Jun 06,2023 11:25

అల్లూరి : ఈ నెల 10 మరియు 11న రెండు రోజులు పాటు జరిగే ఆదివాసి సంక్షేమ పరిషత్తు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు పిలుపునిచ్చారు. మంగళవారం రంపచోడవరం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్‌ జిల్లా ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మికీలు, నకిలీ బెంతూ ఒరియా (వడ్డీ )కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం దుర్మార్గమైన చర్యని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సభలో ఏడుగురు ఆదివాసి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వ్యతిరేకించకుండా తీర్మానాన్ని ఆమోదించటం సిగ్గుచేటని విమర్శించారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అని, ఆదివాసులకు తీరం అన్యాయం చేయడమేనని అన్నారు. ఆదివాసి రిజర్వేషన్‌ తో గెలిచి ఆదివాసి రిజర్వేషన్లను అభివృద్ధి చెందిన కులాలకు దోచిపెడతా ఉంటే వాళ్లకి వత్తాసు పలకటం ఎమ్మెల్యేలకి ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏడుగురు ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని మార్చుకొని అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకించకుంటే రాబోయే ఎన్నికల్లో ఆదివాసి ప్రజలు బుద్ది చెబుతారు అని హెచ్చరించారు. రెండు రోజులు పాటు జరగబోయే రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మొదటి రోజు పట్టుచీర గ్రామంలో రెండవ రోజు చేన్నంపేట గ్రామంలో జరుగునున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆదివాసి చట్టాల అమలు తీరు, ప్రభుత్వాలు ఆదివాసులపై చేస్తున్నటువంటి విధ్వంసం, కొత్త కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, జీవో నెంబర్‌ 3 చట్టబద్ధత, సంఘం భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి సంక్షేమ పరిషత్‌ జాతీయ నాయకులతోపాటు రెండు రాష్ట్రాల సంఘ ప్రతినిధులు హాజరవునున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు బేలం సత్యనారాయణ, కుర్సం వరలక్ష్మి, కారం బాలు దొర, బోరుగా ఎర్రమ్మ, కారు అరుణ, ప్రసాద్‌, అబ్బాయా దొర, ఎటిఎ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.