
''నల్ల సముద్రం ఒప్పందాలు ఇంక ఎంత మాత్రం అమలులో వుండవు'' అని గత నెల 17న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఆహార ధాన్యాల సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు గతేడాది జులైలో కుదిరిన బ్లాక్ సీ గ్రెయిన్ ఇనీషియేటివ్‌ను నిలుపుచేస్తూ రష్యా నిష్కర్షగా చేసిన ప్రకటన ఇది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, టర్కీ అధ్యక్షుడు సమక్షంలో ఇస్తాంబుల్ రష్యా, ఉక్రెయిన్ అధికారులు గతేడాది జులై 22న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని 'ఆశా కిరణం'గా గుటెరస్ అభివర్ణించారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది, ఇప్పటికే యుద్ధం జరుపుతున్న రెండు పక్షాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం విశేషమైనది. రెండవది, గోధుమలు, బార్లీ, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలు, పొద్దు తిరుగుడు నూనెలను ప్రధానంగా ఉత్పత్తి చేసేది రష్యా, ఉక్రెయిన్‌లే. పైగా నైట్రోజెన్, ఫాస్పరస్ ఎరువుల ఉత్పత్తి కూడా ఈ రెండు దేశాల నుండి ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగడం వల్ల సరఫరాలకు ఆటంకం కలిగితే ప్రపంచ ఆహార మార్కెట్లపై, ప్రపంచ ప్రజల ఆకలిపై తీవ్ర ప్రభావం వుంటుందని భావించారు.
- ఆకలికి దారి తీస్తున్న ద్రవ్య పెట్టుబడి
ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఆకలితో బాధపడుతున్న నేపథ్యంలో రష్యా 'ఆహారాన్ని ఆయుధంగా మార్చడం' పట్ల తమ దేశం ఆందోళన చెందుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. నిజానికి, ప్రపంచ దేశాల్లో ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారని, 310 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నారని 'ప్రపంచ దేశాల్లో ఆహార భద్రత, పోషకాహారం పరిస్థితి'పై ఐక్యరాజ్య సమితి నివేదిక (జులై 12, 2023) పేర్కొంది. అయితే ఈ నివేదికలోనే ఒక ఆసక్తికరమైన అంశం వుంది: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం వల్లనే 2.3 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. అయితే ఆహార మార్కెట్ల వాణిజ్యీకరణ ప్రభావం, కోవిడ్ మహమ్మారి వంటి క్షుద్బాధకు సంబంధించిన ఇతర సూచీలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి.
వాస్తవానికి ఆహార కొరతలు వున్నాయని, అయితే ''ప్రస్తుత ఆహార సంక్షోభం, సరఫరా సంక్షోభం కన్నా ధరల సంక్షోభమే తీవ్రమైనదని ఆహార మార్కెట్లలో స్పెక్యులేటివ్ కార్యకలాపాలపై అధ్యయనం చేసిన డాక్టర్ సోఫీ వాన్ హులెన్ గతేడాది చివరిలోనే పేర్కొన్నారు. 'బ్లాక్ సీ గ్రెయిన్ ఇనీషియేటివ్' అమలు ఇలా ముగిసిపోవడం నిజంగా విచారించదగ్గదే. కానీ ప్రపంచ దేశాల్లో ఆకలికి ఇదే ప్రధాన కారణం కాదు. ప్రధాన కారణం ఆహార మార్కెట్లలో స్పెక్యులేటివ్ కార్యకలాపాలే. దీనిని యూరోపియన్ ఆర్థిక, సామాజిక కమిటీ కూడా అంగీకరించింది.
- రష్యా ఈ ఒప్పందాన్ని ఎందుకు నిలిపివేసింది?
ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఇస్తాంబుల్‌లో సంయుక్త సమన్వయ కేందాన్ని (జెసిసి)ని ఏర్పాటు చేసింది. ఇందులో రష్యా, టర్కీ, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు సభ్యులుగా వున్నారు. క్రిమియా లోని సెవాస్తోపోల్‌లో రష్యాకి చెందిన నల్ల సముద్ర దళంపై ఉక్రెయిన్ దాడి చేయడం (ఈ దాడిలో ఆహార ధాన్యాలు తీసుకెళుతున్న నౌకలు వున్నాయి) వంటి పలు సందర్భాల్లో, షిప్‌మెంట్లపై రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య తలెత్తే ఉద్రిక్తతలను జెసిసి పరిష్కరించాల్సి వచ్చింది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కట్టుదిట్టం చేయడంపై ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతూ వున్నాయి. ఈ ఆంక్షల కారణంగా రష్యా తన సొంత వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేయలేకపోతోంది. ఐక్యరాజ్య సమితితో చర్చల సందర్భంగా రష్యా తన సొంత వ్యవసాయ వ్యవస్థకు సంబంధించి మూడు అవసరాలను పేర్కొంది. మొదటిది, రష్యా వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగపడే ప్రధాన రుణ, వాణిజ్య బ్యాంక్ అయిన రష్యన్ అగ్రికల్చర్ బ్యాంక్‌ను స్విఫ్ట్ వ్యవస్థకు తిరిగి అనుసంథానించాల్సిందిగా రష్యన్ ప్రభుత్వం కోరింది. గతేడాది జూన్‌లో యూరోపియన్ యూనియన్ ఆరవ ఆంక్షల ప్యాకేజీ ద్వారా స్విఫ్ట్ వ్యవస్థతో బ్యాంక్ బంధం తెగిపోయింది. రష్యన్ వ్యవసాయ బ్యాంక్‌కు సాధారణ లైసెన్స్‌ను యూరోపియన్ యూనియన్ జారీ చేసే అవకాశం వుందని, అలాగే 'బ్లాక్ సీ గ్రెయిన్ ఇనీషియేటివ్'లో భాగంగా ఎగుమతిదారులు చెల్లించినంత కాలమూ అమెరికా డాలర్లలో లావాదేవీలు నిర్వహించేందుకు జెపి మోర్గాన్‌ను ఉపయోగించుకునే అవకాశం బ్యాంక్‌కు వుందని టర్కిష్ బ్యాంకర్ తెలిపారు.
రెండవది, గ్రెయిన్ ఇనీషియేటివ్ గురించి మొదటగా చర్చలు జరిగినపుడు, రష్యా నుండి అమ్మోనియా ఎరువుల ఎగుమతి ఒడెసా ఓడరేవు ద్వారానే జరగాలని, అలాగే లాత్వియా, నెదర్లాండ్స్‌లోని సరఫరాల నుండే జరగాలని మాస్కో కోరింది. ప్రపంచంలోని అతి పొడవైన అమ్మోనియా పైప్‌లైన్ టోగ్లియాట్టి-ఒడెసా పైప్ లైన్‌ను తిరిగి తెరవాలన్నదే చర్చల్లో ప్రధాన అంశంగా వుంది. ప్రపంచ మార్కెట్‌లో రష్యన్ అమ్మోనియా అమ్మకాలకు వీలు కల్పించే ఒప్పందంపై గతేడాది జులైలో ఐక్యరాజ్య సమితి, రష్యాలు సంతకాలు చేశాయి. ''ఇప్పటికే పశ్చిమ ఆఫ్రికాలో, ఇతర చోట్ల వ్యవసాయాన్ని ప్రభావితం చేసిన తీవ్రమైన ఎరువుల మార్కెట్ సంక్షోభాన్ని సడలించేందుకు సాధ్యమైనవన్నీ మేం చేస్తున్నాం.'' అంటూ ప్రకటించడానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ భద్రతా మండలికి వెళ్ళారు. ''ఎరువుల మార్కెట్ సుస్థిరంగా లేనట్లైతే, వచ్చే ఏడాది ఆహార సరఫరా సంక్షోభం తలెత్తే అవకాశం వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచ దేశాలకు ఆహారం లేకుండా పోవచ్చు'' అన్నారాయన. ఈ ఏడాది జూన్ 8న, ఖర్కీవ్‌లోని టోగ్లియాట్టి-ఒడెసా పైప్‌లైన్‌లో కొంత భాగాన్ని ఉక్రెయిన్ బలగాలు పేల్చివేశాయి. దీంతో ఈ వివాదంపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నల్ల సముద్రం ఓడరేవులు కాకుండా, రష్యాకు తన అమ్మోనియా ఆధారిత ఎరువులు ఎగుమతి చేయడానికి సురక్షితమైన మార్గం ఇంకోటి లేదు.
మూడవది, యంత్రాలు, విడి భాగాలు దిగుమతి చేసుకునే సామర్ధ్యం లేకపోవడం, ఇతర అనేక విదేశీ ఓడరేవుల్లో ప్రవేశించలేకపోవడంతో రష్యా వ్యవసాయ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి పశ్చిమ దేశాల ఆంక్షల్లో కొన్ని సడలింపులు వున్నప్పటికీ, సంస్థలపై, వ్యక్తులపై ఆంక్షలు రష్యన్ వ్యవసాయ రంగాన్ని మరింత నిర్వీర్యం చేశాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొనడానికి రష్యా, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కొన్ని వస్తువుల ఎగుమతులపై నిషేధం, లైసెన్సింగ్ అవసరాలు పెరగడం (సమ్మిళిత ఎరువులతో సహా, యుద్ధానికి ముందు పేర్కొన్న అవసరాలతో పాటు), ఎగుమతి పన్నులు పెంచడం ఈ ఆంక్షల్లో వున్నాయి. ఇతర దేశాలకు తిరిగి ఎగుమతి చేసే భారత్ వంటి దేశాలకు వ్యూహాత్మక ప్రత్యక్ష అమ్మకాలతో పాటు రష్యా ఈ చర్యలు తీసుకుంది.
జులై చివరిలో, సెయింట్ పీటర్స్ బర్గ్‌లో రెండో రష్యా-ఆఫ్రికా ఆర్థిక, మానవతా వేదిక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఈ అంశాలన్నీ ప్రధానంగా చర్చకు వస్తాయి. సదస్సుకు ముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాతో సమావేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆఫ్రికా ఖండానికి ఆహార పదార్ధాలు, ఎరువులు ఎగుమతి చేయడంలో రష్యా ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేశారు. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనీషియేటివ్ గురించి మాట్లాడుతూ, ''ఆఫ్రికా ఖండంతో సహా అవసరమున్న దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. కానీ అది అమలు కావడం లేదు.'' అన్నారు. ఒక్క మాసం లోగా తిరిగి ఈ ఒప్పందం అమలయ్యే అవకాశాలు వున్నాయి. గతంలో నిలుపు చేయబడిన సమయాల్లో ఎప్పుడూ కూడా నాలుగు వారాలను మించలేదు. కానీ ఈసారి, తన సొంత వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు పశ్చిమ దేశాలు, రష్యాకు ఎలాంటి ఉపశమనం ఇస్తాయో ఇంకా స్పష్టం కాలేదు.
ప్రపంచం నలుమూలలా ఆకలి సమస్యతో పోరాడుతున్న లక్షలాదిమంది ప్రజలను కచ్చితంగా ఈ ఒప్పందం అమలు నిలుపుదల దెబ్బతీస్తుంది. అయితే ఇప్పటికే ఆహార మార్కెట్లలో స్పెక్యులేటివ్ కార్యకలాపాల కారణంగా ఆకలితో అలమటిస్తున్న కోట్లాదిమందిపై మాత్రం ఈ పరిణామాల ప్రభావం ప్రత్యక్షంగా వుండబోదు.
వ్యాసకర్త 'లెఫ్ట్‌వర్డ్ బుక్స్' సంపాదకులువిజయప్రసాద్