Dec 31,2022 09:52
  • తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనల సడలింపు నిల్‌
  • క్వింటాలుకు రూ.125 నుంచి రూ.224 వరకూ నష్టపోతున్న రైతులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ప్రకృతి వైపరీత్యాలతోపాటు ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. తడిచిన ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిబంధనలను సడలించకపోవడంతో తుపాను బాధిత రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధరలో క్వింటాలుకు రూ.125 నుంచి రూ.224 వరకూ కోల్పోతున్నారు. కృష్ణా జిల్లాలో 3.91 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 5.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మాండూస్‌ తుపానుకు 1.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతిందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. రంగు మారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యపు గింజలు ఐదు శాతం, నూకలు (బ్రోకెన్‌ రైస్‌) మూడు శాతం, తేమ 17 శాతం కలిగి ఉన్న కామన్‌ వెరైటీకి క్వింటాలుకు రూ.2,040, గ్రేడ్‌ 'ఎ' రకానికి రూ.2060 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలి. తడిచిన ధాన్యంలో రంగు మారిన గింజలు, నూకలు అయ్యే గింజల శాతం ఎక్కువగా ఉంటోంది.
            ధాన్యం సేకరణలో రైతులకు ఊరట కలిగేలా ప్రభుత్వం నిబంధనలు సడలించి రైతులు పూర్తిగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ, తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం ఎటువంటి ఊరటా ఇవ్వలేదు. రంగు మారిన గింజలు, నూకలను లెక్కించి పాయింట్ల వారీగా ధరలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఐదు శాతానికి మించి అదనంగా వచ్చే రంగు మారిన గింజలకు పాయింట్‌కు ఏడు రూపాయల చొప్పున ధర తగ్గించి మిల్లర్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వరి కుప్పల్లోకి నీరు చేరిన ధాన్యంలో 35 శాతం వరకూ రంగు మారిన గింజలుంటున్నాయి. ఇటువంటి ధాన్యానికి సగటున క్వింటాలుకు రూ.224 వరకు మద్దతు ధరలో కోత పెడుతున్నారు. పనలపై తడిచిన ధాన్యంలో ఎక్కువగా నూకలు వస్తున్నాయి. ఎఫ్‌సిఐ సేకరించే నాన్‌ సార్టెక్స్‌ రైస్‌లో 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వ పంపిణీకి ఉపయోగించే సార్టెక్స్‌ రైస్‌లో 15 శాతం మాత్రమే నూకలను అనుమతిస్తున్నారు.
                    తడిచిన ధాన్యంలో 30 నుంచి 40 శాతం వరకు నూకలు వస్తున్నాయి. సార్టెక్స్‌కు సేకరించే ధాన్యంలో క్వింటాలుకు రూ.75 నుంచి రూ.125 వరకూ కోత పెడుతున్నారు. రంగుమారిన, తడిచిన ధాన్యం విషయంలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నారు.
 

                                                                            మిల్లర్ల మాయాజాలం

మచ్చు (శ్యాంపిల్‌) పరిశీలించే యంత్రాల్లో కొందరు మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. నూక శాతం లెక్కించే యంత్రంలో పోసిన ధాన్యానికి 21 సెకన్ల నుంచి 30 సెకన్లలోపు ఒత్తిడి కలిగించాలి. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని 40 సెకన్లకుపైగా యంత్రంలో పోసిన ధాన్యంపై ఒత్తిడి కలిగించడంతో 20 శాతం రావాల్సిన నూకలు 40 శాతానికి పెరుగుతున్నాయి. దీంతో, 15కు మించి పెరిగిన ప్రతి ఒక్క శాతానికీ మిల్లర్లు రూ.5 చొప్పున ధరలో కోత పెడుతున్నారు. తేమ శాతంలోనూ ఇదే తరహాలో రైతులను దోపిడీ చేస్తున్నారు.