Jan 01,2023 06:51

సాధారణంగా సమాజంలో స్ఫూర్తి నింపిన వ్యక్తుల వైపు చూస్తాము. తద్వారా వారు సాధించిన ఘనతను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా సాధించాలని ప్రతినబూనడం సహజం. సూపర్‌ మ్యాన్‌ నుంచి మహాత్మా గాంధీ వరకు అనేక స్ఫూర్తిదాయకమైన వాస్తవిక, కల్పిత వ్యక్తులను, పాత్రలను నమూనాగా తీసుకుంటారు. అబ్బాయిలు మగ పాత్రల వైపు మొగ్గు చూపినట్లుగానే, అమ్మాయిలు స్త్రీ పాత్రల వైపు మొగ్గు చూపుతారు. అయితే అంతరిక్షానికి ఎగసినా... అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా వారి గుర్తింపు పురుషులతో పోల్చినప్పుడు స్వల్పమే. స్త్రీ పట్ల సమాజం, మన సంస్కృతి, కర్మ సిద్ధాంతాలు, అంతకంటే పురుషాధిపత్యం చూపిన వివక్షతను జాషువా స్పష్టాతి స్పష్టం చేసాడు. స్త్రీ కంటే పురుషుడధికుడని తాటాకుల్లో రాసి, కంఠమెత్తి ప్రచారం చేసారని, స్త్రీ జాతికే ఇది తీరని అన్యాయమని, స్త్రీకి పురుషునితో సమాన గౌరవం ప్రసాదించమని తన పద్యాలతో వేడుకుంటాడు జాషువా. అంతేకాదు...'అబలయన్న బిరుద మంటించి కాంతల/ స్వీయ శక్తులదిమి చిదిమినారు/ సబలయన్న బిరుదు సాధించి హక్కులు/ గడన చేసి కొమ్ము కష్ట చరిత' అంటూ తమ హక్కుల సాధన దిశగా మహిళా లోకాన్ని జాగృతం చేశాడు.
మహిళలు ఇల్లు దాటి బయటకు రావడం మహాపరాధంగా భావించే రోజుల్లో, వారి హక్కుల గురించి ఎవ్వరూ పట్టించుకోని సమయంలో మహిళా విద్య కోసం, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం... కులంపైన, పితృస్వామ్యంపైన కలంతో యుద్ధం చేసి, ఆధిపత్యాన్ని ధిక్కరించిన సంస్కర్త...తొలి కవయిత్రి, తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. చదువు ఎవరి సొత్తు కాదు. సమాజంలో అందరూ సమానమే అంటూ బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చి... నిర్బంధాన్ని, వివక్షను కడదాకా ఎదుర్కొన్న సావిత్రి బాయి పుట్టిన రోజైన జనవరి 3ను 'జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం' గా ప్రకటించారు. సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి, నేటి టీచరమ్మలకు ఆదిగురువయ్యారు ఆమె. 'అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే' అంటాడో కవి. అలాంటి గురువులు నేడు లక్షలాదిగా వున్నారు. ఒక్క ఎ.పి లోనే మూడు లక్షలకు పైగా వున్న టీచర్లలో 49 శాతం టీచర్లు మహిళలే. కొన్ని జిల్లాల్లో పురుషుల కంటే కూడా ఒకటి రెండు శాతం ఎక్కువే వున్నారు. అయినప్పటికీ... రాష్ట్రంలో బాలికా విద్య తక్కువే. అది ఎస్సీ, ఎస్టీల్లో ఇంకా తక్కువ.
టీచర్‌ ఉద్యోగంపై మమకారంతోనో, రిజర్వేషన్ల వల్లనో... ఏవైనప్పటికీ-పురుషులకు తీసిపోని విధంగా ఉద్యోగాలు పొందారు. అయితే... వీరికి ఉద్యోగంతో పాటు ఇంటి పని కూడా అదనపు భారంగా మారింది. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ టీచర్లుగా వున్నప్పటికీ...గృహ నిర్వహణ, పిల్లల పని టీచరమ్మలకు అదనపు భారంగా మారుతోంది. చాలామంది భర్తలు పని భారం పంచుకోడానికి సిద్ధపడరు. పైగా కొందరు టీచరమ్మల జీతం, ఎటిఎం కార్డు సహా ఆయన జేబులోనే వుంటుంది. చివరకు ఆమె రోజువారీ ఖర్చులకు సైతం అయ్యవారిని అడిగి తీసుకోవాల్సిందే. 'మతం దృష్టిలో సమాజం అంటే పురుషులేనని, వారి అవసరాల కొరకు మాత్రమే స్త్రీ సృష్టించబడ్డదనే భావం ప్రబలంగా వుంది. అందుకే ఆడదానికి ఆజన్మాంతం సంరక్షకత్వం ప్రతిపాదించాడు మనువు' అంటారు మల్లాది సుబ్బమ్మ. 'మహిళల జీవన ప్రమాణాలే దేశాభ్యున్నతికి గీటురాయి' అంటారు నెహ్రూ. మహిళలకు విద్యా, ఉద్యోగంతో పాటు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చినప్పుడే నిజమైన సాధికారత వచ్చినట్లు. కాలం ఎవరికోసం ఆగదు. అది నిత్య జీవన సమరం. ఈ సమరంలో కొన్నిటిని వదిలించుకోవాలి. కొన్నిటిని ఆచరణకు పూనుకోవాలి. ఆ పూనిక జీవితంలో నూతనోత్సాహం నింపుతుంది. టీచరమ్మల సాధికారతకు కొత్త శోభను అద్దుతుంది. ఈ కొత్త సంవత్సరం ఆ దిశగా ముందుకు సాగాలి. ఒక అభ్యుదయ సమాజ నిర్మాణంలో టీచరమ్మలకు చేయూతనివ్వాలి. అదే నిజమైన 'మహిళా టీచర్స్‌ డే'.