Nov 26,2022 07:58

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన జిఓ గురువారం వెలువడినట్లు పేర్కొంది. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పేరిట అమలు చేస్తున్నారు. పథకం అమలుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవసాయశాఖ కొనసాగుతుంది. నోటిఫై చేసిన ఏరియాలో నోటిఫై చేసిన పంటలకు నోటిఫై చేసిన నిబంధనలకనుగుణంగా స్కీం అమలవుతుంది. 2022-23 ఖరీఫ్‌, రబీ సీజన్లకు వర్తిస్తుంది. నోటిఫై చేసిన పంటల్లో వ్యవసాయ పంటలతో పాటు హార్టికల్చర్‌ కూడా ఉన్నాయి. రైతులు తప్పనిసరిగా ఇ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయించాలి. ఇ-కెవైసి పూర్తి కావాలి. సోషల్‌ ఆడిట్‌లో అర్హత సాధించాలి. తక్కువ, ఎక్కువ, అకాల, ముసురు వర్షాలు, ఈదురు గాలులు, వాతావరణంలో తేమను పరిగణనలోకి తీసుకుంటారు. ఎపిఎస్‌డిఇఎస్‌, మండల స్థాయిలో రెయిన్‌గేజ్‌లు, ఇండియన్‌ మెటరాలజీ డిపార్టుమెంట్‌ (ఐఎండి) వెదర్‌ స్టేషన్స్‌ అందించే డేటాను పరిశీలిస్తారు. కరువు, వరద ప్రాంత ప్రకటనలను, ఆ సందర్భంలో ప్రభుత్వ డిపార్టుమెంట్లు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలేవీ వాతావరణ బీమాకు వర్తించవు.