నేనొక రాత్రిని అగ్నిలో
దహింపజేస్తున్నాను
అది రాత్రిలోని అగ్నో
అగ్నిని మింగేసిన రాత్రో
నాలోకి చొరబడుతున్న జ్వలనం
నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు
అలజడి ఆవిరవ్వనిచోట
ముగింపులేని పగటిని
రాత్రిలోకి ఈడ్చుకెళుతున్నాను
వెలుగును కమ్మేసిన చీకట్లో
ఏవో కొన్ని అవయవాలు నాపై
దాడిచేస్తున్నాయి
అవయవాలు ముక్కలైనచోట
దేహం తగలబడుతున్నప్పుడు
ఉరితాళ్ల అంచులకు వేలాడుతూ
ఈ దేశాన్నీ నిన్నూ శపిస్తున్నాను
ఆగిపోని ఊపిరిని
ఊదుకుంటూ
ముళ్లకంచెల్లో చిక్కుకున్న
మానాన్ని
దేశపు జండాతో కప్పుకోలేక
దిశమొలతో నిలబడ్డాను
కళ్ల నుండి రాలుతున్న
దుఃఖాగ్నిజ్వాలల్లో మండుతున్న
నా దేహానికి ఏ లేపనమూ పనిచెయ్యదు
రేపటి స్వాప్నిక జీవితం
రక్తపు అలల్లో తడిసిపోయాక
పంచిపెట్టే పందేరాలకు విలువలేదు
నేనులేని నా శరీరానికి జరుగుతున్న
పరీక్షలలో
ఫలితం ఏదైనా నాకు స్వాంతన చిక్కదు
లాఠీ ఎవరి చేతిలో ఉన్నా
నిలువెత్తు కంచెల మధ్య చిక్కుకున్న ప్రశ్న
వేటకొడవళ్లకు బలవుతూనే ఉంది
పూడుకుపోతున్న గొంతుల్లోంచే
నిర్జీవమవుతున్న అవయవాల్లోంచే
నన్ను నేను పోగుచేసుకొని
కూలగొట్టాల్సినదానిపై దృష్టి నిలపాలి
ఆకాశంలోంచే అయినా రేపటిలోకి
అడుగులు వెయ్యాలి
పోగొట్టుకొన్న దేహానికి కొత్తరంగులు
పులుముకోవాలి
- బండ్ల మాధవరావు
8897623332