
జూన్ రెండవ తేదీతో తెలుగు రాష్ట్రాల విభజన పదో ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బిఆర్‌ఎస్ పార్టీ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నవంబర్ ఒకటవ తేదీనే అవతరణ దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ తొమ్మిదేళ్ల పరిస్థితులపై మీడియా చర్చలు నిర్వహించింది. తెలంగాణ నుంచి అప్పటి ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులు చర్చల్లో పాల్గొంటే ఏ.పి నుంచి మాత్రం ప్రధానంగా నాడు ఈ తతంగానికి చివరిదాకా భాగం పంచుకున్న అప్పటి కాంగ్రెస్ మాజీ ఎంపీలే ప్రతినిధులయ్యారు. పత్రికలలోనూ వివిధ వాదనలతో వ్యాసాలు వచ్చాయి. తెలంగాణలో ఏడాది పొడుగునా ఉత్సవాలు జరపడమే గాక ఏడాది చివరలో ఎన్నికలు వస్తాయి గనక ఎక్కువ వాదోపవాదాలు జరుగుతాయి. అదే ఏ.పి విషయానికి వస్తే వేడుకగా జరుపుకోవడం కంటే విభజన సమస్యలపై దృష్టి ఎక్కువగా వుంటుంది. రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి బకాయిలు, నదీజలాల పంపిణీ వంటి వాటిపై బోలెడు ఫిర్యాదులున్నాయి. వీటికి తెలంగాణ వాదనలు మరో విధంగా వున్నాయి. రావలసిన బకాయిలపైనా ఉభయ రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాల విషయానికి వస్తే కూడా తెలంగాణలో వరుసగా టిఆర్‌ఎస్/బిఆర్‌ఎస్ ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలో కొనసాగుతుంటే ఏ.పి లో మొదటి పర్యాయం చంద్రబాబు నాయుడు టిడిపి సర్కారు తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వైసిపి సర్కారు పాలన సాగుతున్నది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో ఏడాదిలో ఉమ్మడి రాజధాని హోదా ముగిసిపోనుండగా ఏ.పి రాజధాని సమస్య ఎడతెగని ప్రతిష్టంభనగా మారింది. ఇలా రెండు రాష్ట్రాలు రెండు భిన్న దృశ్యాలను తలపిస్తున్నాయి.
- తెలంగాణలో పరిస్థితి
తెలంగాణ ఏర్పడిన తొలి దశలో కెసిఆర్ అవతలి పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి వారంతా కలసి వచ్చినట్టు చెప్పారు. స్వల్ప మెజార్టీతోనే అధికారానికి వచ్చిన టిఆర్‌ఎస్ అధినేత తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుగుతున్నట్టు సమాచారం రావడం వల్లనే ఈ చర్చ తీసుకున్నట్టు చెప్పారు. నెమ్మదిగా తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిల నుంచి చాలామంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. రెండోసారి శాసనసభ ఎన్నికల తర్వాత ఆ లెజిస్లేచర్ పార్టీలే అదృశ్యమయ్యాయనే వాతావరణం కల్పించబడింది. మరోవైపున పాలనాపరంగా కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యధిక ప్రాధాన్యత పెట్టారు. దానికి సంబంధించి అనేక ఆరోపణలు, భారీ అప్పులు కూడా పెరిగాయి గాని దాని ప్రయోజనం తిరుగులేనిదన్న వాదన పైనే ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది. చెరువుల పునరుద్ధరణ, యాదాద్రి పునర్నిర్మాణం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యుదుత్పత్తి, గురుకులాలు, కొత్త జిల్లాలు, రైతుబంధు, దళితబంధు, వైద్యం ఇలా వివిధ పథకాలపై కేంద్రీకరించారు. హైదరాబాద్ అప్పటికే ఐ.టి హబ్‌గా వుంది గనక దాన్ని మరింత వేగవంతం చేశారు. ధనిక రాష్ట్రం అన్న మాట చెబుతూనే వీటి కోసం అప్పులు కూడా భారీగానే చేశారు. మొత్తంపైన కెసిఆర్ పాలనపై తొలి దశలో మొత్తం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కొనసాగింది. మీడియా యుద్ధాలూ సాగాయి. ఉద్యోగుల విషయంలోనూ పలు సమస్యలున్నా సానుకూల నిర్ణయాలు తీసుకుని సద్భావన కోసం కృషి చేశారు. అనేక అంశాల్లో విమర్శలూ వున్నా మొత్తంపైన మిశ్రమ ప్రభావమే కనిపించింది. కరోనా వ్యాప్తికి ముందు వరకూ కెసిఆర్ చాలావరకూ కేంద్రంతో మోడీతో సత్సంబంధాలే నెరిపారు. అయితే బండి సంజరు తదితరుల నాయకత్వం, మోడీ మలి దశ అధికారం వచ్చాక క్రమేణా కేంద్ర విధానాలపై విమర్శలు పెంచారు. రాష్ట్రాల హక్కులకు భంగం, మతతత్వ రాజకీయాలు గట్టిగా వ్యతిరేకించడం మొదలెట్టారు. తన పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చారు. ఈ దశలో బిజెపి తానే అధికారంలోకి వస్తానంటూ హడావుడి చేసి మత రాజకీయాలు పెంచేందుకు ప్రయత్నిం చింది. కాంగ్రెస్‌్ అనైక్యత ఒకవైపు, దేశవ్యాపిత బలహీనత ఒకవైపు వెంటాడాయి. మొత్తంపైన కెసిఆర్ కుటుంబ పాలన అన్నదే ఈ రెండు పార్టీలకూ ప్రధాన నినాదంగా తయారైంది. ప్రతిపక్షాల ఆందోళనలపైనా ప్రభుత్వం తీవ్రంగానే వ్యవరించింది. బిఆర్‌ఎస్‌గా మారాక చుట్టుపక్కల రాష్ట్రాలలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడం ఒక రాజకీయ మార్పు. అయితే ప్రతిపక్ష ఐక్యత పట్ల ఇప్పటికీ బిఆర్‌ఎస్‌కు భిన్న వ్యాఖ్యలు చేస్తుంటుంది. మోడీని దించడమే కీలకం కాదని ప్రభుత్వ నిర్వహణ మారడం కీలకమని అంటుంటుంది. తమకు ఫ్రంట్‌లు, స్టంట్‌ల పట్ల ఆసక్తి లేదని తాజాగా కూడా కెటిఆర్ చెప్పారు. బిజెపిపై పోరాటానికి మద్దతు తెలిపిన వామపక్షాలు మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్‌ఎస్ గెలుపునకు కారణమైనాయి. కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ హడావుడి పెరగ్గా బిజెపి హంగామా తగ్గింది. అనేక చిన్న పార్టీలు కూడా కేవలం బిఆర్‌ఎస్ పైనే కేంద్రీకరించి మతతత్వ రాజకీయాలపై మాట్లాడ్డం లేదు. ఈ మధ్యలోనే నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం వంటి వాటితో కెసిఆర్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం తీవ్రంగానే చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయం మూడో ఎన్నికలతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి నెలకొంది.
- ఏ.పి లో ఏమవుతోంది?
ఏ.పి విషయానికి వస్తే ఈ కాలంలో రెండు ప్రభుత్వాలు మారాయి. చంద్రబాబు ఘోర పరాజయం, జగన్ వైసిపి అసాధారణ మెజార్టీ అక్కడ పరిస్థితిని మార్చేశాయి. చంద్రబాబు గొప్పగా చెప్పుకున్న రాజధాని అమరావతి తొలి దశలో వుండగానే దిగిపోయారు. జగన్ మూడు రాజధానుల విధానం ప్రకటించి లీగల్ రాజకీయ వివాదం చేస్తున్నారు. టిడిపి హైటెక్ విజన్ ప్రచారంతో కాలం గడిపితే జగన్ అచ్చంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాల నిధులు బదలాయించే విధానం పెట్టుకున్నారు. కియా వంటి ఒకటి రెండు కంపెనీలు తప్పితే పెట్టుబడులు రావడం, ఉపాధి కల్పన చాలా సమస్యగా మారాయి. సచివాలయ వాలంటీర్ల ఉద్యోగాలే జగన్ ప్రభుత్వం ప్రధానాంశంగా చెప్పుకుంటుంది. అప్పులు విపరీతంగా పెరిగాయి. పైగా కేంద్రం విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రం మరింత నష్టపోయింది. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, రెవెన్యూ లోటు ప్రతిదీ అసంపూర్ణంగానే మిగిలింది. హైదరాబాదులో ఉమ్మడి సంస్థల నిధుల విభజన కూడా చాలా భాగం మిగిలే వుంది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వంలో కూడా వున్న బిజెపి ఇందులో ఒక్కటైనా పూర్తి చేసేందుకు ప్రయత్నించింది లేదు. జగన్, చంద్రబాబు కూడా బిజెపితో మంచిగా లోబడి వుండటానికి పాకులాడటంతో ఏ.పి పరిస్థితి అధ్వాన్నంగానే తయారైంది. తన పాలన కొనసాగివుంటే అద్భుతమైన అభివృద్ధి జరిగేదని చంద్రబాబు అంటుంటే...తన సంక్షేమ పథకాలే మహత్తరమైనవని జగన్ ప్రచారం సాగుతున్నది. ఉభయులూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి పోరాడవలసింది పోయి దాని మెప్పు కోసం పాకులాడటంలో పోటీ పడుతున్నారు. మధ్యలో జనసేన సరేసరి. ఏతావాతా ఏ.పి అభివృద్ధి వెనకబడి పోవడం కాదనలేని సత్యం. ప్రతిపక్షాలపై నిర్బంధం, అసహన రాజకీయాలు, మీడియా వివాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇన్నిటి మధ్యనా రాష్ట్రంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనలు, భూమి పూజలు పెంచుతున్నా అవి పూర్తి కావడానికి నిధులు కాని, వ్యవధి కాని లేవు. ఆఖరుకు చంద్రబాబు కూడా తన 2020, 2047 విజన్లు పక్కనపెట్టి జగన్ తరహా పథకాలే అమలు చేస్తానని ప్రణాళిక ప్రకటించడం మొదలెట్టారు. ఏమైనా రాజధాని, పోలవరం, రాయలసీమ వంటి సమస్యలేవీ ఎన్నికల లోపు పరిష్కారమయ్యే ఆశలు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విభజితాంధ్రప్రదేశ్ పరిస్థితి అయోమయంగానే తయారైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లాంటి కొత్త సవాళ్లు కూడా ముంచుకొచ్చాయి. ప్రకృతి వనరులూ ప్రజల శక్తియుక్తులకు లోటు లేని ఏ.పి సమగ్రాభివృద్ధి ప్రాంతీయ సమతుల్యత దిశలో అడుగులు వేయాలి. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారి ఏ.పి లోనూ రాజకీయ ప్రవేశం చేసింది గనక రెండు రాష్ట్రాల రాజకీయాలు మాట్లాడుతున్నది.
- సహేతుక పరిష్కారాలు
కొంతమంది అంటున్నట్టు ఇదేదో రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యంగానో నాయకుల గొప్పతనం లేదా లోపంగానో చూడటం పాక్షికమవుతుంది. స్వాభావికంగానే విభజన ప్రభావం రెండు చోట్ల రెండు రకాలుగా వుంది. ఒకరినొకరు పోటీ పెట్టి చూసుకోవడం, చులకన చేసుకోవడం అవాంఛనీయం. ప్రధాన పాలక పార్టీలు ఎక్కడి పాట అక్కడ పాడటం మానాలి. ఎక్కడైనా సరే విధానాలు మారకుండా నాయకుల గొప్పతనమే కీలకమన్న ప్రచారాలు ఆపాలి. విభజన సమస్యలు ఇచ్చిపుచ్చుకునే రీతిలో పరిష్కరించుకోవాలి. కావాలని వాటిని పేరబెట్టిన కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తేవాలి. సహేతుకమైన సత్వర పరిష్కారాలు ఉభయులకూ మేలు చేస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ లౌకిక విలువలనూ మత సామరస్యాన్ని కోరుకుంటారు. ఏ.పి లో పాలక పార్టీలన్నీ బిజెపితో చేరినా ప్రజలు మాత్రం గతంలో వలెనే ఇప్పుడూ మత రాజకీయాలను ఆదరించే ప్రసక్తి వుండదు. ఆ లౌకిక ప్రజాస్వామ్యాన్ని, సహోదర భావాన్ని కాపాడుకోవడమే తెలుగు రాష్ట్రాలకు నిజమైన రక్ష.
తెలకపల్లి రవి