Mar 05,2023 06:29
  • విజయవాడ ఈడ్పుగల్లు శ్ర్రీ చైతన్య క్యాంపస్‌లో సీనియర్‌ ఇంటర్‌ బైపిసి చదువుతున్న విద్యార్థి వర్మ ఆత్మహత్య
  • హైదరాబాద్‌ నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి ఎస్‌ స్వాతిక్‌ ఆత్మహత్య
  • విజయవాడ గూడవల్లి నారాయణ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి ఈశ్వరరెడ్డి ఆత్మహత్య,

మన తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్‌ కళాశాలల ధనదాహంతో వెలుగుచూస్తున్న ఈ తరహా ఘటనల్లో ఇవి మచ్చుతునక. . తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలన్న తల్లిదండ్రులకు చివరకు పిల్లలే లేకుండా పోతున్నారు. కార్పొరేట్‌ కళాశాలల్లో సెంట్రల్‌ జైళ్లను తలపించే విధంగా విద్యావ్యవస్థ ఉండడంతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. విద్యార్థులు హాయిగా చదువుకోవాల్సిన సమయంలో తమ జీవితాలను అర్థాంతరంగా ఆర్పేసుకుంటున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలలంటే మార్కులు, ర్యాంకులే కాదు ఆత్మహత్యలు. విద్యార్థుల మరణాలు కూడా వినిపిస్తాయి. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక భవనాలపై నుంచి దూకి చనిపోయే విద్యార్థులు కొందరైతే... ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థులు మరికొందరు.
ఇరుకిరుకు గదుల్లో, చాలీ చాలని అన్నం పెడుతూ రోజుకు 12 గంటలు, 13 గంటలు చదివించేలా తయారైన కార్పొరేట్‌ కళాశాలల టైం టేబుల్‌ చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఇటు వారి టైం టేబుల్‌కనుగుణంగా చదవలేక, అటు ఆ విషయాలను తల్లిదండ్రులకు చెప్పలేక చాలా మంది విద్యార్థులు వారిలో వారే కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలామంది పిల్లలు తమ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఇంటర్‌ విద్యార్థులే. కార్పొరేట్‌ విద్యాసంస్థలు పెడుతున్న చదువు ఒత్తిడి తట్టుకోలేకనే వారు ఆ తీవ్రమైన చర్యకు పాల్పడుతున్నారనేది కాదనలేని విషయం. తల్లిదండ్రుల ప్రేమను కాదని, తమ భవిష్యత్తును ఊహించుకోలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

  • విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ..

కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయి. ఆ కళాశాలల్లో ఇంటర్‌ చదవాలంటే సంవత్సరానికి 2,20,000 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు బుక్స్‌, యూనిఫామ్‌, క్రీడలకు, ఇతర వాటికి వేలకు వేల రూపాయలు చెల్లించాల్సిందే. తల్లిదండ్రులు ఫీజులు కట్టడం ఆలస్యమైతే విద్యార్థులను గంటల కొద్దీ బయట నుంచోబెట్టడం, కొట్టడం, లాంటి చర్యలకూ పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా... విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల మొత్తం కూడా కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు దండిగా వచ్చాయి. వాటి మధ్య పోటీ కూడా పెరిగింది. ఆయా కళాశాలలకు ర్యాంకులు వస్తున్నాయనే ఉద్దేశంతో వాటినే తల్లిదండ్రులు ఎంచుకుని తమ పిల్లలను వాటిలో చేరుస్తున్నారు. పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉండడం, రోజూవారీ లేదా వారం వారీ పరీక్షలు రాయడం మాత్రమే వారి జీవితంగా మారిపోయింది. ఈ ఒత్తిడి వల్ల విద్యార్థులు కోల్పోతున్న మానసిక స్థయిర్యాన్ని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. అలా ఒత్తిడి గురవుతున్న వారికి కళాశాలలో మానసిక వైద్యులతో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సు కార్యక్రమాలనూ నిర్వహించడం లేదు.

  • కళాశాలలో ఆటలూ...పాటలూ కరువై!

ఆటలు, పాటలు, సరదాలు అన్నీ దూరం. ప్రధానంగా ఇంటర్‌ నుండి విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. విద్య అనేది భవిష్యత్తుకు కీలకం. లేలేత నూనూగు మీసాలతో పలు విషయాలపై అయోమయంలో పడే వయస్సు అది. దేని మీద కూడా స్పష్టత వచ్చే వయస్సు కాదు. పైగా బాహ్య ప్రపంచం అనేది లేకపోవడం, ఇతరులతో సామాజిక సంబంధాల్లోకి వచ్చే వెసులుబాటు లేకపోవడం చదువులో పోటీ పడలేని నిస్సహాయ స్థితికి విద్యార్థులు చేరుకుంటున్నారు. చదవడమో, చావడమో అనే అంతిమ స్థితికి వారిని విద్యాసంస్థలు నెట్టేయడం అసలు కారణం. వారికి నచ్చిన రంగంలో కాలుపెడితే ఆ రంగంలో పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి, ఆ రంగంలో ఎదుగుతారనే భావన దాదాపుగా తొలగిపోవడంతో ఈ పరిస్థితి వస్తోంది.

  • తూతూ మంత్రంగా విద్యాశాఖ చర్యలు

ఈ విద్యా సంస్థలలో కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీ జరుగుతున్నా.... సరైన నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోకపోవడం. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్డ్‌, నీట్‌, ఐఐటి లాంటి పేర్లతో తల్లిదండ్రులని మభ్యపెట్టి వారి దగ్గర నుండి లక్షలాది రూపాయలు దండుకుంటున్నా...ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి వాటిపై ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు....ఈ కార్పొరేట్‌ కళాశాలల్లో జరిగిన ఘటనలపై అనేకమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విద్యాసంస్థలపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే విద్యలో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.

  • గతంలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువులు....

గతంలో పదో తరగతి తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తే అదష్టంగా భావించేవారు. ఎయిడెడ్‌, ప్రభుత్వ కళాశాలల్లో సీటు వస్తే గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ చదివినవారు చాలా మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పెద్దగా డబ్బులు ఖర్చు కాకుండా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు చాలా మందే ఉన్నారు. తమ పిల్లవాడు చదువులో రాణించలేకపోతున్నాడని భావించినప్పుడు తల్లిదండ్రులు వేరే రంగానికి పంపించేవారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. దీన్ని గుర్తించి, తమ పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా ..ఉన్నత విద్యావంతులుగా మలచాలనే బాధ్యత విద్యాసంస్థలదీ, తల్లిదండ్రులదీ. దీన్ని పాటించకపోతే విద్యావ్యవస్థ ప్రమాణాలు దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది.

ఎం సోమేశ్వరరావు,
అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌టిఆర్‌ జిల్లా