
- దేశంలో 6,253 మంది మాన్యువల్ స్కావెంజర్లు !
- సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ యాప్ ద్వారా గుర్తింపు
- నేడు మంత్రిత్వ శాఖ సమావేశం
న్యూఢిల్లీ : ఎన్ని విమర్శలు వెళ్లువెత్తుతున్నా.. దేశంలో ఇంకా మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో 6,253 మంది మాన్యువల్ స్కేవింజర్లు ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక యాప్ గుర్తించింది. అయితే ఈ సంఖ్య ప్రామాణికమైనదో, కాదో తెలియదని సదరు మంత్రిత్వ శాఖ చెబుతోంది. జిల్లాల్లో మాన్యువల్ స్కావెంజింగ్ పరిస్థితిని సమీక్షించాలని ఇప్పటికే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 31న మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధిని నిషేధించడం, వారికి పునరావాసం కల్పించే చట్టం 2013ను పార్లమెంట్ ఆమోదించి పదేళ్లు గడిచినా ఇంకా మాన్యువుల్ స్కావెంజర్ల గుర్తింపులోనే మంత్రిత్వ శాఖ ఉండటం విచారకరం. ఈ చట్టంలో సెక్షన్ 2(1)(జి) ప్రకారం 'మాన్యువల్ స్కావెంజింగ్'ను 'అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల నుంచి మానవ మలాన్ని ఎత్తే చర్యగా' నిర్వచించారు. ఈ చట్టం ఆమోదించిన ఏడు నెలల తరువాత 2014 మార్చిలో సుప్రీంకోర్టు మాన్యువల్ స్కావెంజర్స్‌కు పునరావాసం కల్పించాలని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించే పనిలోనే ఉంది. దేశంలో ఉన్న అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, వాటికి అనుసంధానించబడి ఉన్న మాన్యువెల్ స్కావెంజర్లను గుర్తించడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ 2020 డిసెంబరు 24న 'స్వచ్ఛత అభియాన్' అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా 6,253 మంది మాన్యువల్ స్కావెంజర్స్‌ను గుర్తించారు. ఈ సంఖ్య సరైనదా.. కాదా.. అనే విషయం తెలియదని మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఎందుకంటే ఈ యాప్ ద్వారా ఎవ్వరైనా తమ పేర్లును నమోదు చేసుకోవచ్చనని చెబుతుంది. దీనిని క్షేత్రస్థాయిలో నిర్ధారించడానికి ప్రోగ్రామ్ మోనటరింగ్ యునిట్ (పిఎంయు) బృందంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కూడా తెలిపింది. ఇప్పటి వరకూ ఒక్క అపరిశుభ్రమైన మరగుదొడ్డిని కూడా నిర్ధారణ చేయలేదు. యాప్‌లో మాత్రం మరుగుదొడ్ల చిత్రాలు, మాన్యువల్ స్కావెంజర్ల వివరాలు నమోదై ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు, నేషనల్ సఫాయి కరంచారి ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి) సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటి వరకూ 58,098 మంది మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించారు. ఈ సంఖ్య కూడా వాస్తవ సంఖ్యను ప్రతిబింబించడం లేదని, ఈ సంఖ్యలోని వారంతా ప్రస్తుతం వృతిలో కొనసాగడం లేదని కేంద్రం చెబుతుంది. దేశంలోని మొత్తం 766 జిల్లాలో 551 జిల్లాలను మాన్యువల్ స్కావెంజర్లరహిత జిల్లాలుగా గుర్తించామని, మిగిలిన 215 జిల్లాల సమాచారం కోసం వేచిచూస్తున్నామని తెలిపింది. తమిళనాడు, బీహార్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, లడఖ్, త్రిపుర రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలను మాన్యువల్ స్కావెంజర్స్‌రహిత జిల్లాలుగా ప్రకటించాయి. 2014 అక్టోబర్ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణం) పథకం కింద 17 కోట్ల పరిశ్రుభమైన మరుగుదొడ్లను, స్వచ్ఛ భారత్ మిషన్(పట్టణం) ద్వారా 62.81 లక్షల మరుగుదొడ్లను నియమించామని కేంద్రం చెబుతుంది. ఇది మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనకు దోహదం చేసిందని కేంద్రం చెబుతుంది. 2013 నుంచి ఇప్పటి వరకూ మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంక్‌లను ప్రమాదకర పరిస్థితుల్లో శుభ్రం చేస్తూ 663 మంది మరణించారు. వీటిలో 648 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో 631 కేసుల్లో పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది.
మాన్యువల్ స్కావెంజర్ల గుర్తింపు కోసం జాతీయస్థాయిలో జనాభా గణన నిర్వహించాలని నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కరంచారీస్ (ఎన్‌సిఎస్‌కె) చేసిన సిఫార్సును కూడా కేంద్రం 'సాధ్యం కాదు' అని తోసిపుచ్చింది. మాన్యువల్ స్కావెంజర్ల గుర్తింపు అనేది వారు పనిచేసే స్థలం, లేదా యజమాని ధ్రువీకరణతో ముడిపడి ఉంటుందని, స్వీయప్రకటనతో మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా గణనతో ఇలాంటివి సాధ్యం కాదని తెలిపింది.