- ప్రారంభమైన ఖరీఫ్ కోతలు
- పూర్తి కాని సిఎంఆర్ ట్యాగింగ్ ప్రక్రియ
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : రాష్ట్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. ఏ తేదీ నుండి ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. కాకినాడ జిల్లాలో గండేపల్లి, జగ్గంపేట, పెదపూడి, కిర్లంపూడి, ఏలేశ్వరం, కోటనందూరు తదితర మండలాల్లో వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. కొన్నిచోట్ల కోతలు పూర్తయ్యాయి కూడా. మరో వారం పది రోజుల్లో దాదాపు జిల్లా అంతటా పూర్తి స్థాయిలో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. గండేపల్లి మండలంలో రెండు వారాల క్రితమే కోతలు మొదలవగా 40 శాతం పూర్తయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో ఈ మండలంలో వరి కోతలు మొత్తం పూర్తి కానున్నాయి. ఎ-గ్రేడ్‌కు రూ.2,060, సాధారణ రకం రూ.2,040 చొప్పున మద్దతు ధర చెల్లించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాల్సి ఉంది. కొనుగోళ్లు ఇంకా ఎక్కడా ప్రారంభం కాకపోవడంతో ఈ మండలంలో పలువురు రైతులు 75 కేజీలు బస్తాను రూ.1,400కే అమ్ముకోవాల్సి వస్తోంది. మద్దతు ధర ప్రకారం 75 కేజీలకు రూ.1,545 రావాలి. బస్తా వద్ద రైతులు రూ.145 వరకూ నష్టపోతున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనందున తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
ధాన్యం సేకరణపై స్పష్టత కరువు
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రశ్నార్థకంగా మారింది. నవంబరు మొదటి వారం నుంచే సేకరణ చేయాలని అధికారులు తొలుత భావించారు. కాని అమల్లోకి రాలేదు. రెండు లేదా మూడో వారం నుంచి సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో కీలకమైన కస్టమ్ రైస్ మిల్లింగ్ (సిఎంఆర్)కు నిర్దేశించిన రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు నేటికీ సమర్పించలేదు. వాస్తవానికి ఈ ప్రక్రియను ముందుగానే పూర్తి చేసి ఆర్‌బికెలకు ఆయా రైస్ మిల్లులను ట్యాగింగ్ చేయాలి. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు.
మిల్లర్లకు బకాయిలు
జిల్లాలోని రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.425 కోట్లు బకాయి ఉంది. అవి ఎప్పుడు ఇస్తుందో సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేమని, ధాన్యం రవాణా ఖర్చులు, మిల్లింగ్ ఛార్జీలు, గోనె సంచుల డబ్బులు ఇవ్వాలని మిల్లర్లు అడుగుతున్నారు. ఒక మిల్లుకు ఎంత ధాన్యం ఇస్తున్నారో దాని ఖరీదుకు సరిపడా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీని ప్రకారం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేమని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు.
సేకరణ లక్ష్యం 46.3 శాతమే ...
కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.37 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 4.95 లక్షల టన్నులు మార్కెట్‌కు వస్తాయి. ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం 2.55 లక్షల టన్నులకు మాత్రమే పరిమితమైంది. అంటే మొత్తం ఉత్పత్తయ్యే దానిలో 46.3 శాతం మాత్రమే సేకరిస్తే మిగతాది ప్రైవేటు వారి దాయాదాక్షిణ్యాలపై రైతులు అమ్ముకోవాలి.










