Oct 11,2023 08:38

- కొనసాగిన బాంబుల వర్షం
- 1600 మందిపై మృతి
- సర్వం వదిలి లక్షలాది మంది వలస
జెరూసలేం : ఒకవైపు వైమానిక దాడులు మరోవైపు దిగ్బంధం..ఉగ్రవాద నెపం మోపి ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. గాజాపై వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఆహారం, నీరు, ఇంధనం వంటి నిత్యవసరాలు ఆ ప్రాంతంలోకి వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించి అన్నివిధాలా దిగ్బంధం చేస్తోంది. ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ప్రారంభించలేదని, హమస్‌ తెరలేపగా తాము యుద్ధాన్ని ముగిస్తిన్నామని ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహా పేర్కొన్నారు. హమస్‌ దాడిని బూచిగా చూపి అమాయకులపై పాలస్తీనా ప్రజలే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయిల్‌ విరుచుకుపడుతోంది. గాజాపైనా, పరిసర ప్రాంతాలపైనా మంగళవారం కూడా బాంబుల వర్షం కురిపించింది. భవనాలన్నీ శిథిలాల కుప్పలుగా మారాయి. భయకంపితులైన లక్షలాది మంది ప్రజలు సురక్షితంగా వుండే చోటు కోసం వెతుకులాడుతున్నారు. నలుదిక్కులా ఇజ్రాయిల్‌ సైన్యంతో దిగ్బంధించడంతో 'పట్టీ' లాంటి చిన్న ప్రాంతంలో సురక్షితమైన ప్రదేశమే కానరాకుండా పోయింది. ఎటు చూసినా బాంబుల మోతే, ఆర్తనాదాలే. ఆయుధాల గిడ్డంగులు, తయారీ ఫ్యాక్టరీలతో పాటూ సైనిక లక్ష్యాలపై ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు దాడులు కొనసాగిస్తున్నాయి.
గాజాలో బాధితులకు సాయమందించేందుకు మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా సహాయక సంస్థలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. బాధితుల ఆక్రందనలతో ఆస్పత్రులు భీతి గొలుపుతున్నాయి. చాలాచోట్ల ఔషధాలకు కొరత ఏర్పడుతోంది. గాజాలోకి ఆహారం, మందులు, ఇంధన సరఫరాలు ఏవీ వెళ్లకుండా ఇజ్రాయిల్‌ కట్టడి చేసింది. ఈజిప్ట్‌ నుండి వున్న ఏకైక దారిని కూడా మంగళవారం నాడు మూసివేశారు. ఇజ్రాయిల్‌ సైన్యం ఆపకుండా దాడులు కొనసాగిస్తుండడంతో పరిస్థితి బీభత్సంగా మారింది. ఇప్పటికే ఇరు పక్షాల వైపు 1600 మంది మరణించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే వుంటుందని భావిస్తున్నారు. మరోవైపు గాజాలోని హమస్‌, ఇతర మిలిటెంట్‌ గ్రూపులు 150 మందికి పైగా సైనికులను, పౌరులను బందీలుగా వుంచినట్లు ఇజ్రాయిల్‌ పేర్కొంది. మంగళవారం నాడు 3,60,000 మందికి పైగా రిజర్విస్టులను రంగంలోకి దింపడంతో ఈ ఘర్షణలు ఇంకా పెచ్చరిల్లుతాయని భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌ దక్షిణ ప్రాంతంలో హమస్‌ దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై తాము పట్టు సాధించామని ఇజ్రాయిల్‌ సైన్యం మంగళవారం తెలిపింది.