ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాస సేతు నిర్మాణంలో ప్రమాదం జరిగింది. రైలింగ్ పై సెగ్మెంట్ ను అమర్చేందుకు ఎత్తుతుండగా క్రేన్ రోప్ తెగడంతో ప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. మృతులు పశ్చిమ బెంగాల్ కు చెందిన అబిజిత్, బీహార్ కు చెందిన బార్డో మండల్ గా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
- చనిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రమణ్యం డిమాండ్
శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకున్నది. ఇద్దరూ కార్మికులు చనిపోయారు. ఈ సంఘటనకు కారకులైనటువంటి కాంట్రాక్టర్ పైన, అధికారుల పైన కేసు నమోదు చేయాలని, మృతుల మృతులకు ఒక్కొక్కరికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నగర్ కార్యదర్శి టి.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
టీటీడీ యాజమాన్యం, మున్సిపల్ యంత్రాంగం పనులు వేగవంతం కావాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేశారు. కాంట్రాక్టర్ కార్మిక చట్టాలకు భిన్నంగా రాత్రి వేళలో పని చేయించడంతోపాటు, కార్మికులపై ఒత్తిడి చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు సిపిఎం సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.










