Jul 30,2023 18:07
  • మహిళలకు రక్షణ, భద్రత, రక్షణ కల్పించాలి
  • పోరు యాత్రకు ఘన స్వాగతం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, మద్యం మత్తు పదార్థాలను నియత్రనించాలని, నిపునలతో కమిటీ వేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఐద్వా చేపట్టిన హింసపై మహిళలు పోరుయాత్రకు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐద్వా, సిఐటియు, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, శ్రామిక మహిళలు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోరుయాత్రకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను నివారించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు. ప్రతి చోటా మహిళలపై దాడులు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, మద్యం కారణం అన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హింసను ప్రేరేపించే అశ్లీల చిత్రాలను, ఇంటర్నెట్ కార్యక్రమాలు నిషేదించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కమీషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
విశాఖలో వరలక్ష్మి హత్య సంచలనం కలిగించాయి. రేపల్లె రైల్వేస్టేషన్లోను, విజయనగరంలో ఇద్దరు పిల్లల తల్లి ఇంటిలోనే గ్యాంగ్ రేపు గురికావడం మన రాష్ట్రంలో నేరస్థితికి దర్పణం. 2020 కంటే 2021లో మహిళలపై నేరాలు 25 శాతం పెరిగాయి. (14603-17736). "నిర్భయ, ప్రచారానికి పరిమితమయ్యాయన్నారు. మద్యం మత్తు మందులు ప్రధానంగా ఈ నేరాలు పెరగడానికి కారణమని అనేక సర్వేలు తెలుపుతున్నప్పటికీ వాటిని అరికట్టే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదన్నారు.  ఆంధ్ర రాష్ట్రంలో అరకు ఏజెన్సీ మత్తుమందుల వ్యాపారులకు అడ్డాగా మారాయి. వారికి ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. 
మద్యం మత్తుమందుల దురలవాటుతో యువత జీవితాలను కోల్పోతున్నారు. ఆరోగ్యం నాశనం అవుతున్నది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇన్ని నష్టాలు సమాజానికి కలుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాలో కూడా మద్యం షాపులు తెరిచాయన్నారు. ఎన్నికలకు ముందు మద్య నిషేదం చేస్తానని వాగ్దానము చేసినా అమలులేదు. అధికార ప్రతిపక్షాలు మహిళలపై హింసను నివారించడానికి ఏమి చేయనున్నారో ప్రకటించాలని పోరు యాత్ర ద్వారా డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచాలన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యాయనం చేయటానికి నిపుణులతో కమిటీ వేయాలన్నారు.
మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైనశిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీడియా మానిటరింగ్ కమిటీ ఏర్పాటుచేయాలి. హింస అశ్లీలత అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్, ఇంటర్నెట్ కార్యక్రమాలను నిషేధించాలన్నారు. కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపులను నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. అమలు చేయాలి, మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మండలానికి ఒక్క మద్యం షాపును మాత్రమే అనుమతించాలన్నారు. పై డిమాండ్ల సాధనకు అన్ని పక్షాలను కూడ గట్టి ఐద్వా ఆందోళన సాగిస్తున్నది. రాష్ట్ర వ్యాపితంగా మహిళల పోరు యాత్ర చేపట్టనున్నది. ఆగస్టు 9న విజయవాడలో భారీ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలనీ, అన్ని విధాలా సహాయ సహాకారాలు అందించాలని ఆమె కోరారు. పోరు యాత్రకు ఘన స్వాగతం పలికిన వారిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామమ్మ, నాయకులు వి.లక్ష్మి, ఏ.జగన్మోహన్, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, జె ఏ వి అర్ కె ఈశ్వరరావు, తిరుపతి నాయుడు, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ నాయకులు పావని, జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్, డివైఎఫ్ఐ నాయకులు హరీష్, సతీష్, బి.రమణ, త్రినాథ్, జేవివి సమతా మహిళా కన్వీనర్ జి.నిర్మల అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థినిలు, ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతా వెంట ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిలు వై సత్యవతి  పి పూర్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణి, జిల్లా కార్యదర్శి పి రమణమ్మ పాల్గొన్నారు. జాతలో బాగంగా ప్రజానాట్య మండలి కళాకారులు మద్యం మత్తు వలన ప్రజలు జీవితం, మహిళలు జీవితాలు ఎలా చిన్నా భిన్నం అవుతున్నాయి వివరించారు. అదే విధంగా ఎల్ బి జి నగర్ కళాకారులు వేసిన కోలాటం ఆకట్టుకుంది.