Jul 29,2023 21:55

ప్రజాశక్తి - యంత్రాంగం :దేశం, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హింస పెరిగిపోతుందని, మహిళలకు రక్షణ కల్పించాలని ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభమైన 'మహిళా పోరుయాత్ర' కదిరి మీదుగా అన్నమయ్య జిల్లాకు, విశాఖలో ప్రారంభమైన జాతా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం, పార్వతీపురంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రభావతి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు రక్షణ కరువవుతోందని, హింసను రెచ్చగొడుతోన్న బిజెపిని గద్దె దించాలని కోరారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిట్టింగ్‌ జడ్జి లేదా జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెపి అనుసరిస్తోన్న మతోన్మాద, పాసిస్టు విధానాల వల్ల మహిళలపై దాడులు, హింస పెరిగాయని చెప్పారు. మణిపూర్‌లో మారణకాండకు మోడీదే ప్రధాన బాధ్యత అని అన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ఘటనకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోరు యాత్రలో భాగంగా ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన నాటిక, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం సాలూరు నుంచి విజయనగరంలోనికి పోరుయాత్ర ప్రవేశించనుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటి కెజిబిఎస్‌ మోడల్‌ స్కూల్‌, బస్టాండ్‌ సర్కిల్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పోరుయాత్రను ప్రారంభించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. 3200 మంది మహిళలు అదృశ్యమైతే ప్రభుత్వాలు నోరుమెదపలేదని విమర్శించారు. మహిళల సమస్యలపై ఆగస్టు ఎనిమిదిన విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ.. దేశ ప్రతిష్ట పెంచిన మహిళా రెజ్లర్లు గోల్డ్‌ మెడల్‌ తెస్తే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. రోజుకు వందల సంఖ్యలో మహిళలు అదృశ్యమవుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పట్ల మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పంలోనికి పోరుయాత్ర ప్రవేశించనుంది. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు దిల్షాద్‌ రామంజులమ్మ తదితరులు పాల్గొన్నారు.