Jun 18,2023 06:40

'చూపుల కన్నా ఎదురుచూపులే తీయనా' అంటాడో కవి. ప్రాచీన సాహిత్యంలో ఎదురుచూపునకు ప్రతీక చాతక పక్షులు. వాన చినుకులను మాత్రమే తాగే చాతక పక్షులు...వాన కోసం, ఆకాశం నిండా ముసురుకొనే నల్లని మబ్బుల కోసం ఎదురుచూస్తుంటాయి. వెన్నెలను మాత్రమే భుజించే చాతకాలు పండువెన్నెల కోసం నిరీక్షిస్తుంటాయి. ప్రేయసీ ప్రియులు ఒకరికోసం ఒకరు, ఒకరి మాటకోసం మరొకరు రోజుల తరబడి ఎదురుచూస్తూనే వుంటారు. రైతు ఎదురుచూస్తుంటాడు ఋతుపవనాల కోసం... కారుమబ్బుల కోసం...ముత్యాల హారాల్లా జారిపడే వాన చినుకుల కోసం. ఎప్పుడెప్పుడు తన పొలంలోని బురదమట్టిలో కాలుమోపి పులకించిపోదామా...తొలకరి చినుకులలో తడిసి ముద్దవుదామా అని. 'ఒకవేళ ఎదురుచూపులు నెరవేరకపోతే ఆశ్చర్యపోవద్దు... జీవితమంటే అంతే' అంటారు బ్రిటిష్‌ మానసిక విశ్లేషకురాలు అనా ఫ్రాయిడ్‌. జీవితంలో ఎదురుచూపులు తప్పనిసరి. ప్రేయసీ ప్రియుల ఎదురుచూపులో ఒక భావుకత వుంటుంది. చాతక పక్షుల ఎదురుచూపులో ఒక మాధుర్యం... నిరీక్షణ వుంటుంది. కానీ, వాన కోసం ఎదురుచూసే రైతు కళ్ల నిండా ఆశ వుంటుంది. ఆ ఆశ వెనుక కన్నీటి వరదగుడి దాగివుంటుంది. ఋతుపవనాలనగానే రైతుల కళ్లలో కోటి ఆశలు మొలకెత్తుతాయి. త్వరగా ఋతుపవనాలు వచ్చి, వర్షాలు పడితే దుక్కిదున్ని, విత్తనాలు సిద్ధం చేసుకొని, నారుమళ్లు పోసుకొని పంటలకు సిద్ధపడదామా అనే ఆతృత వుంటుంది.
ఋతుపవనాలు వస్తున్నాయనగానే ప్రజల మనసుల్లో కాసింత ఉపశమనం కనిపిస్తుంది. మృగశిరలో ముంగిళ్లు చల్లబడతాయనే ఆశ చిగురిస్తుంది. వేసవి ఎండల నుంచి ఊరట లభిస్తుందన్న ఉత్సాహమూ కనిపిస్తుంది. వాస్తవానికి మృగశిర కార్తెలో వచ్చే నైరుతీ ఋతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగేకాలం అంటారు. 'పడమట దిక్కున వరద గుడేసె/ ఉరుముల మెరుపుల వానలు గురిసె/ వాగులు వంకలు ఉరవడి జేసె/ ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె/ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న/ నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న' అంటూ... కోటి ఆశలతో వ్యవసాయానికి సన్నద్ధమౌతాడు రైతు. వర్షాకాలం వచ్చి పది రోజులైంది. మేఘాలు ఉరమటం లేదు. ఆకాశం మెరవటం లేదు. వానలు తరమటం లేదు. ప్రకృతిలో మార్పు కనిపించడంలేదు. 'మృగశిర కార్తెతో మొదలై ఉత్తర కార్తె కొచ్చేసరికి శిఖరం మీంచి దూకే జలపాతంలా రేగిపోవాల్సిన పచ్చదనం ఏదో జబ్బు చేసిన పిల్లాడిలా నీరసంగా పడివుంది' అంటాడు 'మబ్బులు వాలని నేల' నవలా రచయిత. ఒక్కోసారి ఈ కార్తెలో పెద్ద వానలొచ్చి చెరువు కట్టలు తెగిపోయిన ఏడాదులున్నాయి. ప్రస్తుతం ఎక్కడా చినుకు జాడ లేదు. మరోవైపు రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు ఎప్పుడు పడతాయా...అని కళ్ల నిండా ఆశలు నింపుకొని ఎదురు చూస్తున్నారు రైతులు. ఇదిగో ఋతుపవనాలు, అదిగో ఋతుపవనాలు అంటూ గత పది రోజులుగా ఎదురు చూస్తున్న రైతుల కళ్లలోని నీరు ఆవిరవుతున్నా... నింగి నుంచి చుక్క రాలడంలేదు. ఈ నెల 11న రాష్ట్రంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు శ్రీహరికోట నుంచి ముందుకు కదలడంలేదు. దీంతో రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇప్పుడు వ్యవసాయం జూదంలా మారింది. ఈ నేలలో ప్రకృతికీ రైతుకు మధ్య సమతౌల్యం దెబ్బతిన్నది. ఋతువులు గతి తప్పుతున్నాయి. గ్రీష్మతాపానికి గొంతెండి, నెర్రలిచ్చిన భూమి...వాన చినుకు కోసం బేలగా చూస్తున్నది. సినారె చెప్పినట్లు 'బీట వారిన చేల పీయూషములు దేల సాగుమా ఓ నీలిమేఘమా' అంటూ ప్రేమగీతాలు ఆలపిస్తున్నది. 'గగన మదనాలింగ నోత్సాహియై బిగువు నిట్టూర్పు బాహువుల సెగలెగయగా' అంటూ స్వాగత వచనాలు పలుకుతున్నది. ఋతుపవనాల రాకతో వర్షం జూన్‌ మొదటి వారంలో మొదలై... జులై మొదటి వారానికి దేశమంతా వ్యాపిస్తుంది. ఈ సమయంలో వచ్చే వర్షం వ్యవసాయానికి చాలా కీలకం. 'కడవల ఉదకంబు ముంచి తెచ్చి వంచిన గతి' అని మొల్లమాంబ చెప్పినట్లు వర్షాలు పడ్డాయంటే... 'కమ్మని మట్టి వాసనల కానుక లిచ్చెద స్వీకరింపుమా' అన్నట్లుగా భూమి పరిమళాలు వెదజల్లుతుంది. రైతుల కళ్లలో వెలుగులు నిండుతాయి. రైతు ఆనందం ప్రపంచానికిక పండుగే పండుగ!