Jul 20,2023 08:33
  •  టమోట కేజీ రూ.150
  •  అల్లం కేజీ రూ.400

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. ధరలిట్టా పెరగబట్టే... అన్నట్లుగా ఉంది ప్రజల పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో నిత్యావసర ధరలు పగలే చుక్కలు చూపుతున్నాయి. రూ.500లు తీసుకొని కూరగాయల మార్కెట్‌కి వెళ్లితే సంచి నిండా కూరగాయలు వచ్చే పరిస్థతి లేదు. ధరలు అదుపు చేస్తామంటూ ప్రభుత్వ అధికారులు నానా యాగీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. సన్న బియ్యం రేట్లు తగ్గిస్తామంటూ కేజీ సన్నబియ్యం రూ.44.50లకు విక్రయించేలా ట్రేడర్స్‌ ద్వారా కౌంటర్లు ప్రారంభించారు. ఈ కౌంటర్లకు స్పందన లేదు. టమోటా కేజీ వందకు చేరిన టమోట ధరను అదుపు చేసేలా రైతు బజార్లలో కేజీ టమోట రూ.50లకు విక్రయించేలా కౌంటర్లు ఏర్పాటు చేసినా స్టాక్‌ వచ్చిన గంటలోపే ఖాళీ అవుతోంది. ఉదయం 6 గంటల నుండీ కౌంటర్ల వద్ద క్యూవ్‌ కడుతున్నారు.

  • పెరిగిన నిత్యావసరాల ధరలు...

బియ్యం, పప్పు, వంట నూనెలు, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతికి పగలే చుక్కలు చూపుతున్నాయి. సన్నబియ్యం సాధారణ రకం 25 కేజీలు రూ.1,400 నుండీ 1,500 అమ్మడుపోతోంది. కందిపప్పు కేజి రూ.150 , చక్కెర కేజి రూ.40, మినపప్పు కేజి రూ.120 బహిరంగ మార్కెట్‌లో అమ్మడుపోతోంది. వీటి తోడు వంటగ్యాస్‌ ధర రూ.1000 ఇక కూరగాయల విషయానికొస్తే టమోట ఏకంగా కిలో రూ.150, అల్లం రూ.400, పచ్చిమిర్చి రూ.120, వంకాయ రూ.40, బెండ రూ.45, కాకర రూ.60, బీన్స్‌ రూ.60, బీర రూ. 40, క్యారెట్‌ రూ.60, క్యాబేజి రూ.40 ఇలా అన్ని రకాల కూరగాయల ధరాలు గత నెలతో పొచ్చితే రెండు రెట్లు పెరిగాయి. గత నెల టమోట కిలో రూ.30 నుంచి 40 ఉంటే గత వారం రోజులుగా కిలో టమోట రూ.150 తగ్గడం లేదు. నిత్యావసర సరుకుల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి, హోటల్‌ నిర్వాహకులు బెంబెలెత్తిపోతున్నారు. దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికుల పరిస్థితి ఇంకా దారుణం. నిత్యావసర వస్తువుల ధరలు అమాతంగా పెరగడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. పౌరసరఫరాశాల, జిల్లా అధికారులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాన్య, మధ్యతరగతి కోరుతున్నారు.

  • ధరలను అదుపు చేసేందుకు చర్యలు  - శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. లైసెన్స్‌ దార్లు, ట్రేడర్స్‌తో చర్చించి జిల్లా వ్యాప్తంగా నిత్యవసర వస్తువులను సరసమైన ధరలకు పంపిణీ చేసేలా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈమేరకు చిత్తూరు, పలమనేరు, నగరి ఇతర ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.44.50పైసలు, కందిపప్పు కేజీ రూ.140 ఇతర నిత్యావసరాలు కూడా సరసమైన ధరలకు ఈ కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నాం. అలాగే టమోట కిలో రూ.50లకు రైతులు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నాం. మరో వైపు కృతిమ కొరత సృష్టించేలా స్టాక్‌ను దాచిన గోడౌన్‌లపై దాడులు చేయాలని పౌర సరఫరాశాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.