Oct 23,2022 06:47

ఆఖరికి దేశరక్షణ రంగాన్ని కూడా పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నింటినీ ప్రైవేటుపరం చేసిన మోడీ ప్రభుత్వం చివరకు దేశాన్ని కాపాడాల్సిన దేశ రక్షణ వ్యవస్థను కూడా వదలడం లేదు. ఇప్పటికే రక్షణ శాఖలో గత రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవు. దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని భర్తీ చేసి బిజెపి తన దేశభక్తిని చాటుకోవాలి.
నా ఉద్యోగం ఎక్కడ ? అంటూ యువత దేశ పాలకులను ప్రశ్నించడానికి సిద్ధం అవుతోంది. నవంబరు 3న ఢిల్లీ వేదికగా వేలాదిమంది యువత ఢిల్లీలో గర్జించనుంది. మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ యువతకు హామీ ఇచ్చారు. యువత కూడా నమ్మి ఓట్లు వేసి రెండు సార్లు గెలిపించారు కూడా. మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఎనిదేళ్లు పూర్తయింది. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికే 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా అంటే దీనికి మోడీనే సమాధానం చెప్పాలి. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం కాస్తా అదానీ ఇండియాగా, మేడిన్‌ ఇండియా నినాదం కాస్తా అంబానీ ఇండియాగా మారిపోయింది. కొత్త ఉద్యోగాలు రావడం సంగతి దేవుడెరుగు! ఉన్న ఉద్యోగాలు, ఉపాధి కూడా ఊడగొడుతున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కానీ ఎప్పుడు భర్తీ చేస్తారో మాత్రం ప్రకటించలేదు. సుప్రీం కోర్టులోనే 34 న్యాయమూర్తుల పోస్టులకుగాను 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని 25 హైకోర్టులలో 454 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటేనే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇవికాకుండా బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకింగ్‌, బీమా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు ఇందులో పని చేసే లక్షలాది ఉద్యోగస్తులను బలవంతంగా వాలంటరీ రిటైర్‌మెంట్‌ చేయించింది మోడీ ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలు అంటే కూడా చిన్న చూపే. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబిసి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయలేదు. ఒకవైపు దళితులపై భౌతిక దాడులు చేస్తూ మరోవైపు రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోంది. 2022 జనవరి నాటికి 50,046 ఎస్సీ, ఎస్టీ, ఓబిసి బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేయాలి. ఒకపక్క ప్రభుత్వ బ్యాంకులను దివాలా తీయించి మరోపక్క ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహిస్తున్నది. పార్లమెంటులో చెప్పిన లెక్కల ప్రకారం బ్యాంకింగ్‌లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను ఆపాలి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దేశంలో భారత రైల్వే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ, ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవ చేస్తున్న సంస్థ. దీని ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం పూనుకుంది. రెండు సంవత్సరాల క్రితం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 1,03,769 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే దాదాపు 1.20 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే రైల్వే ఉద్యోగం పట్ల యువతకు ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ మోడీకి మాత్రం అర్థం కావడం లేదు. వాటిని భర్తీ చెయ్యకుండా అభ్యర్థుల దరఖాస్తు ఫీజులతో కాలం వెళ్లదీస్తున్నారు. దాదాపు 2 లక్షల 70 వేల ఉద్యోగాలు రైల్వేలో ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. భారత రైల్వేను కాపాడాలి.
దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 40 శాతం శాతం పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా ఇప్పుడు నూతన విద్యా విధానం-2020 (ఎన్‌ఇపి) పేరుతో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, కాషాయీకరణకు ప్రవేశ పత్రమే ఈ నూతన విద్యా విధానం-2020. తక్షణమే ఎన్‌ఇపిని రద్దు చేయాలి.
మోడీ పుణ్యమా అని గత ఎనిమిదేళ్లుగా మన దేశంలో ఏ పని చేయ్యకుండా ఉన్నవి రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలే (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌.ఎస్‌.సి), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌.ఆర్‌.బి), యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి), ఐబిపిఎస్‌). ఎనిమిదేళ్లుగా బాగా పని చేసినవి మాత్రం ఇ.డి, సిబిఐ మాత్రమే. గ్రామీణ పేదలకు తిండి పెట్టే నరేగ చట్టాన్ని రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. నిధులు భారీగా తగ్గించింది. జిల్లాల సంఖ్య తగ్గించింది. యాంత్రీకరణ పెంచి వ్యవసాయ అనుసంధానం చేయాలని చూస్తోంది. నరేగ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. దీని పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి.
యువతను పారిశ్రామికవేత్తలుగా చేస్తానని హామీ ఇచ్చారు మోడీ. దాని కోసం ముద్ర లోన్లు ప్రకటించారు. ఇందులో మూడు రకాల లోన్లు ఉన్నాయి (మొదటి రకం లోన్‌ రూ.50 వేల వరకు, రెండవ రకం లోన్‌ రూ.2 లక్షల వరకు, మూడవ రకం లోన్‌ రూ.7 లక్షల వరకు ఇస్తోంది). రూ.50 వేలతో పారిశ్రామిక వేత్తలుగా ఎలా మారిపోతారో మోడీనే చెప్పాలి. 2019 ఎన్నికల తర్వాత వీటిని కూడా అపేశారు. ఇప్పటి దాకా కోటి మందికి ఇచ్చామని కేంద్రం బుకాయిస్తున్నది. కానీ వాస్తవానికి ఇచ్చింది 62 లక్షల మందికే అని బ్యాంకు అధికారులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవి కూడా బిజెపి కార్యకర్తలకే ఇచ్చినట్లు అనేక రాష్ట్రాల్లో ఫిర్యాదులు అందాయి కూడా.
గంగవరం నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు అన్ని పోర్టులు అదానీవే. ఆఖరికి దేశరక్షణ రంగాన్ని కూడా పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నింటినీ ప్రైవేటుపరం చేసిన మోడీ ప్రభుత్వం చివరకు దేశాన్ని కాపాడాల్సిన దేశ రక్షణ వ్యవస్థను కూడా వదలడం లేదు. ఇప్పటికే రక్షణ శాఖలో గత రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవు. దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని భర్తీ చేసి బిజెపి తన దేశభక్తిని చాటుకోవాలి.


- జి.రామన్న,డివైఎఫ్‌ఐ ఎ.పి ప్రధాన కార్యదర్శి,
సెల్‌ : 9177590726