
- ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు
- 1న విజయవాడలో ఎపిఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
ప్రజాశక్తి-గుంటూరు:రెవెన్యూ శాఖ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఎపిఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర 17వ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గుంటూరులో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. పనికి తగినట్లుగా మండల స్థాయిలో సిబ్బంది, నిధులు, సౌకర్యాలు లేవన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో ఉన్నందున ఆరోగ్య సర్వే, హౌసింగ్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ వంటి ఇతర అదనపు పనుల నుండి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలని కోరారు. సాధారణంగా వంద రోజులు పట్టే రీ సర్వేను 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్తున్నారని, సాధ్యం కాదని చెబుతున్నా చేయాల్సిందేని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణతోపాటు, 2022 జనవరిలో వచ్చిన క్లైమ్‌లు కూడా ఇప్పుడు రీ వెరిఫికేషన్ చేయాలని చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పని భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిరణ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి యం.వెంకటరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం పోస్టర్‌ను ఆవిష్కరించారు.