Feb 21,2023 06:44

రాజస్థాన్‌ భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం యువకుల సజీవ దహనం బిజెపి అండదండలతో సంఘ పరివారం సాగిస్తున్న మూక దాడుల పరంపరకు కొనసాగింపు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పేరిట నజీర్‌, జునైద్‌లను బుధవారం బజరంగ్‌దళ్‌ గూండాలు కిడ్నాప్‌ చేయగా, మరుసటి రోజు వారి మృతదేహాలు హర్యానా భివాని జిల్లా లోహారు వద్ద దగ్ధమైన బొలేరో కారులో కాలి పడి ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యుల కథనాలను బట్టి ప్రతి కిడ్నాప్‌ చేసిన గూండాలే హత్య చేశారని అర్థమవుతుంది. కానీ ఇటు రాజస్థాన్‌ పోలీసులు అటు హర్యానా పోలీసులు మాత్రం స్పష్టమైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దానిక్కారణం హత్యకు గురైన యువకులది రాజస్థాన్‌ అయితే మృతదేహాలు దొరికింది హర్యానాలో. రాజస్థాన్‌ పోలీసులు అపహరణ కేసు నమోదు చేయగా హర్యానా పోలీసులు అనుమానాస్పద మృతి అంటున్నారు. హంతకులను ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదు. ఈ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్‌... కిడ్నాప్‌ చేసిన ఇద్దరు యువకులను గూండాలు రాష్ట్రం దాటించి వందల కిలోమీటర్లు తరలించడం. ఇదంతా చూస్తుంటే గోగూండాల కిరాతకాలకు వ్యవస్థీకృతంగా పోలీసుల నుంచి మద్దతు ఉందని అనుమానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా బిజెపి అధికారంలో ఉన్న హర్యానాను హంతకులు సేఫ్‌ షెల్టర్‌ జోన్‌ కింద మార్చుకున్నారని ధృవపడుతుంది.
యువకుల హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇటీవలి కాలంలో మేవాంత్‌ ప్రాంతంలో గోగూండాలు చేస్తున్న వరుస హత్యల్లో భాగం. హర్యానా ప్రభుత్వం 2015లో గోవంశ్‌ సంరక్షణ చట్టం తెచ్చిన దగ్గర నుంచి గోగూండాలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే హత్య కావించబడ్డారో అదే గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి ఉమర్‌ఖాన్‌ను 2017లో సంఫ్‌ు పరివార్‌ దుండగులు కాల్చి చంపారు. దానికి కొన్ని నెలల ముందు పాడి రైతు పెహ్లూఖాన్‌ను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికీ వీరి కుటుంబాలకు న్యాయం జరగలేదు. ప్రస్తుత కేసుల్లోనూ బాధితులకు న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. హత్యకు గురైన వారిలో జునైద్‌ పేద వ్యవసాయ కార్మికుడు, నసీర్‌ ట్రక్కు డ్రైవర్‌. వారిని కోల్పోయిన కుటుంబాలు అనాథలయ్యాయి. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన జునైద్‌, నసీర్‌ కుటుంబాలకు ఆపన్న హస్తం అందించి అన్ని విధాలా ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక కుట్ర పూరితంగా ముస్లింలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. రెండవ తడవ మోడీ సర్కార్‌ వచ్చాక విద్వేష దాడులు పెరిగాయి. పాడి రైతులు, పశువుల వ్యాపారులు లక్ష్యంగా సంఫ్‌ు పరివార్‌ దుండగులు సాగిస్తున్న క్రూరమైన అసహన దౌర్జన్యాలు కోకొల్లలు. రాజధాని ఢిల్లీ పక్కనే నోయిడాకు దగ్గరలో 2015 సెప్టెంబర్‌లో ఇంటిలో బీఫ్‌ ఉందంటూ మహ్మద్‌ అహ్లాఖ్‌ను గోగూండాలు పాశవికంగా హత్య చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు విచారణ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రారంభం కావడానికి ఐదేళ్లు పట్టింది. ఇంకా నిందితులెవరో తేల్లేదు. హార్యానా, రాజస్థాన్‌, యుపి, మధ్యప్రదేశ్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో బిజెపి ప్రోద్బలంతో గోసంరక్షణ పేరిట సాయుధ ముఠాలు ముస్లింలు, దళితులపై ఫాసిస్టు తరహా దాడులకు పాల్పడుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు మత విభజనను తీవ్రతరం చేసే విధంగా గోవధను, ఇతర పశువుల వధను పూర్తిగా నిషేధిస్తూ చట్టాలు తెస్తున్నాయి. మాంస వాణిజ్యం సంబంధిత వృత్తుల్లో ఉన్న ముస్లింలను, దళితులను దెబ్బతీసే ఉద్దేశంతో చట్టాలు చేస్తున్నాయి. వాటితో అమాయకులపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధిస్తున్నాయి. ప్రభుత్వాలే మతోన్మాద దాడుల కొనసాగింపునకు సాయుధ గుంపులను ప్రోత్సహిస్తున్నాయి. రాజస్థాన్‌ యువకుల హత్యను ప్రతి ఒక్కరూ ఖండించాలి. మత విద్వేష దాడులను ఏకోన్ముఖంగా వ్యతిరేకించాలి. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధితుల పక్షాన దృఢ చిత్తంతో వ్యవహరించాలి.