- గాజా ఆస్పత్రిపై దాడి ప్రత్యర్థుల పనేనంటూకొత్త భాష్యం
- యుద్ధం తంత్రంపై నెతన్యాహతో మంతనాలు
టెల్ అవీవ్ : గాజా ఆసుపత్రిపై అమానుషంగా దాడి చేసి వందలాది మంది అమాయక పాలస్తీనీయులను చంపడం, పాలస్తీనీయులకు నీరు, ఆహారం, విద్యుత్, ఇంధనం అందకుండా చేసి వారిని నరక యాతనుకు ఇజ్రాయిల్ గురి చేస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ పర్యటనకు బుధవారం విచ్చేశారు. నెతన్యాహుతో మంతనాలు జరిపిన అనంతరం గాజా ఆసుపత్రిపై దాడికి ఇజ్రాయిల్ కారణం కాదంటూ కొత్త బాష్యం చెప్పారు. ఇజ్రాయిల్ పాలస్తీనీయులపై విచక్షణారహితంగా సాగిస్తున్న వైమానిక దాడులను ఆపకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో బైడెన్ పరుగు పరుగున టెల్ అవీవ్‌కు వచ్చారు. గాజా ఆసుపత్రిపై ఇజ్రాయిల్ దాడిని అరబ్ దేశాలతో సహా చాలా దేశాలు ఖండించగా, అమెరికా అధ్యక్షుడు విచారం వ్యక్తం చేయడంతో సరిపెట్టారు. గట్టి బందోబస్తు ఏర్పాట్ల మధ్య విమానం దిగిన వెంటనే బైడెన్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్‌లను ఆలింగనం చేసుకున్నారు. గాజాలోని ఆస్పత్రిపై దాడి ఇజ్రాయిల్ చేసినట్టు లేదు, ఎవరో బయటివారే దీనికి పాల్పడి ఉంటారంటూ ఇజ్రాయిల్‌కు బైడెన్ నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. ప్రధాని నెతన్యాహుతో కలిసి పత్రికా సమావేశంలో పాల్గొన్న ఆయన గాజా ఆస్పత్రిపై దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆస్పత్రిపై దాడికి ఇజ్రాయిల్ కారణం కాదంటూ నెతన్యాహు చెప్పినదా నిని అమెరికా నమ్ముతోందని చెప్పారు. అమెరికా దన్ను చూసుకుని నెతన్యాహు మరింతగా బరితెగించారు. ఇజ్రాయిల్ దాష్టీకాలు, ఆక్రమణ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడని బైడెన్ హమాస్‌పై తన అక్కసునంతా వెళ్లగక్కారు. ఇది పాలస్తీనా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించదని, కేవలం వారికి కష్టాలు, నష్టాలు మాత్రమే కొనితెస్తోందని అన్నారు. ఏది సరైన చర్య అని భావిస్తే ఆ చర్యలు చేపట్టడానికి ఇజ్రాయిల్‌కు బైడెన్ గ్రీన్ సిగల్ ఇచ్చేశారని అల్ జజీరా వార్తా సంస్థ వ్యాఖ్యానించింది. గాజా ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో బైడెన్‌తో ముందుగా నిర్ణయించిన సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఈజిప్టు, జోర్డాన్, పాలస్తీనా అథారిటీ ప్రకటించాయి.
- పెను విపత్తుగా మారకముందే మేల్కోవాలి: పుతిన్
బీజింగ్ : గాజా ఆస్పత్రిపై దాడి పెను విపత్తుగా మారకముందే అంతర్జాతీయ సమాజం మేల్కోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. తక్షణమే చర్చల ద్వారా ఈ ఘర్షణలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. ఆసుపత్రిపై జరిగిన దాడిని భయంకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల అనంతరం పుతిన్ మాట్లాడారు. వందలాది మంది మరణించారు, వందలాదిమంది గాయపడ్డారు, అంటే ఇదొక మహా విపత్తే అని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ఘర్షణలను ముగించాల్సిన అవసరం వుందని ఈ ఘటన తెలియచేస్తోందన్నారు. కాబట్టి వెంటనే చర్చలపై మనం దృష్టి పెట్టాల్సి వుందన్నారు. 1967 నాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాల్సిన అవసరాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు విస్మరించాయని రష్యా పదే పదే విమర్శిస్తూ వస్తోంది. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ఇరాన్, సిరియా, ఈజిప్ట్, పాలస్తీనా, ఇజ్రాయిల్ నేతలతో పుతిన్ మాట్లాడారు. చైనా నేత జిన్‌పింగ్‌తో కూడా దీనిపై చర్చించినట్లు తెలిపారు. ఎవరూ కూడా ఈ ఘర్షణలు పెచ్చరిల్లాలని కోరుకోవడం లేదన్నారు.