Oct 18,2022 10:05
  • ఒడిషాలో నోటిఫికేషన్‌ జారీ.. రాష్ట్రంలో మాటలకే సరి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామంటూ ప్రకటించిన 24 గంటల్లోనే ఒడిషా ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. సెలవు దినం అయినప్పటికీ ఆదివారం సాయంత్రమే ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇప్పటికే ఉన్న 57 వేల మందికపైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు, భవిష్యత్‌లోనూ ఈ తరహా నియామాకలను రద్దు చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్‌లో ఒడిషా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2013లో జారీ చేసిన ఒడిషా గ్రూప్‌ బి పోస్టులు(కాంట్ట్రక్ట్యువల్‌ అప్పాయింట్‌మెంట్లు) రూల్స్‌ను రద్దు చేసింది. ఆ తరహా నియమాకాలను పూర్తిగా నిలిపివేస్తూ ఇప్పటికే ఉన్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఒడిషా గ్రూపు బి,సి,డి పోస్టుల (రిపీల్‌ అండ్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌) 2022 ను జారీ చేసింది. గత ఉత్తర్వులు ప్రకారం కాంట్రాక్టు ప్రాతిపదికన చేసిన నియమాకాలన్నీ తాజా ఉత్తర్వులు అమలులోకి వచ్చిన తేది నుండి రెగ్యులర్‌ నియమాకాలుగా మారుతాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో దీనికి భిన్నమైన స్థితి. ' అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం. ... సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్‌ సోర్సింగ్‌ వారికి న్యాయం చేస్తాం.' అంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఒడిషా ప్రభుత్వ తాజా నిర్ణయం నేపధ్యంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
 

                                                                      రాష్ట్రంలో ఎందరు...?

రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వున్నారు. ఇందులో కాంట్రాక్టు పద్దతిలో 70వేల మంది పనిచేస్తుండగా మిగిలిన 2.30లక్షల మంది అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద పనిచేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అదే నిబందనల కింద పనిచేసేందుకు ఆప్కాస్‌ కార్పోరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూలైలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం అంటూ మంత్రుల కమిటిని వేసింది. 2019 నవంబర్‌లో మంత్రుల కమిటికి సలహాలు ఇచ్చేందుకని అధికారుల కమిటిని వేసింది. 2020 మార్చి 31లోపు నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2020 మార్చి31లోపు ఇవ్వలేక పోవడంతో 2020 జూన్‌30నాటికి ఇవ్వాలని మరోసారి గడువును పెంచింది. అయినా ఫలితం శూన్యం. ఈ ఏడాది మే24 సిఎస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తే ప్రభుత్వానికి రూ632 కోట్ల వ్యయం అవుతుందని నివేదికను పంపారు.

                                                          ప్రభుత్వం మాట నిలుపుకోవాలి : గఫూర్‌

ఒడిశాను స్పూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. ఒడిషా ప్రభుత్వం ఇప్పటిదాకా వున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ భవిష్యత్‌లో కాంట్రాక్టు వ్యవస్థ వుండకూడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. . తెలంగాణాలో విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేశారని, పంజాబ్‌లో పదేళ్ల సర్వీస్‌ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా రెగ్యులర్‌ అయ్యే విధానంను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఇప్పటివరకు ఒక విధానం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.