Sep 03,2022 06:34

ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలకు తమదైన వేదికలను, ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాలను రూపొందించుకునే స్వేచ్ఛ వుంది. వాటిపై తమ అభిప్రాయం చెప్పడం, ఆమోదించడం లేదా తిరస్కరించడమనేది ప్రజల కర్తవ్యం. సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రజలకు తాము చేసిన హామీలు లేదా వాగ్దానాలను అమలు చేయడం ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ పార్టీ విశేషాధికారం.
ఎన్నికల సందర్భంగా ఉచితాలు ఇస్తామని హామీలు గుమ్మరించే రాజకీయ పార్టీలపై దాఖలైన పిటిషన్లను కొత్తగా ఏర్పాటు చేయబోయే త్రిసభ్య ధర్మాసనానికి జస్టిస్‌ రమణ నివేదించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం చివరి రోజైన ఆగస్టు 26న రమణ ఈ చర్య తీసుకున్నారు. రాబోయే కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఉచితాల విషయంలో సుప్రీం జోక్యం చేసుకోవడమంటే కోర్టు తన ప్రాధాన్యతలను తప్పుగా నిర్దేశిస్తోందనడానికి ఒక ఉదాహ రణగా నిలుస్తోంది. పైగా తన వ్యవహారం కాని రంగంలోకి అత్యున్నత న్యాయస్థానం ప్రవేశిస్తోంది. జులైలో ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, 'బహుమతుల సంస్కృతి'ని తీవ్రంగా విమర్శించడం ద్వారా ఉచితాల తేనె తుట్టను కదిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 సెక్షన్‌ ప్రకారం, అవినీతి పద్ధతుల ఆచరణ పరిధిలోకి ఎన్నికల ముందు రాజకీయ పార్టీ చేసే హామీలు, వాగ్దానాలను తీసుకురావడాన్ని గతంలో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ ఢిల్లీ బిజెపి నేత ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి రమణ నేతృత్వంలోని బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషనర్‌ చేసిన వాదనలను, ప్రతి వాదనలను కూడా కోర్టు వింది. ఈ క్రమంలో, ఎన్నికల సమయంలో ప్రజలకు రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చే విషయమై అయోమయం, గందరగోళంతో కూడిన ఆలోచనలను కోర్టు తెర పైకి తెచ్చింది. విచారణల సమయంలో జస్టిస్‌ రమణ చేసిన కొన్ని వ్యాఖ్యలలో కూడా ఇది ప్రతిబింబించింది. నిజాయితీ గల సంక్షేమ పథకాలతో ఈ ఉచితాలను గందరగోళపరచరాదని ఒకవైపు జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ఎలాంటి సంక్షేమ చర్యలు తీసుకోవాలనేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వం విశేషాధికారంగా వుంటుందని కూడా జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. మరోవైపు, ''అహేతుకమైన ఉచితాలు' గురించి జస్టిస్‌ రమణ మాట్లాడారు. అయితే అహేతుకమైన ఉచితాలను నిర్వచించేందుకు ప్రామాణికాలు ఏంటనేది వివరించలేదు.
ఒక దశలో, ఈ విషయాన్ని పరిశీలించేం దుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం గురించి కూడా బెంచ్‌ మాట్లాడింది. కానీ, ఆ తర్వాత ఇటువంటి కమిటీ ఎదుర్కొనే సమస్యలు, సంక్లిష్టతలను విచారించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.
నరేంద్ర మోడీ ఉచితాల అంశాన్ని లేవనెత్తడం వెనుక గల బూటకపు ఉద్దేశ్యం చాలా స్పష్టంగా వుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు, నగదు బదిలీలను అక్కడ లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రం అమలు చేసే పథకాలన్నింటినీ నిజాయితీ గల సంక్షేమ పథకాలుగా ప్రధాని పరిగణిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అదే తరహా సంక్షేమ పథకాలను ఉచితాలుగా పేర్కొంటూ ఖండిస్తున్నారు. ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద, ప్రతి ఏడాది స్వంత భూమి కలిగిన రైతులకు రూ.6వేలు బదిలీ చేస్తున్నారు. ఇది ఉచితం కాదు, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లేదా ఒడిషా ప్రభుత్వాలు ఇదే తరహాలో అమలు చేసే పథకాలు మాత్రం ఉచితాలుగా ముద్ర వేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలపై గుత్తాధిపత్యాన్ని సాగించాలని ప్రధాని కోరుకుంటున్నారు. ఈ పథకాలను అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని భావిస్తున్నారు. ఈ పథకాల లబ్ధిదారులు కేంద్రానికి రుణపడాలన్నది ఆయన అభిమతంగా వుంది. ఇదే సమయంలో, కార్పొరేట్లకు పన్నుల్లో కోతలు, రుణాల రద్దులను లేదా సంపన్నులకు ఇచ్చే సబ్సిడీలను ఉచితాలుగా ప్రధాని అస్సలు పరిగణించడం లేదు. డిఎంకె కోర్టుకు రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మోడీ ప్రభుత్వం మొదటి మూడేళ్ళ కాలం (2014-17)లో రూ.72 వేల కోట్ల మేరకు అదానీ గ్రూపు రుణాలను రద్దు చేసింది. గత ఐదేళ్ళ (2017-22)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.7.27 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ''ఇవన్నీ కార్పొరేట్లకు ఉచితాలు కావా? ఒకపక్క కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో పన్నుల్లో కోతలు విధించడాన్ని కొనసాగిస్తూ, మరోపక్క పేదలు, అట్టడుగు వర్గాలకు ఆహారం, విద్య, రవాణా సబ్సిడీలు వంటి సంక్షేమ చర్యలను అడ్డుకోవాలనుకోవడంలో ఏం న్యాయం వుంది?'' అని ఆ లేఖ ప్రశ్నించింది. ఆహారం, ఎరువులు, విద్యుత్‌ వంటి వాటికి ఇచ్చే సబ్సిడీలన్నీ ప్రజా వనరులను వృధా చేసేవిగా, ఉచితాలుగా భావించే నయా ఉదారవాద భావన ఇప్పుడు విజ్ఞతగా వుంది. కార్మికులకు బదిలీలు చేసే బదులు అభివృద్ధిని పెంపొందించడం కోసం బడా పెట్టుబడిదారులకు బదిలీ చేయాలంటున్నారు.
పైగా ఈ ఉచితాలు ఆర్థికంగా బాధ్య తారహితంగా వున్నాయంటూ వీటిపై మరో కోణంలో దాడి చేస్తున్నారు. ఇటువంటి అభిప్రాయం జస్టిస్‌ రమణ నేతృత్వంలోని బెంచ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ప్రతి ఫలించింది. ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మా సనం మరింతగా పరిశీలించాలంటూ ప్రస్తా వించింది. ''సంక్షేమం ముసుగు లో పిటిషనర్‌ లేవనెత్తిన ఆందోళనలతో పాటు దీనితో ముడిపడిన ఆర్థిక బాధ్యతను కూడా పరిశీలించాల్సి వుంది'' అని బెంచ్‌ పేర్కొంది.
ఒక పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను, ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంచడం, ఉచితంగా చీరలు, ఇత వస్తువులను పంచడం వంటి అవినీతి పద్ధతులతో పోలుస్తూ గందరగోళ పరిచేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నం జరుగు తోంది.ఈ అవినీతి పద్ధతులకు కఠినంగా స్వస్తి పలకాల్సి వుంది.
రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాలు ఉచితాలు అవునా కాదా అని చర్చించి, నిర్ణయించాల్సిన అవసరం సుప్రీం కోర్టుకు లేదు. ఈ అంశం పూర్తిగా రాజకీయాలకు సంబంధించినది. ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలకు తమదైన వేదికలను, ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాలను రూపొందించుకునే స్వేచ్ఛ వుంది. వాటిపై తమ అభిప్రాయం చెప్పడం, ఆమోదించడం లేదా తిరస్కరించడమనేది ప్రజల కర్తవ్యం. సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రజలకు తాము చేసిన హామీలు లేదా వాగ్దానాలను అమలు చేయడం ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ పార్టీ విశేషాధికారం.
ఉచితాలపై దాడి చేయడమంటే నిజానికి ఆహారం, విద్య, ఆరోగ్యం హక్కుపై, ప్రజల సంక్షేమానికి దోహదపడే అన్ని ఇతర ప్రజా ఉత్పత్తులు, వాటిని అందించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వంపై దాడి చేయడమే అవుతుంది.
 

 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం