స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యూనివర్సిటీ'. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, కెమెరా మెన్ బాబూరావు దాస్, ఎడిటర్ మాలిక్, సింగర్, లిరిసిస్ట్ విజరు పాల్గొన్నారు. 'ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, ములుగు విజరు ఈ పాటలను గొప్పగా రాశారు. యూనివర్సిటీ లలో పేపరు లీకేజీలు - గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్న పత్రాల్లోనూ పేపరు లీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కొట్టుకుంటూ ఊపిరాడక నేల రాలుతుంటే కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి. వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి? విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ప్రభుత్వాల మీద ఉంది. మన అందరి మీద ఉంది అని చెప్పే చిత్రమే 'యూనివర్సిటీ' అని ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు.










