Sep 11,2023 20:32

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్‌సిపికి ఓటమి భయం పట్టుకుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలవలేమనే వైసిపి ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని ఆయన వ్యాక్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారని నాదెండ్ల తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నవారిపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని ఆయన తప్పుబట్టారు. గుంటూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్‌ తదితరులను అన్యాయంగా అరెస్ట్‌ చేశారన్నారు. మరోవైపు గుంటూరు నగర మేయర్‌, ఎమ్మెల్యే కూడా దారుణంగా వ్యహరించారని, వ్యాపారులను ఒత్తిడికి గురిచేసి దుకాణాలను బలవంతంగా తెరిపించాలని యత్నించారని నాదెండ్ల విమర్శించారు. గుడివాడలో జనసేన కార్యకర్తపై స్థానిక ఎస్‌ఐ దాడి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడం సరైన పద్ధతి కాదని చెప్పారు.