
ఏలూరు జిల్లాలో సుమారు లక్ష 80 వేల ఎకరాలలో పామాయిల్ పంట పండుతుంది. సుమారు 15 మండలాల్లో పంట సాగు జరుగుతుంది. దీనిలో పని చేసే కార్మికులు 15 వేల మందికి పైగా ఉంటారు. వీరంతా 30 నుండి 40 సంవత్సరాలు లోపువారు. వీరు అనేక సమస్యలతో బాధ పడుతున్నారు. పని చేస్తేనే పూట గడిచే బతుకులు. రైతు పండించే పంటలో 80 శాతం పైగా శ్రమ వీరిదే. పామాయిల్ మొక్క కోసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు పని చేసే కార్మికులకు మాత్రం గుర్తింపు లేదు. వీరు పామాయిల్ తోటల్లో శ్రమ చేసే శ్రమ జీవులు, మట్టి మనుషులు. చెట్ల మీది నుండి కిందపడి, విష పురుగులు కరిచి ప్రాణాలు కోల్పోతున్నా వీరికి ఎంటువంటి రక్షణ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పంటలను రైతులచే సేద్యం చేయిస్తుంది. వాటిలో పామాయిల్ పంట ప్రధానమైనది. రాష్ట్రంలో భూగర్భ జలాలు విస్తారంగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఈ పంట బాగా పండుతుంది. దీని దిగుబడి సాధారణ ప్రాంతాల్లో పండే దానికంటే మెట్ట ప్రాంతంలో రెట్టింపు ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల 57 వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వస్తుందని వరి స్థానంలో పామాయిల్ సాగు చేస్తున్నారు. దీనికి ఉద్యాన, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు పలు రకాల రాయితీలు ఇస్తున్నాయి. ఆయిల్ పామ్ చట్టం 1993, జాతీయ ఆహార భద్రత మిషన్-ఆయిల్ పామ్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం-ఒ.పి) ప్రకారం...రాష్ట్రంలోని అన్ని ఆయిల్ పామ్ కంపెనీలు మరియు ప్రభుత్వం...5 నుండి 40 సంవత్సరాలు పంటలు పండించే రైతులకు రాయితీలు కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంట తీసుకునే ఆయిల్ పామ్ (నవభారత్, గోద్రెజ్) కంపెనీలు ముడి పామాయిల్ ఉత్పత్తిని తీసుకుంటున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ఫ్యాక్టరీలకు అనేక రాయితీలు కల్పిస్తుంది. మొక్క సరఫరాలో 85 శాతం, సాగుకు 4 సంవత్సరాలకు 50 శాతం, తోటలో అంతర పంటలకు 4 సంవత్సరాలకు 50 శాతం రాయితీలు ఇస్తుంది. బోరుబావులకు సేద్యం కోసం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిబంధనలు అనుసరిస్తుంది. ఎకరానికి 3 నుండి 6 టన్నుల పంట పండుతుంది. సుమారు టన్నుకు 20 వేల నుండి 23 వేల వరకు పలుకుతుంది. ఈ పంటలో (వ్యవసాయం) రైతు పడే కష్టానికి కొంత ఆదాయం వస్తుంది. కాని ఈ పంట కోసం పని చేసే కార్మికుల బతుకులు మాత్రం దుర్భరంగా మారుతున్నాయి.
పామాయిల్ తోటల్లో గెలలు, మట్టలు నరికే కార్మికులు, లోడింగ్, అన్ లోడింగ్ చేసే కార్మికులు సుమారు 25 వేల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీరు తొలి పొద్దుకే చేలో పని చేస్తుంటారు. వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు వలసలు పోయి పని చేసుకునే వీరి కష్టాలు వర్ణనాతీతం. పామాయిల్ తోటల్లో మట్టలు, గెలలు నరకడం, వాటిని ఎత్తడం వంటి పనులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు 11 గంటలు పని చేస్తారు. కార్మికుల సగటు వయసు 35 సంవత్సరాలు. వారి ప్రధానమైన పనిలో భాగంగా చెట్లు ఎక్కి మట్టలు, గెలలు నరుకుతున్న సందర్భంలో...చెట్ల గెలల మధ్యలో, మట్టల మధ్యలో ఉన్న విషపు పురుగులు, పొడ పాములు, రక్త పింజర్లు కాటు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పామాయిల్ చెట్టు 20 అడుగుల పైనే ఉంటుంది. పైకి ఎక్కిన సందర్భాలలో కాలు జారి పడిపోయిన కార్మికులు, తాడు తెగి పడిపోయిన కార్మికులు కాళ్ళు, చేతులు, వెన్నుపూసలు విరిగి జీవిత కాలం వికలాంగులుగా మారుతున్నారు. కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి తోడు పామాయిల్ తోటల్లో చెట్ల మధ్యలో విద్యుత్ తీగలపై మట్టలు నరికే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు వదిలిన కార్మికులు ఈ కాలంలోనే 20 మందికి పైగానే ఉన్నారు. వీరికి ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం, విద్యుత్ శాఖ పట్టించుకోవడం లేదు. కుటుంబ సభ్యులు గొడవ చేస్తే రైతు తనకు తోచినంత కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. పామాయిల్ తోటల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కార్మికుల నుండి వస్తున్నది. ప్రమాదాలు జరిగిన సందర్భాలలో సంబంధిత అధికారులు, ప్రభుత్వం, రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యం వారి కుటుంబాలకు అండగా ఉండాలి. కానీ అలా జరగడంలేదు. ప్రమాదాలకు గురైన వారికి నష్టపరిహారం అందకపోవడంతో సదరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వారి కన్నీటిని తుడిచే ప్రభుత్వాలే లేవు. పామాయిల్ కార్మిక సంఘం అండగా ఉంటూ వారి సమస్యలపై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నది.
కార్మికుల కష్టాలు పట్టని ఫ్యాక్టరీలు
రాష్ట్రంలో పామాయిల్ పంట కొనుగోలు చేసే కంపెనీలు నవభారత్, గోద్రెజ్...3ఎఫ్ వంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి యాజమాన్యం కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులకు కష్టం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేస్తున్నాయి.
ఎటువంటి చట్టాలు, హక్కులు లేవు
రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌కు, జిల్లా ఉద్యానశాఖ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వేలాది కార్మికులు వారి పొట్టకూటి కోసం పని చేసే వారికి ఎందుకు గుర్తింపు లేదు? గుర్తింపు ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? లాంటి అనేక అంశాలు కార్మికులలో చర్చనీయాంశంగా మారింది. అందుకే ప్రభుత్వం స్పందించి రక్షణ చట్టం చేయాలని పామాయిల్ తోటల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ పెట్టి శిక్షణ ఇవ్వాలని పామాయిల్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది.
అందని కనీస వేతనం
కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చాయి. కాని నేటికీ అమలుకు నోచుకోకపోవడం సిగ్గు చేటు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మికులకు కనీస వేతనం దక్కకుండా సంస్కరణలు తీసుకొస్తున్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం నేడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 8 గంటలు పని చేసే పామాయిల్ కార్మికునికి రూ.800 ఇవ్వాలి. కాని ప్రస్తుతం రూ.600 ఇచ్చి రైతులు చేతులు దులుపుకుంటు న్నారు. లోడింగ్, అన్‌లోడింగ్ చేసే పురుషులకు అత్యంత దారుణంగా రూ.400, మహిళలకు రూ.250 ఇస్తున్నారు.
డిమాండ్లు...
1.రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 2.ప్రమాదాల్లో వికలాంగులైన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. 3.రైతు, ఫ్యాక్టరీల యజమాన్యం కార్మికులను ఆదుకోవాలి. 4.సబ్సిడీ ద్వారా కార్మికులకు పనిముట్లు ఇవ్వాలి. 5.కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. 6.గెలలు, మట్టలు నరికే వారికి కనీస వేతనం రూ.1000 ఇవ్వాలి. 7.లోడింగ్, అన్‌లోడింగ్ చేసే వారికి రూ.600, పురుషులకు, స్త్రీలకు సమానంగా ఇవ్వాలి. 8.కార్మికులకు అవసరమైన శిక్షణ ప్రభుత్వమే ఇవ్వాలి.
వ్యాసకర్త :పి.రామకృష్ణ ఎ.పి పామాయిల్ సంఘం గౌరవాధ్యక్షులు