Jan 24,2021 06:32

దేశంలో బాలికల సమగ్ర అభివృద్ధికి 'గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌' పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం తెచ్చింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది. వాటిలో భాగమే జాతీయ బాలికా దినోత్సవం. 2008 నుంచీ దీన్ని ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తోంది. తర్వాత కేంద్రం 'బేటీ బచావో...బేటీ పఢావో' పథకాన్ని ప్రవేశ పెట్టింది. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు. అయితే బాలురతో పోలిస్తే బాలికలకు ఇంకా పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. ప్రతి వెయ్యి మంది బాలురకు 940 బాలికలు మాత్రమే మన దేశంలో ఉన్నారు. మూఢనమ్మకాల వల్ల, వరకట్నం, సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల వల్ల ఆడపిల్లలను కనడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలుగా ఉన్నాయి. 170 సంవత్సరాల క్రితమే మన దేశంలో బాలికా విద్యకి సావిత్రి బాయి ఫూలే, ఫాతిమా బేగంలు పునాదులు వేశారు. ఈ క్రమంలోనే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేటి కరోనా కాలంలో కూడా బాల్య వివాహాలు విపరీతంగా జరిగాయి. కొన్ని ప్రాంతాలలో తల్లిదండ్రులు ముందుగానే స్కానింగ్‌ ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకొని అబార్షన్‌ చేయించి గర్భంలోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. మరోవైపు బాలికలపై నానాటికీ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. బాలికలకు సాధికారత లభిస్తేనే మహిళా సాధికారత వస్తుంది. అందుకు విద్యే ఏకైక మార్గం.
(నేడు జాతీయ బాలికా దినోత్సవం)
* యమ్‌. రామ్‌ ప్రదీప్‌, సెల్‌ : 94927 12836.