
'నీరే సమస్త జీవులకు ప్రాణం/ అశ్రద్ధ చేస్తే తప్పదు జలరణం/ నీరు మనకు ఎంతో పదిలం/ నిర్లక్ష్యం చేస్తే జీవజాతి శిథిలం/ పొదుపు చేయకపోతే నీరు/ చివరకు మిగిలేది కన్నీరు' అంటాడో కవి. ఈ సృష్టిలో జీవరాశుల మనుగడకు నీరే ప్రాణాధారం. జలం లేనిదే జీవం లేదు. నీటిలోనే జీవం అంకురించింది. నీటితోనే ప్రకృతి మనుగడ కొనసాగుతోంది. పరిశుభ్రమైన నీరు ఆరోగ్యానికి ఆయువు పట్టు. మానవ నాగరికత అంతా జల వనరులతోనే ముడిపడి వుంది. నీరున్న చోటే మనుషులుంటారు. వారు తాగడానికి, తిండి గింజలు పండించుకోడానికీ నీరు కావాలి. కనుకనే చరిత్రలో విలసిల్లిన నాగరికతలన్నీ నీటి లభ్యత వున్న చోటనే వృద్ధి చెందాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి తాగడానికి నీరులేక దాహంతో అల్లాడిపోతుంటే... నీటి లభ్యత వున్న చోట్ల ఆ నీటిని వృధా చేస్తున్నాం. వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. నీటి కొరత, నీటి కాలుష్యం, పారిశుద్ధ్య లోపాల వలన అనేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీరులేక బాధపడుతున్నారు. అందుబాటులో ఉన్న నీరు కలుషితాలతో మనిషి, ప్రకృతి కూడా అనారోగ్యం పాలవుతున్నాయి.
'ఓ నలుగురు/ నీటికి ఊపిరాడకుండా చేసి/ పట్టపగలే భుజాలపై మోసుకెళ్తూ/ తెలిసీ తెలియని తనంతో/ నీరంటే మనిషి గుండె కాయని తెలియక/ బతికుండగానే మంటల్లోకి తోసేస్తున్నార'ని ఓ కవి వాపోతాడు. భూమిపై మూడొంతుల నీరున్నా... నిరుపేద నుంచి సంపన్నుని వరకు, పేద దేశం నుంచి పెద్ద దేశం వరకు నీటికి కటకట తప్పడంలేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి పైగా నివాసిత ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనా. వ్యవసాయంతో సహా ఇతరత్రా అవసరాల కోసం నీటి కొనుగోళ్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం... నీరు మార్కెట్ వస్తువుగా మారిపోయింది. దీంతో 'నీరు ఒక అవసరమే కాని హక్కు కాదు' అని సెలవిస్తున్నారు నయా ఉదారవాద విధాన కర్తలు. నీరు హక్కు అయితే... దాన్ని మనకు అందించే బాధ్యత ప్రభుత్వానిది. అదే ఒక అవసరమైతే... దాన్ని మనమే సమకూర్చుకోవాల్సి వుంటుంది. అదీ 'అవసరానికి', 'హక్కు'కి ఉన్న తేడా. ప్రస్తుతం మన దేశంలో ఏటా 1.8 లక్షల కోట్ల మంచి నీటి వ్యాపారం నీళ్ళ బాటిళ్ల అమ్మకాల ద్వారా జరుగుతోంది. 2023 నాటికి ఇది 4.5 లక్షల కోట్లకు చేరుతుందని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంచనా. వాటర్ ప్యూరిఫైయర్ల ద్వారా జరిగే వినియోగం దీనికి అదనం. ఇదంతా కలిసి లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి దండుకుంటున్నారు. ప్రజలకు తాగునీటిని తన బాధ్యతగా అందించవలసిన పని చేయకుండా... దాన్ని 'అవసరం'గా మార్చి, కార్పొరేట్ సంస్థలకు లాభాలను సమకూర్చి పెడుతున్నాయి.
దేశంలో 80 శాతం వ్యాధులు కేవలం రక్షిత మంచినీరు అందుబాటులో లేనందు వల్ల వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే, మన పాలకులు పోటీపడి కార్పొరేట్ సంస్థలకు నీటిని ధారాదత్తం చేస్తున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడి, రక్షిత నీరు అందుబాటులో వుందని నిర్థారించడానికి నీటి పర్యవేక్షణ ఒక మార్గం. నీటిని పర్యవేక్షించడమంటే తాగునీటిలో ఏ రసాయనాలున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. అలా చేయడం వల్ల నదులు, సరస్సులు, ప్రవాహాలు ఇతర నీటి వనరులు పరిశుభ్రంగా వుంచబడతాయి. నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతోనే 'ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం' జరుపుకుంటున్నారు. నీటి వనరులను పరిరక్షించే విధంగా ప్రజలను చైతన్యపరచడం, వారి అవగాహన పెంపొందించడం దీని లక్ష్యం. 'ఊపిరాడకుండా చేస్తున్న వాళ్ళకు/ ప్రతిరోజు ఊపిరిపోసే దివ్యౌషధం/ నీరేనన్న నాలుగు మంచిమాటలు/ నువ్వో నేనో చెప్పాలి/ నీటిదీపం ఆరిపోకుండా చేతులడ్డుంచి/ తరతరాలకు వెలుగునివ్వాలి' అంటాడో కవి. మంచి చెడ్డలు మాటలవల్ల తెలియవు. చేతలవల్లనే వ్యక్తమౌతాయి. ఆ దిశగా చైతన్యవంతం కావాలి. నీరు లేకపోతే నీవు లేవు, నేను లేను. కనుక, భవిష్యత్తరాల కన్నీటిని తుడవాలంటే... నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి.