుర్తుగా వారు ఈ విన్యాసానిు ప్రదర్శించారు. ఇటువంటి దృశ్యాలే తిరువనంతపురం నగరమంతా కనిపించాయి. ముగింపు సభలో లక్షమంది మహిళలు భాగస్వాములైనట్లు ఐద్వా ప్రకటించింది.