Oct 30,2022 07:27

'ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పలేరు' అంటారు. ఆకలి కడుపు జీవితంలో ఆహారం విలువను తెలియజేస్తే... ఖాళీ జేబు చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో పొదుపు చేయలేకపోయామే అన్న వేదనను మిగుల్చుతుంది. 'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా జమాతో రుపయా హోయేగా' అనేది హిందీలో ఒక సామెత. ఒక్కొక్క బిందువు కలిస్తేనే మహాసముద్రం... పైసా పైసా కలిస్తేనే రూపాయి అవుతుందని దాని అర్థం. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే 'ధనం'. ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా, రేపటి ఆనందమయ జీవితం కోసం...భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టే చిన్నచిన్న మొత్తాలే పొదుపు. ఇవన్నీ జీవితంలో పొదుపు ఎంత ముఖ్యమో...తెలియజెప్పే సూత్రాలు. రూపాయి అంటుందిట- 'నన్ను వంద వరకూ పెంచు' తర్వాత నిన్ను నేను పెంచుతా' అని. అదే రూపాయిని చిల్లరగా మార్చితే చెల్లాచెదురవుతాయి. అదే చిల్లరను ఒక దగ్గర జమ చేస్తూపోతే ధన సమూహంగా మారుతుంది. అందుకే పొదుపు...భవిష్యత్తు నిర్మాణానికి తొలిమెట్టు.

మనిషి మనసు కోరికల పుట్ట. కోరికలన్నింటిని తీర్చుకోవటం ఎవ్వరికీ సాధ్యపడదు. ముఖ్యంగా డబ్బు, ఆహారం, వస్త్రాలు, విశ్రాంతి, సమయం, శక్తి, భాషణం, భూషణం- అనే ఈ ఎనిమిది విషయాలందు పొదుపును పాటించాలి. లేదంటే జీవితం అభాసుపాలవుతుంది. 'చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి/ బంధువవుతానని అంది మనీ మనీ/ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు/ ఐనా అన్ని అంది మనీ మనీ/ పచ్చనోటుతో లైఫ్‌ లక్ష లింకులు పెట్టుకుందని/ అంది మనీ మనీ' అంటాడో సినిమా కవి. అనవసరమైన ఖర్చులు మానేసి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వారిని చూసి పిసినారి అంటారు. అలాగని బిందాస్‌గా వ్యవహరిస్తే జల్సా అంటారు. అందుకే ఎవరో ఏదో అంటారని, ఎవరో ఒకరు ఆదుకోకపోతారా అని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. 'నీ మనసుని, శరీరాన్ని ఆరోగ్యంగా అట్టేపెట్టని ఖర్చు ఒక్క దమ్మిడీ చెయ్యకు' అంటాడు కొడవటిగంటి. వ్యక్తులు, కుటుంబాలకే కాదు...ఇది పాలకులు, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ప్రజల సొమ్మును, ప్రకతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతూ...లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాలను నడుపుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తూ...కార్పొరేట్లకు మాత్రం కోట్లాది రూపాయల రాయితీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో...అరకొర ఆదాయాలతో బతకడానికే ఆపసోపాలు పడుతుంటే...పొదుపు ఎలా చేయాలి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని... ప్రపంచంలో వినిమయదారీ సంస్కతి విపరీతంగా పెరిగింది. చేతిలో పైసా లేకపోయినా, మధ్యతరగతి జీవితాలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ...క్రెడిట్‌ కార్డులు, ఇఎంఐ ల రూపంలో వున్నదంతా ఊడ్చేస్తున్నారు. 'అప్పు తెచ్చి వేసిన మిద్దెల్లో/ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది' అంటాడు చెరబండరాజు. ఆ దీనత్వం నుంచి బయటపడేసేదే పొదుపు. పొదుపు అలవాటుని ప్రజల్లో కలిగించడం కోసమే ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న 'ప్రపంచ పొదుపు దినోత్సవం' జరుపుకుంటున్నారు.

పొదుపు అన్ని విషయాలకూ వర్తిస్తుంది. 'పొదుపు తెలిసిన గృహిణి కాపురం పచ్చని సంసారమే' అంటారు పెద్దలు. ఇంటి అవసరాల కోసం వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్‌ తయారుచేసుకోవాలి. పొదుపు కోసం కొంత మిగుల్చుకోవాలి. ఈ అలవాటు ప్రారంభంలో కొంత కష్టమనిపించినా...తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా తర్వాత్తర్వాత సులభమవుతుంది. 'ఇదమే వహి పాండిత్యం/ ఇదమే వహి శూరత/ ఇదమే వహి వైదగ్ధ్యం/ ఆదాదల్పతరో వ్యయ్ణ' అన్నారు. ఆదాయం కన్నా చాలా తక్కువ ఖర్చుపెట్టడమే... ఏ మనిషి విజ్ఞానానికైనా, శూరత్వానికైనా, నేర్పుకైనా నిదర్శనం- అని ఈ శ్లోకం చెబుతుంది. పొదుపు అంటే ఒక్క డబ్బు విషయంలోనే కాదు- కాలం, వనరులు, నీరు, చెట్టు, విద్యుత్‌, ఆహారం వంటి అన్నిటిలోనూ అవసరమే. డబ్బుతో పాటు ఈ ప్రకృతి వనరులు ఏ ఒక్కటి వృధా అయినా... దాని ఫలితం భవిష్యత్తరాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. 'ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా/ లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా/ కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే/ అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే...' అంటాడు ఆరుద్ర. అనవసరమైన ఖర్చును తగ్గించుకొని, రేపటికోసం కొంత దాచాలన్నది పెద్దలు చెప్పే ఆర్థిక సూత్రం. ఈ సూత్రంపైనే కుటుంబ భవిష్యత్తయినా, దేశ భవిష్యత్తయినా ఆధారపడి వుంటుంది.