Nov 25,2022 08:05
  • ఏడాదేడాదీ తగ్గుతున్న రైతులు, లబ్ధి
  • మసకబారుతున్న నవరత్నం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతు రుణాలపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ రాయితీ ఏడాదేడాదీ బక్కచిక్కిపోతోంది. రీయింబర్స్‌ చేసే సొమ్ముతో పాటు లబ్ధిదారుల సంఖ్య సైతం అంతకంతకూ కుంచించుకుపోతోంది. లక్ష రూపాయల్లోపు రైతులు బ్యాంకుల నుంచి తీసుకునే స్వల్పకాలిక పంట రుణాలకు సున్నా వడ్డీ అనగా, పంపిణీ చేసిన అప్పులు, పొందుతున్న లబ్ధికి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంటోంది. నవరత్నాల్లో భాగంగా 'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' పథకాన్ని మూడేళ్ల నుంచి సర్కారు అమలు చేస్తోంది. ముచ్చటగా మూడో తడవ ఈ నెల 28న సున్నా వడ్డీని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలేట ఖరీఫ్‌లో ఇచ్చిందే తక్కువ కాగా రెండవ ఏట ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు మూడవ ఏట అంతకంటే ఇంకా తగ్గిపోయింది. రబీ పరిస్థితి కూడా అలాగే ఉంది.
 

                                                                 మాట మార్పు

రైతులు బ్యాంకులకు 'అసలు' చెల్లిస్తే చాలు, వడ్డీ విషయం ప్రభుత్వమే చూసుకుంటుందని ఎన్నికల ముందు వైసిపి హామీ ఇచ్చింది. అధికారంలోకొచ్చాక మాట మార్చింది. రైతులు ముందుగా వడ్డీతో సహా తీసుకున్న అప్పును బ్యాంకులకు చెల్లించిన అనంతరం వడ్డీ చెల్లిస్తామంది. వ్యవసాయ రుణాలపై 7 శాతం వడ్డీ ఉండగా, రూ.లక్ష లోపు రుణాలపై కేంద్రం మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తే, తతిమ్మా 4 శాతం వడ్డీ రాష్ట్రం పెట్టుకుంటుందని, సున్నా వడ్డీకే రుణాలందుతాయని పేర్కొంది. రూ.లక్ష పైన- 3 లక్షల లోపు రుణాలపై అంతకు ముందున్న పావలా వడ్డీ పథకాన్ని ఎత్తేసింది. కాగా సున్నా వడ్డీ క్లెయిముల పరిష్కారం పూర్తయ్యేసరికి ఏడాదిన్నర దాటిపోతోంది. రైతులు వడ్డీతో సహా అప్పులు చెల్లించాక ఎప్పటికో ప్రభుత్వం వడ్డీ జమ చేస్తోంది. అదీ ఏ సీజన్‌కు ఆ సీజన్‌ కాకుండా ఖరీఫ్‌, రబీ రెండూ కలిపి మరుసటి సంవత్సరం చివరాఖరిలో విడుదల చేయడంతో రైతులు వడ్డీ సొమ్ము కోసం నెలల పర్యంతం ఎదురు చూడాల్సి వస్తోంది.
 

                                                                   వారిపైనే నెపం

సున్నా వడ్డీ లబ్ధిదారులు, ప్రభుత్వ రీయింబర్స్‌ మెంట్‌ తగ్గిపోవడానికి రైతులే కారణమని ప్రభుత్వం నెపం వేస్తోంది. నిర్ణీత గడువు లోపు రైతులు వడ్డీతో సహా రుణాలు చెల్లించకపోవడం వలన లబ్ధి తగ్గిపోతోందని తప్పించుకుంటోంది. 'సకాలం'లో చెల్లించాలన్న నిబంధన వడ్డీ రాయితీ పొందడానికి రైతులకు అడ్డంకిగా తయారైంది. దాంతో రైతులకు పంపిణీ చేస్తున్న రుణాల్లో నామ మాత్రపు రుణాలకే సున్నా వడ్డీ వర్తిస్తోంది. 2021-22 ఖరీఫ్‌లో బ్యాంకులు రూ.57 వేల కోట్ల పంట రుణాలిచ్చాయి. వాటిలో రూ.లక్ష లోపు రుణాలు 70-80 శాతం వరకు ఉంటాయి. వాటన్నింటికీ (సుమారు రూ.42 వేల కోట్లు) సున్నా వడ్డీ ఇవ్వాలంటే సర్కారు దాదాపు రూ.1,400 కోట్లివ్వాలి. ఇచ్చేది రూ.115 కోట్లు మాత్రమే. 2020-21 రబీలో బ్యాంకులు రూ.51,635 కోట్లిచ్చాయి. వాటిలో రూ.లక్ష లోపు రుణాలపై సున్నా వడ్డీ సుమారు రూ.1,200 కోట్లి వ్వాలని అంచనా. ఇస్తామంటున్నది రూ.45 కోట్లు మాత్రమే. రెండేళ్ల నుంచి బడ్జెట్‌లో సున్నా వడ్డీకి రూ.500 కోట్లు ప్రతిపాదిస్తుండగా వాటిలో చాలా మట్టుకు ఖర్చు కావట్లేదు. ఇ-క్రాప్‌, ఆర్‌బికెలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శన, సోషల్‌ ఆడిట్‌, ఉన్నతాధికారుల రాండమ్‌ చెకింగ్‌ వంటి వాటి వలన లబ్ధిదారులు ఏరివేతకు గురవుతున్నారు. సున్నా వడ్డీ రైతులకు అందట్లేదు. పథకం నీరుకారిపోతోంది.

                                                                     క్షీణత ఇలా

2019-20 ఖరీఫ్‌లో సున్నా వడ్డీ లబ్ధిదారుల సంఖ్య 14.5 లక్షలు, జమ చేసిన వడ్డీ రూ.510 కోట్లు. 2020-21 ఖరీఫ్‌లో లబ్ధిదారులు 6.67 లక్షలు, అమౌంట్‌ రూ.112.7 కోట్లు. రేపో మాపో ఇవ్వబోయే 2021-22 ఖరీఫ్‌లో లబ్ధి పొందనున్న రైతులు 5.68 లక్షలు, విడుదల చేసే సొమ్ము రూ.115.33 కోట్లు. రబీ విషయానికొస్తే 2019-20లో లబ్ధి దారులు 6.27 లక్షలు, అమౌంట్‌ రూ.128.47 కోట్లు. ఈ నెల 28న 2020-21 రబీ సున్నా వడ్డీ జమ చేస్తున్నారు. లబ్ధిదారులు 2.54 లక్షల మంది, విడుదల చేసే సొమ్ము రూ.45.22 కోట్లని సర్కారు వెల్లడించింది.

22