Oct 13,2023 15:20

టెహ్రాన్‌: గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు ఆపకపోతే ఇతర సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావచ్చని ఇరాన్‌ హెచ్చరించింది. లెబనాన్‌కు చెందిన హిబ్జుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధంగా ఉందన్న సంకేతం ఇచ్చింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమిరాబ్‌డొల్లాహియాన్‌ గురువారం సాయంత్రం బీరూట్‌కు చేరుకున్నారు. అక్కడ హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ ప్రతినిధులు, లెబనీస్‌ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్‌ దూకుడు, యుద్ధ నేరాలకు పాల్పడటం, ముట్టడి నేపథ్యంలో ఇతర సరిహద్దుల వద్ద వాస్తవ యుద్ధానికి దారి తీయవచ్చని అన్నారు.
కాగా, ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమిరాబ్‌డొల్లాహియాన్‌ గురువారం తెల్లవారుజామున ఇరాక్‌ను సందర్శించారు. ఆ దేశ ప్రధాని మొహమ్మద్‌ షియా అల్‌-సుడానీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అక్కడ కూడా ఇలాంటి ప్రకటన చేశారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆపకపోతే ఆ దేశ ఇతర సరిహద్దుల్లో యుద్ధం ఆరంభమవుతుందని హెచ్చరించారు. మరోవైపు గాజాలోని హమాస్‌కు, లెబనాన్‌లోని హిజ్బుల్లాకు ఇరాన్‌ మద్దతిస్తున్నది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ ప్రమేయంపై ఎలాంటి స్పష్టత లేదు.