
వికలాంగులకు సామాజిక భద్రత సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది వికలాంగులు మహా ధర్నాకు సిద్ధమవుతున్నారు. జూన్ 1 నుండి జులై 9 వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి త్రిపుర వరకు సామాజిక భద్రత, అంత్యోదయ కార్డులు, ఉపాధి హామీ చట్టంలో పని కల్పించాలని, దేశ వ్యాప్తంగా ఒకే పింఛన్ అమలు చేయాలని గ్రామ గ్రామాన కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. మండల, జిల్లా కేంద్రాల్లో సదస్సులు, సెమినార్లు, చర్చావేదికలు నిర్వహించి చలో ఢిల్లీకి సన్నద్ధమయ్యారు. వాస్తవానికి వికలాంగుల సమస్యలు పాలకులకు పట్టింపు లేదు. వారి సంఖ్యను కూడా తక్కువ చూపే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం (7 రకాల వైకల్యాల ప్రకారం) 2.68 కోట్ల మంది వికలాంగులున్నారు. వీరిలో పురుషులు 1.50 కోట్ల మంది, స్త్రీలు 1.18 కోట్ల మంది, గ్రామీణ ప్రాంతంలో 69.4 శాతం, పట్టణ ప్రాంతంలో 30.6 శాతం మంది నివసిస్తున్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం దేశ జనాభాలో 10 నుండి 15 శాతం మంది వికలాంగులు ఉంటారని అంచనా. కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత విభాగం వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం 49.5 శాతం మంది ప్రభుత్వ పథకాలే పొందడం లేదు. ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం ఆర్టికల్ 23 ప్రకారం వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించే హక్కు, సమాజంలో గౌరవంగా అందరితో కలిసి జీవించే హక్కుతో పాటు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే హక్కును కల్పించింది. సమాజంలో వికలాంగుల పట్ల వివక్షత, అవమానాలు, అన్యాయాలు కొనసాగుతున్నాయి. మహిళా వికలాంగులు, బాలికలు, మూగ చెవిటి, మానసిక, మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంగవైకల్యం కలిగిన వారికి సమాజంలో, ఇంట్లో సైతం గుర్తింపు లేదు. వికలాంగులను ఆదరించాల్సిన సమాజం చీదరించు కుంటుంటే...కన్నవారు సైతం కాదు పొమ్మని వెలివేస్తుంటే దిక్కుతోచని స్థితిలో అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరికి మనోధైర్యం కల్పించేందుకుగాను సామాజిక భద్రత ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం 2008లో సంతకం చేసింది. 1995 పిడబ్ల్యుడి చట్టం స్థానంలో వికలాంగులకు మారిన పరిస్థితుల నేపథ్యంలో నూతన చట్టం చేయాలని 2011 నుండి దేశవ్యాప్తంగా ఎన్‌పిఆర్‌డి నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి. పోరాటాల ద్వారా 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. చట్టం అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నాయి. 2016 ఆర్‌పిడబ్ల్యుడి చట్టంలోని సెక్షన్ 89, సెక్షన్ 92, సెక్షన్ 93 లకు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాల ద్వారా కేంద్రం వెనక్కు తగ్గింది. నేషనల్ ట్రస్ట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఆటిజం చట్టం వంటివి మాత్రం అమలు చేయడం లేదు. నేషనల్ పాలసీ రూపొందించిన అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టడం జరిగింది. చట్టాల అమలును పర్యవేక్షించాల్సిన ఆర్‌పిడి చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్ట్ కమిషనర్ పోస్టులు నేటికీ ఖాళీగా వున్నాయి. చట్టాల అమలు పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమిది. వికలాంగులకు అంత్యోదయ కార్డులు జారీ చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని 2011లో రాజ్యసభలో బృందాకరత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 2012 నుండి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డులు పంపిణీ చేశారు. కానీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో వికలాంగులు అంత్యోదయ కార్డులకు నోచుకోలేదు.
వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో వికలాంగులకు స్థానం లేదు. ఎన్నో రోజులుగా డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. వికలాంగులకు ప్రత్యేక జాబ్‌కార్డులు జారీ చేయాలి. 200 రోజులు పని కల్పించి వేతనం రూ.600కు పెంచాలి. దేశవ్యాప్తంగా వికలాంగులకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది. రూ.300 నుంచి మొదలై రూ.3 వేల వరకు ఉంటున్నది. వీరు ఇంత తక్కువ నగదుతో కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారు? ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే తిండి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి, దేశవ్యాప్తంగా వికలాంగులకు ఒకే పెన్షన్ అమలు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా? ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి. ఎలాంటి షరతులు, ఆదాయ పరిమితులు లేకుండా 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలి. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా వికలాంగులకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ హక్కుల సాధనకు వికలాంగులందరూ ఐక్యమవ్వాలి. సామాజిక భద్రత సాధించేందుకు పోరాడాలి.
వ్యాసకర్త ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు ఎం. అడివయ్య
సెల్ : 9490098713