- అప్పనంగా 99 ఏళ్లు లీజుకు చేతులు దులుపుకున్న జగన్ సర్కార్
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : 'మేం అధికారంలోకి రాగానే చిత్తూరు, రేణిగుంట సుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం.. విజయ సహకార డెయిరీని విజయం వైపు నడిపిస్తాం' అని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకు 'అమూల్' చేతిలో 'విజయ'ను పెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 ఎకరాల భూములను 99 ఏళ్లు లీజుకు ఇచ్చేస్తూ బుధవారం జరిగిన క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేశారు. లీజు ప్రాతిపదికన ఏడాదికి ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారన్నది గోప్యంగానే ఉంది.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీ దేశవ్యాప్తంగా కోరలు చాస్తోంది. అయితే 'అమూల్ వస్తే తమిళనాడు డెయిరీలు మూతబడే అవకాశం ఉందని, నష్టాల్లో కూరుకుపోతాయి' అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తిప్పి కొట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం అందరికంటే ముందుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే 'అమూల్'కు స్వాగతం పలికేశారు. చిత్తూరు, మదనపల్లిల్లో సహకార పాల డెయిరీలను పున్ణప్రారంభిస్తారన్న ఆశతో ఉన్న పాడిరైతులకు, కార్మికుల కళ్లల్లో కారం కొట్టారు. వాటి ఆస్తులన్నీ 'అమూల్'కు అప్పగించేశారు.
చిత్తూరులో 28 ఎకరాల స్థలాన్ని అప్పనంగా అమూల్ చేతిలో పెట్టారు. క్యాబినెట్‌లో తీర్మానించకముందే చిత్తూరు జిల్లా సహకార కేంద్రం కార్యదర్శి వనజ నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన జేసీబీలతో శుభ్రం చేశారు. క్యాబినెట్ ఆమోదం పొందిందని తెలియగానే అమూల్ డెయిరీకి అధికారికంగా అప్పగించను న్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకుని 32 ప్రైవేట్ డెయిరీలు ఉన్నాయి. వందలాదిమంది ఈ డెయిరీల్లో ఉపాధి పొంది ఉన్నారు. అదే అమూల్ పూర్తిస్థాయిలో పాలసేకరణ ప్రారంభిస్తే చిన్న చిన్న డెయిరీలన్నీ నష్టాల బాట పట్టే అవకాశం ఉందన్న దిగులు చిన్న, మధ్యతరగతి డెయిరీల యాజమాన్యంలో ఉంది.
ముగిసిన విజయ డెయిరీ కథ
1945లో చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిలో 28 ఎకరాల్లో పాడి రైతుల సహకారంతో మూడువేల లీటర్ల పాల సేకరణతో చిత్తూరు విజయ సహకార డెయిరీ ప్రారంభమ య్యింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోని పాడి రైతులకు అండగా నిలుస్తూ 1980-90 మధ్య మూడు లక్షల లీటర్ల పాలను సేకరించి దేశంలో అతి పెద్ద రెండో సహకార డెయిరీగా అభివృద్ధి చెందింది. నెయ్యి అమ్మకం ద్వారానే టిటిడి నుంచి కోటి రూపాయల పైగా అమ్మకం జరిగేది. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో లాభాల బాయటలో పయనిస్తున్న విజయ సహకార డెయిరీ పాడి రైతులకు ఎంతో అండగా ఉండేది. దాదాపు 400 మంది కార్మికులు డెయిరీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేవారు. 2002, ఆగస్టులో విజయ డెయిరీ మూతబడింది. బుధవారం జరిగిన క్యాబినెట్‌లో అమూల్‌కు అప్పగించడంతో విజయ డెయిరీ కథ ముగిసిపోయినట్లే.










