Nov 06,2023 17:41

టెల్‌ అవీవ్‌ :   పాలస్తీనా హక్కుల కార్యకర్త అహద్‌ తమీమ్‌ (22)ను ఇజ్రాయిల్‌ సైన్యం అరెస్ట్‌ చేసింది. హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారన్న అనుమానంతో సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. తదుపరి విచారణ కోసం ఇజ్రాయిల్‌ భద్రతా దళాలకు అప్పగించినట్లు వెల్లడించారు. వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న వలసదారులను హత్య చేయాలని అమీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారని.. అందుకే అరెస్ట్‌ చేసినట్లు ఇజ్రాయిల్‌ మీడియా ఆరోపించింది. ఆ పోస్ట్‌ను ఇజ్రాయిల్‌ దళాలు మీడియాకు పోస్ట్‌ చేశారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఆదివారం రాత్రి ఇజ్రాయిల్‌ మరో రౌండ్‌ దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

వెస్ట్‌బ్యాంక్‌ అంతటా ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు చేపడుతోందని జాతీయ మీడియా పేర్కొంది. రమల్లా సమీపంలోని తమీమ్‌ స్వగ్రామమైన నబీ సలేహ్  నుండి ఆమెను అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

ఇజ్రాయిల్‌ దళాలు తమ ఇంట్లో సోదాలు చేసి, కుటుంబసభ్యుల మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాయని తమీమ్‌ తల్లి నామిమన్‌ తమీమ్‌ తెలిపారు. ఆమె తండ్రిని గతవారం అరెస్ట్‌ చేశాయని, ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ ఆరోపిస్తున్నట్లు ఆ పోస్టులను తన కుమార్తె రాయలేదని, ఆమె పేరుమీద డజన్ల కొద్దీ పేజీలు ఆమె ఫోటోతో పాటు ఉన్నాయని, వాటితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.