Jul 20,2023 06:33

ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ)-2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి సంతోషించారు. జీవన పరిస్థితులను ''గణనీయం''గా మెరుగుపరచినందున ఈ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు, తమ పాలన కూడా వుంది గనుక, మరీ డబ్బా కొట్టుకుంటే జనం నవ్విపోతారు గనుక కాషాయ దళాలు కాస్త తగ్గి ఉన్నట్లు కనిపిస్తోంది. సున్నా కంటే ఒకటి విలువ ఎంతో ఎక్కువ అన్నట్లుగా దీని గురించి సానుకూల వైఖరితోనే మంచి చెడ్డలను చూద్దాం. ఈ సూచికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి), ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్ర, మానవ అభివృద్ధి చొరవ (ఓపిహెచ్‌ఐ) సంస్థ ఉమ్మడిగా రూపొందించాయి. ప్రభుత్వాలు అందించిన సమాచారాన్ని విశ్లేషించి వివరాలను వెల్లడించారు. ఇది ఒక్క మన దేశం గురించే కాదు, అన్ని దేశాల గురించీ 2010 నుంచి ప్రతి ఏటా ఇలాంటి సమాచారాన్ని ప్రకటిస్తున్నారు. వివిధ అంశాల ప్రాతిపదికన జీవన నాణ్యతను లెక్కిస్తున్నారు. మన దేశంలో 2005-06 నుంచి 2019-2021 వరకు పదిహేను సంవత్సరాలలో వచ్చిన మార్పు ప్రకారం పోషకాహారం, శిశుమరణాలు, స్కూలుకు వెళ్లే సంవత్సరాలు, బడికి హాజరు, వంట గ్యాస్‌, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ అందుబాటు, ఇంటివసతి, ఆస్తులు ఎంత మేరకు కలిగి ఉన్నారనేదాని ప్రాతిపదికగా అంచనా వేశారు. 2005-06లో ఇవి లేని వారు దేశ జనాభాలో 55.1 శాతం, 2015-16లో 27.7 శాతం, 2019-2021లో 16.4 శాతం మంది ఉన్నారని ఎంపిఐ సూచికలో పేర్కొన్నారు. మన దేశంలో 41.5 కోట్ల మంది జీవితాలు మెరుగుపడితే చైనాలో 2010-14 మధ్య 6.9 కోట్ల మంది జీవితాలు మెరుగుపడ్డాయి. ప్రపంచ మంతటా 110 దేశాల్లో 110 కోట్ల మంది ఇంకా దారిద్య్రం లో మగ్గుతున్నారు. మన దేశంలో 23 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు ఆఫ్రికాలోని సబ్‌ సహారా, దక్షిణాసియాలో ఉన్నారు. ఈ విశ్లేషణలన్నీ కరోనాకు ముందు ఉన్న సమాచారం ప్రాతిపదికగా చేసినవే, ఆ మహమ్మారి కలిగించిన ప్రతికూల ప్రభావం వలన దారిద్య్రంలోకి దిగజారిన వారు ఇంకా పెరిగారని చెబుతున్నారు.
దారిద్య్రం నుంచి ఇంత మంది బయపడ్డారు అన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దీనికి ఆయా దేశాలు నిర్ణయించిన ప్రమాణాలు తప్ప ప్రపంచమంతటికీ వర్తించే ప్రాతిపదిక లేదు. ప్రపంచబాంకు నిర్వహించే దారిద్య్రం, అసమానతల వేదిక-పావర్టీ అండ్‌ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫాం (పిఐపి) విశ్లేషణ ప్రకారం రోజుకు 2.25 డాలర్లు, అంతకంటే తక్కువ వచ్చే వారు మన దేశంలో 2019లో 11.88 శాతం ఉన్నారు. త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని అనేక మంది చెబుతున్నారు గనుక, దానితో పోలిక ఎలా ఉందో చూద్దాం. 2017 పిపిపి పద్ధతిలో లెక్కించిన మేరకు 2019 నాటి వివరాలు. ఆ ఏడాది సగటున ఒక డాలరుకు రూ.70 మారకపు విలువ ఉంది (జులై 15న ఒక డాలరుకు రూ.82గా ఉంది). కనుక ఎవరికి వారు ఆ రోజున ఉన్న విలువ ప్రకారం లెక్కించుకోవచ్చు. ప్రామాణికంగా డాలర్లను తీసుకున్నారు గనుక ఇక్కడ కూడా దాన్నే తీసుకుందాం. విశ్లేషకులు తీసుకొనే రాబడి అంకెలలో స్వల్ప తేడాలుంటే జనాభా శాతాలు ఎలా మారతాయో కూడా చూద్దాం. ప్రపంచ బాంకు పేర్కొన్న ప్రమాణం ప్రకారమే రోజుకు 2.15 డాలర్ల రాబడిని ప్రాతిపదిక తీసుకుంటే 2015-2019 కాలంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న జనాభా మన దేశంలో 18.7 నుంచి 10 శాతానికి తగ్గగా చైనాలో 1.2 నుంచి 0.1 శాతానికి తగ్గింది. పిఐపి వేదిక సమాచారం మేరకు దిగువ విధంగా ఉన్నారు.
దిగువ అంకెలను బట్టి రోజుకు ఎక్కువ సంపాదించే వారు చైనాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. రాబడిని బట్టి జీవన ప్రమాణాలు, నాణ్యత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. జనాల రాబడితో పాటు ప్రభుత్వాలు అందించే సేవలు కూడా వాటికి తోడౌతాయి. బిజెపి పెద్దలు, కొన్ని మీడియా సంస్థలు మన దేశాన్ని పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ (2016), పాకిస్తాన్‌ (2018)లతో పోల్చి చూపటం తెలిసిందే. వాటి స్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. అచ్ఛే దిన్‌ గురించి ప్రతి దేశంలోని పాలకులూ చెప్పే కబుర్లే కనుక ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి వారే పోల్చుకోవచ్చు.

1

 

2


దక్షిణాసియాలో మన ఇరుగు పొరుగు దేశాల్లో శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖ గురించి ఎవరికి వారే తమదైన సూత్రీకరణలు చేశారు, భాష్యాలు చెప్పారు. వాటి తీరు తెన్నుల గురించి చూద్దాం. ప్రపంచ బాంకు రోజుకు 1.90 డాలర్లుగా అంతకు ముందు నిర్ణయించిన దానిని 2022లో 2.15 డాలర్లకు పెంచింది. దారిద్య్రరేఖ నిర్ణయానికి అన్ని దేశాల ప్రమాణాలు ఒకే విధంగా లేవని ముందే చెప్పుకున్నాం. మన దేశంలో కూడా వివిధ కమిటీలు భిన్న ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. అలఫ్‌ు కమిటీ (1979) ప్రతి రోజూ పెద్దవారికి గ్రామాలలో 2,400, పట్టణాలలో 2,100 క్యాలరీల శక్తి అవసరమని, అందుకు అవసరమైన ఆహారం, దాని ధరలను ప్రాతిపదికగా తీసుకుంది. తరువాత లకడావాలా కమిటీ (1993), టెండూల్కర్‌ కమిటీ (2009), రంగరాజన్‌ కమిటీ (2012)లు దీని గురించి నివేదికలు ఇచ్చాయి. రంగరాజన్‌ కమిటీ పట్టణాల్లో రోజుకు తల ఒక్కింటికి నెలకు రూ.1,407, గ్రామాలలో రూ.972 ఖర్చును దారిద్య్రరేఖ నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకుంది.
మన దేశంలో దారిద్య్రానికి కారణాలుగా దిగువ వాటిని పేర్కొంటున్నారు. జనాభా పెరుగుదల నిరంతరం జరుగుతున్నది, దానికి అనుగుణంగా వస్తు వినియోగ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండటం. దీనికి కారణం కమతాలు చిన్నవిగా ఉండటం, రైతులకు పెట్టుబడి లేమి, నూతన సాంకేతిక పద్ధతుల గురించి తెలియని తనం, సాంప్రదాయ పద్ధతుల్లోనే సాగు, వృధాను అరికట్టలేకపోవటం, దీని వలన జీవన ప్రమాణాలు పెరగటం లేదు అని చెబుతున్నారు. వనరులను సమర్ధవంతంగా ఉపయోగించకపోవటం, ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండటం, పెట్టుబడుల లేమి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, వారసత్వం, కుల వ్యవస్థ కూడా కారణాలుగా పేర్కొంటున్నారు. ఇవి నాణానికి ఒక వైపు మాత్రమే. ఈ అంశాల పరిష్కారానికి పాలకులు అనుసరించిన దివాలాకోరు విధానాలు అసలైన కారణాలు. ఆపరేషన్‌ అవసరమైన చోట పూత మందులు పూసి చికిత్స చేసినట్లుగా అనేక ఉపశమన పథకాలను అమలు జరిపినా ఫలితం ఉండటం లేదు. పరిమితమైన మెరుగుదలను చూపి మొత్తం దారిద్య్రం నుంచి జనాలను బయటపడవేసినట్లు చెబుతున్నారు. దానికి జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు అందమైన పేరు. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు రోజుకు 2.15 డాలర్లు అంటే (ఇప్పటి మారకపు రేటు ప్రకారం) రూ.172 రాబడి ఉంటే దారిద్య్రం నుంచి వెలుపలికి వచ్చినట్లే. దీని ప్రకారం నెలంతా పని ఉందనుకుంటే రాబడి రూ.5160 వస్తుంది. రంగరాజన్‌ కమిటీ ప్రతి వ్యక్తి నెలకు రూ.1,407 ఖర్చు చేస్తే చాలని చెప్పింది. ఇవి నేడున్న స్థితిలో వాస్తవాల ప్రాతిపదికన వేసిన అంచనాలేనా? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనం కూడా నెలకు ఐదున్నర వేలకు అటూ ఇటూగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్‌గా రూ.200, రూ.500 చొప్పున నిర్ణయించింది. అరవై, ఎనభై ఏళ్లు దాటిని వారికి ఇది ఏమూలకు వస్తుందో, ఇతర ఏ ఆధారం లేని పని చేయలేని వారు దానితో ఎలా బతుకులీడుస్తారో అచ్ఛే దిన్‌ కబుర్లు చెప్పేవారు ఎన్నడైనా ఆలోచించారా? దారుణమైన అంశం ఏమంటే 2013 లోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పెన్షన్లు పెంచాలని సిఫార్సు చేసింది. దాన్ని పట్టించుకోవాల్సినంత గొప్పది కాదన్నట్లుగా గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సర్కార్‌ పక్కన పెట్టింది. డిఎంకె సభ్యురాలు కనిమొళి సారథిగా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2023 మార్చి నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దీర్ఘకాలంగా ఎదుగుబొదుగూ లేకుండా ఉన్న ఈ మొత్తాలు ఇప్పుడు దేనీకీ చాలవని, పెంచాలని చేసిన సిఫార్సును కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది పచ్చి నిజం.
మన దరిద్రం గురించి మనమే చెప్పుకుంటే ప్రపంచంలో పలుచన కామా అని కొంతమంది మండి పడతారు. కానీ మన గురించి ప్రపంచం ఎన్నో అంశాలను చెబుతోంది. మన పాలకులు వాటిని దాచిపెడుతున్నారు. ఎవరైనా లేవనెత్తితే రాజద్రోహం అంటున్నారు. ఈ అంశాలను ఎక్కడ చర్చించాలి? ప్రపంచ సంస్థలు ఇచ్చే ర్యాంకులు, సూచికలను అంగీకరించేది లేదు, వాస్తవాలకు ప్రతిబింబం కాదు అంటారు. పోనీ వారు అసలైన అంకెలను వెల్లడిస్తారా అంటే అదీ లేదు. నిజంగా మన దేశం దరిద్రం నుంచి 41.5 కోట్ల మందిని విముక్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాలు చెబుతున్నదేమిటి? కేంద్ర ప్రభుత్వం 2018లో అనీమియా (రక్తహీనత) ముక్త భారత్‌ పథకాన్ని ప్రకటించింది. జీవన ప్రమాణాలను ప్రతిబింబించే వాటిలో ఇది ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత రెండుసార్లు 2015-16లో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌), 2019-21లో ఐదవ సర్వే చేశారు. రక్తహీనత పెరుగుదల తగ్గుదల గురించి ఈ రెండు సర్వేలను పోలుస్తూ కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో పిఐబి ద్వారా సమాచారాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం ఒకటి రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప దేశమంతటా, మెజారిటీ రాష్ట్రాలలో రక్తహీనత ఉన్నవారి సంఖ్య పెరిగింది. దరిద్రం తగ్గితే ఇది కూడా తగ్గాలి కదా!

table

జనాభాను ఆరు బృందాలుగా విభజించి రక్తహీనత పరిస్థితి ఎవరిలో ఎలా ఉందో విశ్లేషించారు (పట్టిక). ఇక్కడ బాలికలు, బాలురు అంటే 15-19 సంవత్సరాల వారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటా విస్తరిస్తాను అని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గానీ సిపిఎం గానీ తమది నమూనా అనే మాటలు చెప్పలేదు. దేశ సగటు కంటే ధనిక రాష్ట్రం గుజరాత్‌లో రక్తహీనత అన్ని తరగతుల వారిలో ఎక్కువగా ఉంది. దానికి విరుద్ధంగా కేరళలో మెరుగైన స్థితి ఉంది. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 121 దేశాలకు గాను మన ర్యాంక్‌ 107గా ఉంది. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి, నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారానికి రాక ముందు 2013లో 120 దేశాలకు మన రాంకు 63గా ఉంది. ఇండెక్స్‌ ముండీ డాట్‌ కామ్‌ సమాచారం 2019 ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు 186 దేశాలకు గాను మనం 32వ స్థానంలో ఉన్నాం, అదే చైనా 141వ స్థానంలో ఉంది. మన కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక 98, బంగ్లాదేశ్‌ 55, నేపాల్‌ 51, భూటాన్‌ 50, మయన్మార్‌ 41, పాకిస్తాన్‌ 33వ స్థానంలో ఉంది. రెండు ఇంజన్ల పాలన ఉంటేనే అభివృద్ధి అని చెప్పేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచలేని వారు జిడిపి గురించి ఎన్ని కబుర్లు చెప్పినా దాని వలన ఫలితం ఏమిటి ?

శారద