Jul 20,2023 06:28

మన రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో నర్సరీ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్‌ పేరిట భారీగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 1994లో జీవో నెంబర్‌1 లో ఒకసారి, 2008లో జీవో నెం.90, 91, 92లో మరోసారి ప్రైవేటు విద్యాసంస్థలు పాటించాల్సిన నియమ నిబంధనలను పేర్కొన్నది. ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 1994 జీవో నెంబర్‌1 ప్రకారం ఫీజులను నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్‌, ప్రిన్సిపల్‌, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇద్దరు, విద్యార్థి సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 5 శాతానికి మించి తీసుకోవడానికి వీల్లేదు. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని టీచర్లకు వేతనాలుగా ఇవ్వాలి. 15 శాతం వరకు పాఠశాల నిర్వహణ, విద్యుత్‌, అద్దె ఖర్చులు, 15 శాతం స్కూల్‌ అభివృద్ధికి ఉపయోగించాలి. 15 శాతం ఫీజును స్కూల్‌ సిబ్బందికి బీమా, భవిష్య నిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జీవో నెం.90, 91, 92 ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండాలి. ఈ కమిటీ పాఠశాలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితి చూసి ఎంత ఫీజులు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ప్రభుత్వ పరంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. జీవో నెంబర్‌ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే జిల్లా ఫీజ్‌ రెగ్యులేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి.

  • ఇష్టారాజ్యంగా ఫీజులు పెంపు...

ఎలాంటి అనుమతి లేకుండా ఏటా 20 నుంచి 30 శాతం ఫీజులను యాజమాన్యాలు యథేచ్ఛగా పెంచుతూ వెళ్తున్నాయి. జీవో నెంబర్‌ 91 ప్రకారం దరఖాస్తు రుసుము రూ.100, అడ్మిషన్‌ ఫీజు రూ.500 మాత్రమే తీసుకోవాలి. పాఠశాలలో పుస్తకాలు, విద్యా సామగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలు పెట్టకూడదు. సెక్షన్‌ 8(1) ప్రకారం విద్యాసంస్థ పేర్లకు ఇంటర్నేషనల్‌, ఐ.ఐ.టి, ఒలంపియాడ్‌, కాన్సెప్ట్‌, ఈ టెక్నో వంటి పదాలను చేర్చకూడదు. జీవో 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణ కు చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక సామగ్రిని అందుబాటు లో ఉంచాలి. కానీ ఏ ఒక్క ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అగ్నిమాపక సామగ్రిని పూర్తి స్థాయిలో పెట్టడం లేదు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల వివరాలను నోటీస్‌ బోర్డులో పెట్టాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాల్సి ఉంటుంది.

  • మా పాఠశాల.. మా ఇష్టం..?

'మా ఇష్టం' అన్నట్లు ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలంటే ఆ విద్యాసంస్థల్లో ఎన్నో సదుపాయాలు ఉండాలి. విద్యార్థులకు వసతులు కల్పించాలి. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలో అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫైర్‌ సేఫ్టీ లేదు. విద్యార్థులకు క్రీడలకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉండాలి. విశాలమైన ఆటస్థలం ఉండాలి. కానీ రాష్ట్రంలో 80 శాతం పాఠశాలలకు ఈ సౌకర్యాలు లేవు. ఇరుకు గదులు, అపార్ట్‌మెంట్లలో పాఠశాలలు నడుస్తున్నాయి. ఇలా అనేక రకాలుగా దోపిడీ జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం దారుణం. దీని వల్ల రాష్ట్రంలో విద్య వ్యాపార వస్తువుగా మారుతున్నది. విద్యాహక్కు చట్టం అమలు, దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు...అందరూ ఐక్యంగా ఉద్యమించాలి.

- ఎం.సోమేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు,
సెల్‌:9010849524