
ఐపీఎల్ కొత్త సీజన్ పుణ్యమా అని బెట్టింగ్ దందా పడగ విప్పి బుసలు కొడుతున్నది. ఉజ్వల భవిష్యత్ వున్న యువత ఈ మాయదారి బెట్టింగ్ ఉచ్చులో పీకలదాకా కూరుకుపోయి ఎంతో డబ్బును కోల్పోతున్నారు. దీంతోపాటు, చదువులను అటకెక్కిస్తూ అథోగతి పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ జాఢ్యాన్ని, జూదాన్ని అరికట్టడానికి పోలీసు డిపార్ట్‌మెంట్ వారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి అవేవీ పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. విద్యార్థులు ఈ మాయదారి జూదం లోంచి బయటపడలేక వేలాది, లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు సైతం చేసుకోవడం న్యూస్ పేపర్లలో, ఛానెళ్లలో చూస్తున్నాం. ఇప్పటికయినా విద్యార్థుల తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ వారి ఉన్నత, ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి. పోలీసు డిపార్ట్‌ంట్ వారు సైతం ఈ బెట్టింగ్ అనే ఈ విష మాయాజాలన్ని పెంచి పోషిస్తున్న వారిపై కొరడా ఝుళిపించి, ఈ అనాగరిక క్రీడను కూకటి వేళ్ళతో సహా పెకలించేందుకు నడుం బిగించాలి. సమాజంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు వెంటనే మేల్కొని...ఈ బెట్టింగ్ నిర్మూలనకు తన వంతుగా కృషిచేయాలి.
- బుగ్గన మధుసూదనరెడ్డి,
బేతంచెర్ల, నంద్యాల జిల్లా.