Jul 16,2022 06:58

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ ప్రభుత్వం అడవి బిడ్డల అభివృద్ధికి కట్టుబడి ఉందని గొప్పలు చెప్పారు. మన్యం జనులనూ కీర్తించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన మహిళను పోటీలో నిలిపిన తమకంటే గిరిజనోద్ధారకులు ఇంకెవరుంటారని బిజెపి నేతలు ప్రచారాన్ని దట్టిస్తున్నారు. అయితే అడవి బిడ్డలపైనా, అటవీ సంరక్షణపైనా మోడీ సర్కార్‌కు కానీ, బిజెపికి కానీ ఏమాత్రం ప్రేమ ఉందో కేంద్ర ప్రభుత్వం 'అటవీ పరిరక్షణ చట్టం' నిబంధనల్లో చేసిన మార్పులు తేటతెల్లం చేస్తున్నాయి. ఆదివాసీలను అందలం ఎక్కిస్తున్నామనే ప్రచార బాకాల హోరులో అడవి బిడ్డల జీవనాధారంపైనే మోడీ సర్కార్‌ ఎంత కసిగా కత్తి నూరిందో స్పష్టం అవుతోంది. ప్రభుత్వ రంగాలను, సహజ వనరులను కార్పొరేట్‌ కంపెనీలకు, క్రోనీ మిత్రులకు కట్టబెట్టేసేందుకు ఉద్దేశించిన 'పైపులైన్‌'లో భాగంగా అడవులపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేట్‌కు దఖలు పర్చేలా బిజెపి ఈ మార్పులు తీసుకొచ్చింది. అటవీ భూముల వాడకానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఈ మార్పులను ఒక నోటిఫికేషన్‌ జారీతోనే మన్యం జీవులపై రుద్దేసింది. అత్యంత వినాశకరమైన ఈ మార్పుల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నా మోడీ సర్కార్‌కు కిమ్మనడం లేదు. అడవి బిడ్డలంటే వారికి అంత ప్రేమ మరి?
                 అటవీ భూముల్లో ప్రాజెక్ట్‌ చేపట్టాలంటే గ్రామ సభ అనుమతే కీలకం. అటవీ హక్కుల చట్టం - 2006 ద్వారా నాటి ప్రభుత్వం ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. అయితే తాజాగా చేసిన నిబంధనల మార్పుల్లో గ్రామసభ అధికారాలకు తిలోదకాలు ఇచ్చేసింది. ప్రయివేటు డెవలపర్స్‌కు అటవీ హక్కులను కట్టబెట్టేసి అడవిపై ఆధారపడిన ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయినట్లే. ప్రయివేటు డెవలపర్స్‌ చేపట్టే చెట్ల నరికివేత, ఇతర పనులకు నిబంధనల్ని సడలించాశారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, ఇతర పేదల అనుమతి అవసరం లేకుండా...భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని ప్రయివేటు డెవలపర్స్‌ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. 2019లో మోడీ సర్కార్‌ కేబినెట్‌లోనే ఉన్న గిరిజన వ్యవహారాల శాఖ వ్యతిరేకించిన మార్పులను, చేర్పులను కూడా కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు చోటు కల్పించింది. కార్పొరేట్‌ కంపెనీల కోసం మోడీ సర్కార్‌ ఎంతగా లొంగిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్టులో ఇదివరకు గరిష్టంగా 100 హెక్టార్ల వరకు మాత్రమే అనుమతులు మంజూరుకు వీలుండేంది. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా 1000 హెక్టార్లకు మోడీ సర్కార్‌ పెంచింది. ఇప్పటికే ఖనిజ తవ్వకాలు, వన్య ప్రాణి సంరక్షణ, పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో అడవి బిడ్డలను అటవీ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నారు. 100 హెక్టార్ల ప్రాజెక్టులతోనే అంతటి వినాశనం జరిగిపోతుంటే..ఇక తాజా నిబంధనలతో 1000 హెక్టార్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే ఎంతటి వినాశం జరుగుతుందో ఊహించవచ్చు.
          అటవీ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకైనా గ్రామసభ నిర్ణయమే ప్రథమం..ఫైనల్‌. పాత నిబంధనావళి ప్రకారం, మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా..అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. కానీ ఇప్పుడు గ్రామసభ, ఆదివాసీల జీవితాలు నామమాత్రం కానున్నాయి. ఈ పర్యావసనాల వల్ల అడవిపై కార్పొరేట్‌ వ్యాఘ్రాల పెత్తనం పెరిగిపోతుంది. దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీల జీవితాలు అగమ్యగోచరంగా తయారౌతాయని ప్రాథమిక అంచనా. బడా కార్పొరేట్లకు కేటాయించిన ప్రాజెక్టుల కోసమే చట్టంలో ఈ మార్పులు తీసుకొచ్చిందన్నది స్పష్టం. ఆదివాసీలకు రాజ్యాంగం 5, 6 షెడ్యూళ్లలో దఖలు పర్చిన హక్కులను, అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యపర్చేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం ధిక్కరించేలా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకించాలి. అడవికే రక్షణ లేకపోతే ఇక గిరిజనులకు మనుగడ ఎలా సాధ్యం?