Nov 14,2023 10:05

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళకు మరిన్ని రంగాల్లో సహకరించాలని వియత్నాం తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. వియత్నాంలోని విన్‌లాంగ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి, వియత్నాం కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు బురు వాన్‌ ఘిమ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో జరిగిన సమావేశంలో తమ ఆసక్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందానికి సోమవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌)లో స్వాగతం పలికింది. ద్వైపాక్షిక సంబంధాలకు అతీతంగా ప్రజలు, వియత్నాం పార్టీతో తనకు భావోద్వేగ బంధం ఉందని బురు వాన్‌ ఘిమ్‌కు ఏచూరి తెలియజేశారు.
         తన తొలి భారత పర్యటనలో భాగంగా ఆయన సిపిఎం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. విన్‌లాంగ్‌, దక్షిణ వియత్నాం ప్రావిన్స్‌, కేరళతో సహకారం గురించి కూడా చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైనా నేతలు చర్చించారు. ఏచూరితోపాటు, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ, నీలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యుడు మురళీధరన్‌తో పాటు భారతదేశంలోని వియత్నాం రాయబారి గుయెన్‌ థాన్‌ హై కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్‌-వియత్నాం వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ పర్యటన 16 వరకు జరగనుంది. గత నెలలో వియత్నాం రాజధాని హోచిమిన్‌ సిటీకి కొచ్చి నుండి డైరెక్ట్‌ ఫ్లైట్‌ సర్వీస్‌ ప్రారంభించిన తర్వాత మరిన్ని రంగాల్లో సహకారం కోసం వియత్నాం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది పర్యాటక రంగానికి ఊతం ఇచ్చింది.