Aug 03,2023 06:39

భిన్న జాతులు, విభిన్న సంస్కృతులకు నిలయమైన సువిశాల భారతదేశంలో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని ఆరెస్సెస్‌ కుదురు నుంచి వచ్చిన బిజెపి మరోసారి చర్చను లేవదీసింది. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు తీసుకురావాలని మితవాద, మతతత్వ మోడీ ప్రభుత్వం తహతహలాడుతోంది. నాలుగేళ్ల కిందటే ఈ ప్రతిపాదనను 21వ లా కమిషన్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేకున్నా జస్టిస్‌ రితురాజ్‌ అధ్యక్షతన 22వ లా కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్‌ జూన్‌ 14న ఏకరూప సివిల్‌ కోడ్‌ (యుసిసి)పై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. నెల రోజులు గడువు ముగిశాక మరో రెండు వారాలు పొడిగించింది. ఈలోగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో బిజెపి కార్యకర్తల నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ఏకరూప సివిల్‌ కోడ్‌ ఆవశ్యకత గురించి నొక్కి చెబుతూ ఒక కుటుంబంలో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ కుటుంబం సరిగ్గా నడుస్తుందా అని ప్రశ్నించారు? అంతేకాదు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆయన ట్రిపుల్‌ తలాక్‌ గురించి ప్రస్తావించారు. ఆ తరువాత ఆయన పార్టీకి చెందిన నాయకుడు న్యాయ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్న బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ, ప్రధానికి అత్యంత సన్నిహితుడు అయిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఏకరూప సివిల్‌ కోడ్‌ నుంచి గిరిజనులను మినహాయిస్తామని చెప్పారు. దీనిని బట్టి ఒకే చట్టం ఎవరి కోసం తెస్తున్నారో? ఏ ఉద్దేశంతో తెస్తున్నారో ఈ పాటికే చాలా మందికి అర్థమైపోయింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన చోట రామాలయ నిర్మాణం చేపట్టడం.. ముస్లింలు అధికంగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ము కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 కింద రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం.. రాష్ట్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి దిగజార్చడం, ఎన్‌ఆర్‌సి, సిఎఎలను తీసుకురావడం.. ఇలాంటి గొలుసుకట్టు పరిణామాలు ముస్లింలను, ఇతర మైనార్టీలను తీవ్ర అభద్రతకు గురి చేశాయి.
ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే చట్టం అన్న నినాదం మాటున ఏకరూప సివిల్‌కోడ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇది అన్ని మతాలు, జాతులు, సంస్కృతులకు సమ న్యాయం కల్పించేది.. లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేది అయితే అందరూ దీనిని స్వాగతించేవారు. కానీ, ఫాసిస్టు ఆరెస్సెస్‌ సిద్ధాంతం, బూజు పట్టిన మనువాద సంస్కృతి ప్రాతిపదికపై మోడీ ప్రభుత్వం దీనిని తీసుకురావాలని చూడడమే అభ్యంతరకరం. ఇంతకుముందు ఒకే దేశం ఒకే పన్ను అంటూ జిఎస్టీని తీసుకొచ్చి సామాన్యులపై చివరికి స్కూలుకెళ్లే బాలికలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లను కూడా వదలకుండా ఎడాపెడా పన్నులు విధించింది. దీంతో అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయి. తరువాత ఒక దేశం ఒకే భాష నినాదాన్ని ముందుకు తెచ్చి ద్రవిడ సంస్కృతిని దెబ్బ తీసేలా హిందీని బలవంతంగా రుద్దాలని ఎలా ప్రయత్నించిందీ చూశాం. ఇప్పుడు ఒక దేశం ఒకే చట్టం పేరుతో తీసుకొస్తున్న యుసిసి ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని ఎలా అనుకోగలం? ఈ ఏకరూప సివిల్‌ కోడ్‌కు ఏది ప్రాతిపదిక పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వాటిని దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఆరెస్సెస్‌ అనుసరించే మనువాదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే అది ఇతర మతాల వారి విశ్వాసాలను, వ్యక్తిగత చట్టాలను దెబ్బతీయడం కాదా? ఇటువంటి ఏకరూపతతో సమానత్వం సాధిస్తామనడం మోసపూరితం కాదా? ఏకరూప సివిల్‌ కోడ్‌ను సమర్థించుకోవడానికి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల గురించి, ఆర్టికల్‌ 44 గురించి పదే పదే ప్రస్తావిస్తుంటారు. ఆదేశిక సూత్రాల్లో అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ పని కల్పించడం వంటి అనేక అంశాలున్నాయి. వాటిని వదిలిపెట్టి ఏకరూప సివిల్‌ కోడ్‌ గురించే మాట్లాడడంలో ఆంతర్యమేమిటి? రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేద్కర్‌ ఏకరూప సివిల్‌ కోడ్‌ కావాలని అన్నా, అది ఆయా సెక్షన్ల నుంచి స్వచ్ఛందంగా రావాలే తప్ప పై నుంచి రుద్దకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది అంబేద్కర్‌ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చేందుకు ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చామని ఆరెస్సెస్‌, బిజెపి నేతలు చెప్పడం వారి హిపోక్రసీని తెలియజేస్తుంది. హిందూ మహిళల పట్ల వివక్షను తొలగించేందుకు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సూచన మేరకు తొలి న్యాయశాఖ మంత్రి డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ హిందూ కోడ్‌ను తీసుకొచ్చినప్పుడు హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నాడని ఆయనపై ఆరెస్సెస్‌, బిజెపి పూర్వ అవతారమైన భారతీయ జన సంఘ్ (బిజెఎస్‌) తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి మరచిపోయారా? అంబేద్కర్‌ హిందూ కోడ్‌ను ప్రతిపాదించినప్పుడు దానిని పూర్తిగా వ్యతిరేకించింది ఆరెస్సెస్‌. సామాజిక దురాచారాలైన సతీ సహగమనం, బాల్య వివాహాలు అక్కడక్కడ ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనుస్మృతిలో పేర్కొన్న చాతుర్వర్ణ వ్యవస్థను ఆరెస్సెస్‌, బిజెపి పూర్తిగా సమర్ధిస్తున్నాయి. దళితులు, గిరిజనులపై దాడులు, వారి భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగిపోతోంది. స్వాతంత్య్రానంతరం హిందూ మ్యారేజెస్‌ యాక్ట్‌ 1955, నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా నానా యాగీ చేసింది సంఘ్ పరివార్‌. ఇవన్నీ చట్టాలు లేకపోవడం వల్ల కొనసాగుతున్నాయా? చట్టాలు అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు లేదు. అంతేకాదు, ఏ చట్టమైనా ప్రజల ఉద్యమాల నుంచి వచ్చినదైతే అమలులోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రజలను చైతన్య పరచడం, వారిని ఉద్యమించేట్లు చేయడం పాలకవర్గ పార్టీలకు అసలు నచ్చదు. నిరంకుశంగానో, బలవంతంగానో చట్టాలను తీసుకొచ్చి, ప్రజలను జాతి, మతం, భాష, ప్రాంతం, లింగం పేరుతో చీల్చడం ద్వారా తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంపైనే వాటి దృష్టంతా. ఏకరూప సివిల్‌ కోడ్‌ కూడా ఈ దుష్ట తంత్రంలో భాగమే. అందుకే దీనిని తుదకంటా వ్యతిరేకించాలి. వివిధ మతాల చట్టాల్లోని లోపభూయిష్టమైన, ప్రగతి నిరోధకమైన అంశాలపై ఆయా మతాల్లోంచి తిరుగుబాటు వచ్చేలా చూడాలి. ఆ తరువాతే ఏకరూప సివిల్‌ కోడ్‌ గురించి ఆలోచించవచ్చు.

కె. గడ్డెన్న