
న్యూఢిల్లీ : ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఉద్యోగాలు కోతపడుతూనే ఉన్నాయి. ఆ సంస్థ సిఇఒ పరాగ్ అగర్వాల్‌ను ఇంటికి పంపించేసి.. సిఇఒ బాధ్యతలు తీసుకున్న మస్క్ చాలా మంది కీలక సభ్యులపై వేటు వేశారు. కొందరు ఉద్యోగులను తొలగించడంతోపాటు మరికొందరి జీతాల్లో కోత విధించారు. నవంబరు 2022 తర్వాత ట్విట్టర్ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్ మస్క్.. ఇప్పటికే రెండు విడతలుగా ఉద్యోగులను తొలగించారు. అమెరికాకు చెందిన వర్జే న్యూస్‌వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం... గత వారం సేల్స్, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్ మస్క్‌కే ఫిర్యాదు చేశారు. తాజాగా ఉద్యోగాల్లో కోత విధించడానికి గల కారణాలేంటో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.