Jul 28,2023 22:25
  • హింసపై హిందూపూరం, విశాఖ నుంచి ఐద్వా ఆధ్వర్యాన పోరుయాత్రలు ప్రారంభం

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : దేశంలో, రాష్ట్రంలో చిన్నారులపైనా, మహిళలపైనా హింస రోజురోజుకూ పెరుగుతోందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మహిళల రక్షణ కోసం ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నుంచి మహిళల పోరుయాత్ర రాష్ట్ర జాతాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి వద్ద ఒక యాత్రను కార్మికురాలు అక్కమ్మ, విశాఖ నగరంలోని ఎల్‌ఐసి కార్యాలయ సమీపంగల అంబేద్కర్‌ విగ్రహం వద్ద మరో యాత్రను సిపిఎం మాజీ కార్పొరేటర్‌ బట్టా ఈశ్వరమ్మ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలపై హింస నివారణకు నిపుణులతో అధ్యయన కమిషన్‌ ఏర్పాటు చేయాలని, మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని తదితర డిమాండ్‌తో చేపట్టిన ఈ రెండు యాత్రలూ ఆయా జిల్లాల్లో పర్యటించి విజయవాడ చేరుకోనున్నాయి. ఆగస్టు ఎనిమిదిన విజయవాడలో బహిరంగ సభ జరగనుంది. యాత్రల ప్రారంభ సభల్లో హిందూపురంలో డి.రమాదేవి, విశాఖలో బి.ప్రభావతి మాట్లాడారు. మహిళల రక్షణకు చట్టాలు చేయడంతోనే సరిపోదని, వాటిని కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిని అరెస్టు చేసినట్లు చేసి బెయిల్‌పై విడుదల చేశారన్నారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించడం, అత్యాచారం చేసి హత్యలకు పాల్పడం వంటి ఘటనపై ప్రధాని మోడీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. చివరకు సుప్రీం కోర్టు స్పందించే వరకూ కేసులు నమోదు చేయలేదని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని తిరిగి సమాజంపై, మహిళలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. మహిళలపై హింసకు, దాడులకు మత్తు పదార్థాలు, మద్యం కారణమవుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మహిళలపై జరుగుతున్న నేరాల అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మీడియా మానటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి హింస, అశ్లీలత, అసమానతలు ప్రేరేపించే చలన చిత్రాలు, టివి సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలని కోరారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. మద్యం, మత్తుపదార్థాలను నియంత్రించాలని, డి ఎడిక్షన్‌ సెంటర్లను విస్తృత పరిచి పటిష్టంగా పనిచేయించాలని డిమాండ్‌ చేశారు. హిందూపురం సభకు ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షులు దిల్షాద్‌, విశాఖ సభకు ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు బి.పద్మ అధ్యక్షత వహించారు.

 ఈ వార్తను కూడా చదవండి.... (మహిళలపై హింస నివారణకు నిపుణులతో అధ్యయన కమిషన్ ఏర్పాటు చేయాలి : ఐద్వా జాతా డిమాండ్)

aidwa-poru-yatra-start-in-hindupuram-2
పెనుకొండకు చేరుకున్న పోరుయాత్ర 

 

aidwa-poru-yatra-start-in-hindupuram-artists
ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శనలు

 

aidwa-poru-yatra-start-hindupuram-6
హింసపై మహిళల పోరుయత్రకు ప్రజా మద్దతు 

 

 aidwa-poru-yatra-start-in-visakha
విశాఖలో ప్రారంభమైన పోరుయాత్ర 

 

aidwa-poru-yatra-start-in-hindupuram3
హిందూపురంలో ప్రారంభమైన పోరుయాత్ర 

 

11
హింసపై మహిళల పోరుయాత్రలో కళాకారుల కళా ప్రదర్శనలు 
aidwa-poru-yatra-start-hindupuram
హింసపై మహిళల పోరుయాత్రలో కళారూపాలు